పోరాడి ఓడిన యూకీ
మెల్‌బోర్న్: సింగిల్స్ విభాగంలో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ బరిలోకి దిగిన భారత యువతార యూకీ బాంబ్రీ ఆకట్టుకునే ప్రదర్శన ఇచ్చాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఢిల్లీ ఆటగాడు మొదటి రౌండ్‌లోనే ఓడిపోయాడు. అయితే తనకంటే ఎన్నో రెట్లు మెరుగైన ప్రత్యర్థి, ఆరో సీడ్ ఆండీ ముర్రేకు విజయం దక్కడానికి కష్టపడేలా చేశాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 317వ ర్యాంకర్ యూకీ 3-6, 4-6, 6-7 (3/7)తో ప్రపంచ 6వ ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓటమి చవిచూశాడు.
2 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో యూకీ రెండుసార్లు ముర్రే సర్వీస్‌ను బ్రేక్ చేయడం విశేషం. ఐదు ఏస్‌లు సంధించడంతోపాటు మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన యూకీ నెట్‌వద్దకు 33 సార్లు దూసుకొచ్చి 23 సార్లు పాయింట్లు సాధించాడు. మూడో సెట్‌లో ఒకదశలో యూకీ 4-1తో ఆధిక్యంలోకి కూడా వెళ్లాడు. అయితే ఇప్పటికే 35 సార్లు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన అనుభవమున్న ముర్రే వెంటనే తేరుకున్నాడు. వరుసగా మూడు గేమ్‌లు నెగ్గి స్కోరును 4-4 వద్ద సమం చేశాడు.
ఆఖరికి టైబ్రేక్‌లో సెట్‌ను నెగ్గి విజయాన్ని దక్కించుకున్నాడు. అనంతరం యూకీ ఆటతీరును ఈ బ్రిటన్ ప్లేయర్ మెచ్చుకున్నాడు. ‘యూకీ చాలా దూకుడుగా ఆడాడు. అతనిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. అతని ఆటతీరును చూస్తే ర్యాంకింగ్స్‌లో 300కు సమీపంలో ఉండకూడదు. ఈ ఏడాది ముగిసేలోపు అతని ర్యాంక్‌లో చాలా పురోగతి కనిపిస్తుంది’ అని ముర్రే వ్యాఖ్యానించాడు.
మరోవైపు రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), ఏడో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) కూడా శుభారంభం చేయగా... 11వ సీడ్ ఎర్నెస్ట్ గుల్బిస్ (లాత్వియా) మాత్రం తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. ఫెడరర్ 6-4, 6-2, 7-5తో యెన్ సున్ లూ (చైనీస్ తైపీ)పై, నాదల్ 6-3, 6-2, 6-2తో మిఖాయిల్ యూజ్నీ (రష్యా)పై, బెర్డిచ్ 6-3, 7-6 (7/1), 6-3తో అలెజాంద్రో ఫలా (కొలంబియా)పై, దిమిత్రోవ్ 6-2, 6-3, 6-2తో డస్టిన్ బ్రౌన్ (జర్మనీ)పై గెలిచారు. ఐదు సెట్ల హోరాహోరీ పోరులో ఆస్ట్రేలియా యువ ఆశాకిరణం థనాసి కొకినాకిస్ 5-7, 6-0, 1-6, 7-6 (7/2), 8-6తో గుల్బిస్‌ను బోల్తా కొట్టించాడు.
షరపోవా, హలెప్ ముందంజ
మహిళల సింగిల్స్ విభాగంలో తొలి రోజే రెండు సంచలనాలు నమోదయ్యాయి. టాప్-10 లో ఉన్న ఐదో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), తొమ్మిదో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. ఈ ఇద్దరితోపాటు 16వ సీడ్ లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ కార్లా నవారో (స్పెయిన్), 23వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా), 27వ సీడ్ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా), 28వ సీడ్ సబైన్ లిసికి (జర్మనీ), 32వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) కూడా తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించారు.
మరోవైపు రెండో సీడ్ షరపోవా (రష్యా), మూడో సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా), ఏడో సీడ్ యూజిన్ బౌచర్డ్ (కెనడా), పదో సీడ్ మకరోవా (రష్యా) శుభారంభం చేశారు. లూసీ హర్డెకా (చెక్ రిపబ్లిక్) 1-6, 6-3, 6-2తో ఇవనోవిచ్‌పై, ఇరీనా బెగూ (రుమేనియా) 6-4, 0-6, 6-1తో కెర్బర్‌పై సంచలన విజయాలు సాధించారు. షరపోవా 6-4, 6-1తో పెట్రా మార్టిక్ (చెక్ రిపబ్లిక్)పై, హలెప్ 6-3, 6-2తో కరీన్ నాప్ (ఇటలీ)పై, బౌచర్డ్ 6-2, 6-4తో ఫ్రయిడ్‌సామ్ (జర్మనీ)పై, మకరోవా 6-2, 6-2తో మెస్టాచ్ (బెల్జియం)పై నెగ్గారు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉదయం గం. 5.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం