చెమట చిందించి... | Rafael Nadal defeats rising star Alexander Zverev | Sakshi
Sakshi News home page

చెమట చిందించి...

Published Sun, Jan 22 2017 1:10 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

చెమట చిందించి...

చెమట చిందించి...

► ప్రిక్వార్టర్స్‌లోకి రాఫెల్‌ నాదల్‌
► జ్వెరెవ్‌పై ఐదు సెట్‌ల పోరులో నెగ్గిన స్పెయిన్  స్టార్‌
► ఆస్ట్రేలియన్ ఓపెన్  టోర్నీ  


మెల్‌బోర్న్‌: మాజీ చాంపియన్  రాఫెల్‌ నాదల్‌కు ఆస్ట్రేలియన్  ఓపెన్  టెన్నిస్‌ టోర్నమెంట్‌లో శనివారం అసలు సిసలు సవాల్‌ ఎదురైంది. జర్మనీ యువతార అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌తో జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో తొమ్మిదో సీడ్‌ నాదల్‌ 4–6, 6–3, 6–7 (5/7), 6–3, 6–2తో విజయం సాధించి ఊపిరి పీల్చుకున్నాడు. 4 గంటల 5 నిమిషాలపాటు జరిగిన ఈ హోరాహోరీ పోరులో నాదల్‌ గట్టెక్కడానికి తన అనుభవాన్నంతా రంగరించాల్సి వచ్చింది. 19 ఏళ్ల జ్వెరెవ్‌ తొలి సెట్‌ను, మూడో సెట్‌ను సొంతం చేసుకొని సంచలనం సృష్టించేలా అనిపించాడు. కానీ 30 ఏళ్ల నాదల్‌ పట్టుదలతో పోరాడి వరుసగా చివరి రెండు సెట్‌లు నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.

కెరీర్‌లో ఏడో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్న జ్వెరెవ్‌ కీలకదశలో తడబడ్డాడు. 19 ఏస్‌లు కొట్టిన జ్వెరెవ్, 11 డబుల్‌ ఫాల్ట్‌లు, 74 అవనసర తప్పిదాలు కూడా చేసి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు నాదల్‌ 11 ఏస్‌లు సంధించి, జ్వెరెవ్‌ సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు. ‘జ్వెరెవ్‌ ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ తెలుసు. ఈ ఆటకు అతను భవిష్యత్‌ ఆశాకిరణం. ఐదు సెట్‌ల మ్యాచ్‌లో నెగ్గినందుకు ఆనందంగా ఉంది’ అని విజయానంతరం నాదల్‌ వ్యాఖ్యానించాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఆరో సీడ్‌ గేల్‌ మోన్ ఫిల్స్‌ (ఫ్రాన్స్ )తో నాదల్‌ ఆడతాడు.

పురుషుల సింగిల్స్‌ ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా) 6–2, 7–6 (7/5), 3–6, 6–3తో గైల్స్‌ సిమోన్  (ఫ్రాన్స్ )పై, మోన్ ఫిల్స్‌ 6–3, 7–6 (7/1), 6–4తో కోల్‌ష్రైబర్‌ (జర్మనీ)పై, ఎనిమిదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా) 6–1, 4–6, 6–4, 6–4తో బెనోయిట్‌ పెయిర్‌ (ఫ్రాన్స్ )పై, 11వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్ (బెల్జియం) 6–3, 6–2, 6–4తో 20వ సీడ్‌ ఇవో కార్లోవిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

రెండో రౌండ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్  నొవాక్‌ జొకోవిచ్‌ (సెర్బియా)ను బోల్తా కొట్టించిన డెనిస్‌ ఇస్టోమిన్  (ఉజ్బెకిస్తాన్ ) అదే జోరును కొనసాగిస్తూ... మూడో రౌండ్‌లో 6–4, 4–6, 6–4, 4–6, 6–2తో కరెనో బుస్టా (స్పెయిన్ )పై విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో 13వ సీడ్‌ బాటిస్టా అగుట్‌ (స్పెయిన్ ) 7–5, 6–7 (6/8), 7–6 (7/3), 6–4తో 21వ సీడ్‌ డేవిడ్‌ ఫెరర్‌ (స్పెయిన్ )పై, 15వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) 6–3, 6–2, 6–4తో 18వ సీడ్‌ రిచర్డ్‌ గాస్కే (ఫ్రాన్స్ )పై గెలిచారు.

సెరెనా సులువుగా...
మహిళల సింగిల్స్‌ విభాగంలో రెండో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా), ఐదో సీడ్‌ ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌), తొమ్మిదో సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్ ) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టగా... ఆరో సీడ్‌ సిబుల్కోవా (స్లొవేకియా) మూడో రౌండ్‌లోనే నిష్క్రమించింది. సెరెనా 6–1, 6–3తో నికోల్‌ గిబ్స్‌ (అమెరికా)పై, ప్లిస్కోవా 4–6, 6–0, 10–8తో ఒస్టాపెంకో (లాత్వియా)పై, జొహనా కొంటా 6–3, 6–1తో మాజీ నంబర్‌వన్  వొజ్నియాకి (డెన్మార్క్‌)పై నెగ్గారు. సిబుల్కోవా 2–6, 7–6 (7/3), 3–6తో మకరోవా (రష్యా) చేతిలో ఓడింది.

2 గంటల 33 నిమిషాలపాటు జరిగిన మరో మ్యాచ్‌ లో గావ్రిలోవా (ఆస్ట్రేలియా) 6–3, 5–7, 6–4తో 12వ సీడ్‌ బాసిన్ స్కీ (స్విట్జర్లాండ్‌)ను ఓడించింది. 16వ సీడ్‌ స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–2, 7–5తో 21వ సీడ్‌ కరోలినా గార్సియా (ఫ్రాన్స్ )పై, బ్రాడీ (అమెరికా) 7–6 (7/4), 6–2తో 14వ సీడ్‌ వెస్నినా (రష్యా)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లారు.  

మిక్స్‌డ్‌లో సానియా జంట శుభారంభం  
మరోవైపు మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో భారత క్రీడాకారులు సానియా మీర్జా,రోహన్  బోపన్న తమ భాగస్వాములతో కలిసి శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో సానియా మీర్జా–ఇవాన్  డోడిగ్‌ (క్రొయేషియా) జంట 7–5, 6–4తో రెండో సీడ్‌ లారా సిగెమండ్‌ (జర్మనీ)–మాట్‌ పావిక్‌ (క్రొయేషియా) ద్వయంపై సంచలన విజయం సాధించగా... రోహన్  బోపన్న–గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జోడీ 6–4, 6–7 (5/7), 10–7తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో మైకేల్‌ వీనస్‌ (న్యూజిలాండ్‌)–కాటరీనా స్రెబోత్నిక్‌ (స్లొవేనియా) జంటపై గెలిచింది. బాలుర సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సిద్ధాంత్‌ బంతియా (భారత్‌) 6–2, 6–7 (3/7), 5–7తో అలెగ్జాండర్‌ క్రానోక్రాక్‌ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోగా... బాలికల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో జీల్‌ దేశాయ్‌ (భారత్‌) 6–4, 3–6, 7–5తో కైట్లిన్  స్టెయిన్స్  (ఆస్ట్రేలియా)పై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement