మూడోరౌండ్‌లో షరపోవా
- వీనస్, హలెప్ కూడా...
- బెర్డిచ్, వావ్రింకా ముందంజ
- యూఎస్ ఓపెన్
న్యూయార్క్: తొలి సెట్ కోల్పోయినా పట్టు వదలకుండా పోరాడిన రష్యా అందాల తార మరియా షరపోవా... యూఎస్ ఓపెన్‌లో మూడోరౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఐదోసీడ్ షరపోవా 46, 63, 62తో ప్రపంచ 95వ ర్యాంకర్ డుల్గెర్ (రొమేనియా)పై గెలిచింది. రెండు గంటలా 26 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రష్యా ప్లేయర్ 26 అనవసర తప్పిదాలు చేసింది.
అయితే ప్రత్యర్థి (14) కంటే ఎక్కువ విన్నర్లు (34) సాధించి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో 2వ సీడ్ హలెప్ (రొమేనియా) 62, 61తో సెపలోవా (స్లొవేకియా)పై; 6వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 62, 64తో కుద్రయెత్సోవా (రష్యా)పై; 9వ సీడ్ జంకోవిచ్ (సెర్బియా) 75, 64తో పెరైంకోవా (బల్గేరియా)పై; 10వ సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్) 63, 64తో సస్నోవిచ్ (బెలారస్)పై గెలిచారు. ఎనిమిదో సీడ్ ఇవనోవిచ్ (సెర్బియా) 57, 46తో ప్లిస్కోవా (చెక్) చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది.
శ్రమించిన వావ్రింకా
పురుషుల సింగిల్స్‌లో మూడోసీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చెమటోడ్చి విజయం సాధించాడు. రెండోరౌండ్‌లో అతను 63, 64, 36, 76 (1)తో బెలుచి (బ్రెజిల్)పై నెగ్గాడు. అయితే మ్యాచ్ మధ్యలో ఓ ప్రేక్షకుడు పదేపదే అంతరాయం కలిగించడంతో షటప్ అంటూ వావ్రింకా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇతర మ్యాచ్‌ల్లో 6వ సీడ్ బెర్డిచ్ (చెక్) 63, 64, 63తో హెవిట్ (ఆస్ట్రేలియా)పై; 7వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) 62, 76 (4), 62తో హారిసన్ (అమెరికా)పై; 11వ సీడ్ గుల్బిస్ (లాత్వినియా) 61, 64, 6-2తో షెప్పర్ (ఫ్రాన్స్)పై; 14వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 63, 61 (రిటైర్డ్‌హర్ట్)తో బగ్దాటిస్ (సైప్రస్)పై; 18వ సీడ్ అండర్సన్ (రష్యా) 63, 67 (3), 46, 62, 76 (1)తో కువాస్ (ఉరుగ్వే)పై; 19వ సీడ్ లోపెజ్ (స్పెయిన్) 16, 75, 2-6, 64, 11 (రిటైర్డ్‌హర్ట్)తో డుడిగ్ (క్రొయేషియా)పై గెలిచాడు. 10వ సీడ్ నిషికోరి (జపాన్) 64, 61 (రిటైర్డ్‌హర్ట్)తో అండూజర్ (స్పెయిన్)పై నెగ్గాడు.
మిక్స్‌డ్‌లో సానియా జోడి గెలుపు
మహిళల డబుల్స్‌లో అలవోకగా నెగ్గిన భారత స్టార్ సానియా మీర్జా... మిక్స్‌డ్ డబుల్స్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. బ్రూనో సోరెస్ (బ్రెజిల్) సానియా జోడి 62, 36, 105తో అమెరికా జోడి అలికా బ్లాక్ ఎస్కోబ్డోలపై నెగ్గింది.