సెరెనా మరో అరుదైన రికార్డు!
న్యూయార్క్: ఈ ఏడాది జూలైలో జరిగిన వింబుల్డన్లో విజేతగా నిలవడం ద్వారా 22 గ్రాండ్ స్లామ్ ట్రోఫీలతో స్టెఫీగ్రాఫ్ సరసన నిలిచిన నల్లకలువ, అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ ... తాజాగా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్లో రెండో రౌండ్లో విజయం సాధించిన సెరెనా.. అత్యధికంగా 306 గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ మ్యాచ్ల్లో విజయం సాధించిన మార్టినా నవ్రతిలోవా రికార్డును ను సమం చేసింది. భారతకాలమానం ప్రకారం గురువారం ఆర్థర్ యాష్ స్టేడియంలో అర్దరాత్రి జరిగిన పోరులో సెరెనా 6-3, 6-3 తేడాతో తన సహచర అమెరికా క్రీడాకారిణి వెనియా కింగ్పై విజయం సాధించి మూడో రౌండ్లోకి ప్రవేశించింది.
ఈ మ్యాచ్లో 13 ఏస్లను సంధించిన సెరెనా, 38 విన్నర్స్ ను సొంతం చేసుకుని విజయం సాధించింది. ఆద్యంత దూకుడుగా ఆడిన సెరెనా ధాటికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ సాధించిన వెనియా కింగ్ వద్ద సమాధానమే లేకుండా పోయింది. తొలి సెట్ ను అవలీలగా గెలిచిన సెరెనా.. రెండో సెట్ లో కూడా అదే ఊపును కనబరిచి వరుస సెట్లలో పోరును ముగించింది. ఈ మ్యాచ్కు ముందు పదే పదే వర్షం ఆటంకం కల్గించడంతో స్టేడియంలో రూఫ్ను ఏర్పాటు చేయడం విశేషం. ఇప్పటివరకూ 17 సార్లు యూఎస్ ఓపెన్ లో పాల్గొన్న సెరెనాకు ఇలా రూఫ్ కింద ఆడటం, గెలవడం ఇదే తొలిసారి. ఇప్పటికే ఆరు యూఎస్ ఓపెన్ లు గెలిచిన సెరెనా.. ఏడో టైటిల్ పై కన్నేసింది. ఒకవేళ యూఎస్ గ్రాండ్ స్లామ్ ను సెరెనా సాధిస్తే ఓపెన్ ఎరాలో అత్యధిక టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.