సెరెనా X షరపోవా | Australian Open: Serena Williams, Maria Sharapova to meet in final | Sakshi
Sakshi News home page

సెరెనా X షరపోవా

Published Fri, Jan 30 2015 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

సెరెనా X షరపోవా

సెరెనా X షరపోవా

ఆరంభ దశలో ఎలాంటి సంచలనాలు నమోదైనా... ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల విభాగంలో చివరి దశకు వచ్చేసరికి టాప్ సీడ్స్ ఇద్దరే మిగిలారు.  అమెరికా నల్లకలువ సెరెనా విలియమ్స్, రష్యా అందాలతార షరపోవా ఫైనల్‌కు చేరారు. అటు పురుషుల విభాగంలో క్వార్టర్స్‌లో నాదల్‌ను ఇంటికి పంపిన బెర్డిచ్ జోరుకు ఆండీ ముర్రే బ్రేక్ వేశాడు.
 
* మహిళల టైటిల్ పోరుకు టాప్ సీడ్స్
* పురుషుల ఫైనల్లో ముర్రే
* ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్

మెల్‌బోర్న్: ఇప్పటికే 18 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించిన అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్... ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ తన హవా కొనసాగిస్తోంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో టాప్‌సీడ్ సెరెనా 7-6 (7/5), 6-2తో అన్‌సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. గంటా 24 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరువురు క్రీడాకారిణిలు 25 ఏస్‌లతో అలరించారు. అయితే అనుభవలేమితో ఇబ్బంది పడ్డ కీస్ 39 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది.

కీలక సమయంలో డబుల్ ఫాల్ట్‌లు చేయడం కూడా సెరెనాకు కలిసొచ్చింది. తొలిసెట్ ఆరో గేమ్ వరకు మంచి నియంత్రణతో ఆడిన కీస్ ఆ తర్వాత కాస్త నిరాశపర్చింది. ఈ దశలో భారీ సర్వీస్‌లతో చెలరేగిన సెరెనా తన అనుభవంతో వరుసగా పాయింట్లు నెగ్గింది. అయితే 12వ గేమ్‌లో కీస్ అద్భుతమైన ఏస్‌ను సంధించడంతో గేమ్ టైబ్రేక్‌కు దారితీసింది.

కానీ టైబ్రేక్‌లో కీస్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయింది. ఊహించని రీతిలో రెండు ఏస్‌లను సంధించిన సెరెనా 4-1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత రెండు సెట్ పాయింట్లను కాచుకోవడంతో పాటు తిరుగులేని సర్వీస్‌ను సంధించి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో సెరెనా మరింత దూకుడుగా ఆడింది. కీస్ చేసిన డబుల్ ఫాల్ట్‌ను ఆసరాగా చేసుకుని 5-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ దశలో కీస్ ఏడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుంది.  కానీ చివర్లో సెరెనా కొట్టిన ఏస్‌కు సమాధానం చెప్పలేక సెట్‌తో పాటు మ్యాచ్‌నూ అప్పగించేసింది.
 
షరపోవా అలవోకగా...
మరో సెమీస్‌లో రెండోసీడ్ షరపోవా (రష్యా) 6-3, 6-2తో అలవోకగా 10వ సీడ్ ఎకతెరినా మకరోవా (రష్యా)పై నెగ్గింది. గంటా 27 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా మూడు ఏస్‌లు సంధించగా, మకరోవా ఒక్కటి కూడా కొట్టలేకపోయింది. అయితే 29సార్లు అనవసర తప్పిదాలు చేయడంతో పాటు ఆరు బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఒక్కదాన్ని మాత్రమే కాపాడుకుంది. నెట్ వద్ద సూపర్‌గా ఆడిన షరపోవా తొమ్మిది బ్రేక్ పాయింట్లతో నాలుగింటిని కాచుకుంది. కీలక సమయంలో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయడంతో పాటు తన సర్వీస్‌ను నిలబెట్టుకుంది. శనివారం జరిగే ఫైనల్లో షరపోవా... సెరెనాతో తలపడుతుంది.
 
బెర్డిచ్‌కు ముర్రే చెక్
పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఆరోసీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) 6-7 (6/8), 6-0, 6-3, 7-5తో ఏడోసీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. దాదాపు మూడున్నర గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముర్రే 15 ఏస్‌లు కొట్టగా, బెర్డిచ్ ఐదింటితో సరిపెట్టుకున్నాడు. అయితే బ్రేక్ పాయింట్లను కాచుకోవడంలో బ్రిటన్ ఆటగాడు పైచేయి సాధించగా, చెక్ ప్లేయర్ వెనుకబడిపోయాడు. 56 అనవసర తప్పిదాలు, ఆరుసార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసి మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు. పురుషుల విభాగంలో రెండో సెమీఫైనల్ నేడు వావ్రింకా, జొకోవిచ్‌ల మధ్య జరుగుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement