వరుసగా 13వ ఏడాది...
బ్రిస్బేన్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు సన్నాహకంగా జరిగిన బ్రిస్బేన్ ఓపెన్‌లో రష్యా స్టార్ మరియా షరపోవా విజేతగా నిలిచింది. ఈ ఫలితంతో షరపోవా వరుసగా 13వ ఏడాది కూడా తన ఖాతాలో కనీసం ఒక్క డబ్ల్యూటీఏ టైటిల్ జమచేసుకున్నట్టయ్యింది.
శనివారం హోరాహోరీగా సాగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో షరపోవా 6-7 (4/7), 6-3, 6-3తో అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై గెలిచింది. ఓవరాల్‌గా షరపోవా కెరీర్‌లో ఇది 34వ సింగిల్స్ టైటిల్ కావడం విశేషం. విజేతగా నిలిచిన షరపోవాకు 1,95,026 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. కోటి 21 లక్షలు)తోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభిం చాయి. ప్రస్తుతం నంబర్‌వన్‌గా ఉన్న సెరెనాకు, షరపోవాకు మధ్య తేడా కేవలం 681 పాయింట్లు ఉన్నాయి.
ఫెడరర్ @ 999
బ్రిస్బేన్: స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరో మైలురాయికి చేరువయ్యాడు. తన కెరీర్‌లో 999వ విజయాన్ని నమోదు చేసుకోవడంతోపాటు బ్రిస్బేన్ ఓపెన్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను ఓడించాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మిలోస్ రావ్‌నిక్ (కెనడా)తో ఫెడరర్ తలపడతాడు.