పవర్ ఆఫ్ సెరెనా | power of serena | Sakshi
Sakshi News home page

పవర్ ఆఫ్ సెరెనా

Published Mon, Dec 28 2015 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 PM

పవర్ ఆఫ్ సెరెనా

పవర్ ఆఫ్ సెరెనా

•  సెరెనా  విలియమ్స్ బయోగ్రఫీ 

 ఎత్తు:  5 అడుగుల 9 అంగుళాలు  (1.75 మీటర్లు) బరువు: 70.5 కిలోలు ఆమె షూ సైజ్ 10
  సెరెనా గరిష్ట సర్వీస్ స్పీడ్
 గంటకు 207 కిలోమీటర్లు. టెన్నిస్ చరిత్రలో మహిళల్లో  అత్యధిక వేగంతో (210.8) సర్వీస్ చేసింది జర్మనీ క్రీడాకారిణి లిసికి.

 పదేళ్లు కూడా లేని పసితనంలోనే వర్ణవివక్ష సమస్యలు ఎదురైతే... అవి జీవితాంతం వెంటాడుతుంటే ఎవరికైనా కసి పెరుగుతుంది. ఆ కసిని పాజిటివ్ ఎనర్జీగా మలుచుకుంది సెరెనా విలియమ్స్. చరిత్రలోనే అతి గొప్ప టెన్నిస్ స్టార్‌గా ఎదిగింది. స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్ మ్యాగజైన్ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు గెలుచుకుంది.

 
 ఓటమితో ఎప్పుడూ కుంగిపోకూడదు. తిరిగి లేవాలి. మరింత కష్టపడాలి. మరింత సాధన చేయాలి. నేను జీవితంలో ప్రతిసారీ అదే చేశాను. ఎప్పుడూ వదలొద్దు అని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆ విషయాన్ని మనసులోకి తీసుకుని పోరాడితేనే తిరిగి మళ్లీ పైకి లేవగలుగుతాం. అందుకే ఎప్పుడూ దేని గురించి నిరాశ చెందకూడదు. తిరిగి పోరాడాలి.

 మానసిక బలమే...
 సెరెనా టెన్నిస్ ఆడుతుంటే ప్రత్యక్షంగా చూడటం చాలా బాగుంటుంది. మ్యాచ్‌లో వెనకబడిన సమయంలో తనని తాను ప్రోత్సహించుకోవడానికి కేకలు పెడుతుంది. ఇక ఓ గొప్ప పాయింట్ సాధించినప్పుడు తన అరుపు ప్రత్యర్థికే కాదు... ప్రేక్షకుల్లోనూ భయం పెంచుతుంది. ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉంటుందో... మెంటల్‌గా కూడా అంతే బలంగా ఉండటం సెరెనా విజయ రహస్యం. అయితే దీనిని తెచ్చింది మాత్రం ఆమె బాల్యమే.
 
వామ్మో... సిస్టర్స్!
1999 నుంచి 2003 వరకు సెరెనా సిస్టర్స్‌ది స్వర్ణయుగం. ఏ టోర్నీ జరిగినా సింగిల్స్‌లో వాళ్లే. డబుల్స్‌లో వాళ్లే. తర్వాత గాయాలు, ఫామ్‌లేమి కారణాలతో కాస్త వెనకబడ్డా... తిరిగి 2009-10 సమయానికి తిరిగి మళ్లీ ప్రపంచాన్ని వణికించారు. కానీ క్రమంగా అక్క ఆట తేలిపోయింది. దీంతో సెరెనా సింగిల్స్‌కే పరిమితమైంది.



 ఆ ఫిట్‌నెస్‌కు సలామ్
ప్రస్తుతం సెరెనా వయసు 34 సంవత్సరాలు. ఫెడరర్ వయసు కూడా అంతే. అయితే ఫెడరర్ మీద వయసు ప్రభావం ఎంతో కొంత కనిపిస్తోంది. కానీ అదేంటో సెరెనా మాత్రం రోజు రోజుకూ మరింత ఫిట్‌గా తయారవుతోంది. ప్రొఫెషనల్ టెన్నిస్ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయినా... మధ్యలో అనేక సార్లు గాయాల గండాలను అధిగమించినా... ఇంకా ఆ ఫిట్‌నెస్ అలాగే ఉంది.


 రికార్డులు
 ఇప్పటివరకు సెరెనా 21 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్, 13 డబుల్స్ టైటిల్స్, 2 మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్స్ సాధించింది.
 అటు పురుషుల్లోగానీ, ఇటు మహిళల్లోగానీ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ‘కెరీర్ గోల్డెన్‌స్లామ్’ (నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తోపాటు ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గడం)  సాధించిన ఏకైక ప్లేయర్ సెరెనాయే.
 మహిళల క్రీడా ప్రపంచంలో ఇప్పటివరకు టోర్నమెంట్‌ల ద్వారా అత్యధిక ప్రైజ్‌మనీ (7 కోట్ల 40 లక్షల 83 వేల 421 డాలర్లు-రూ. 489 కోట్లు) సంపాదించిన క్రీడాకారిణిగా గుర్తింపు.
 30 ఏళ్ల వయసు దాటాక ఎనిమిది గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన ఏకైక క్రీడాకారిణిగా గుర్తింపు.
 
 నిజమైన చాంపియన్
 సెరెనాతో ఆడటం ఎవరికీ సులభం కాదు. ఎందుకంటే తను ఏ పాయింట్ కూడా సులభంగా ఇవ్వదు. బ్రేక్ పాయింట్ దగ్గర అయినా, మ్యాచ్ పాయింట్ దగ్గర అయినా ఏ దశలో అయినా ప్రత్యర్థి తన శక్తినంతా ఉపయోగించి  పోరాడితేనే పాయింట్ దక్కుతుంది. అందుకే సెరెనా నిజమైన చాంపియన్  
                      - షరపోవా
 
  మోడల్‌గా ఉన్నారా?
 ఫ్యాషన్ డిజైనర్. సొంతంగా స్విమ్ సూట్స్, ఇన్నర్‌వేర్ ఉత్పత్తులను తయారు చేస్తుంది. న్యూయార్క్ ఫ్యాషన్ షోలో కనిపిస్తుంది. తన ఉత్పత్తులకు తనే మోడల్.
 
  బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంత సంపాదించారు?
 స్పాన్సర్స్ ద్వారా ఏడాదికి 85 మిలియన్ డాలర్లు (రూ.561 కోట్లు) సంపాదిస్తుంది. తనకంటే షరపోవా 90 మిలియన్ డాలర్లు (రూ.594 కోట్లు) ఎక్కువ సంపాదిస్తుంది. ఓవరాల్‌గా ఫెడరర్, షరపోవా తర్వాత స్థానం సెరెనాది.
 
  షూ సైజ్?  10.
  నటన?

 పలు టీవీ సిరీస్‌లలో నటించింది. ఒకట్రెండు సినిమాల్లో చిన్న క్యారెక్టర్స్ వేసింది.
 
  ఇండియా వచ్చిందా?  
  సెరెనా తొలిసారి 2008లో బెంగళూరు వచ్చింది. ఆ సమయంలో ఆమె, అక్క వీనస్ కలిసి చీర కట్టి ఓ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

 

 


 టెన్సిస్ కోర్టులో కన్నీళ్లు పెట్టిన సందర్భం?
 2012 ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్ మ్యాచ్‌లో రెండో సెట్ టై బ్రేకర్‌లో 5-1 ఆధిక్యంలో ఉంది. ఇక ఒక్క పాయింట్ వస్తే టైటిల్ గెలిచేది. ఈ దశ నుంచి మ్యాచ్ పోగొట్టుకుంది. ఈ ఓటమి తర్వాత దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. గాయాల కారణంగా ఏడ్చిన సందర్భాలు ఉన్నా... మ్యాచ్ ఓడిపోయాక బాగా ఎమోషన్ కావడం 2012లోనే.
 
  ప్రేమాయణం
  2002లో కేస్వాన్ జాన్సన్ అనే పుట్‌బాల్ ఆటగాడితో ప్రేమ  2004 నుంచి 2006 వరకు డెరైక్టర్ బ్రెట్ రాట్నర్‌తో ప్రేమ  2007 నుంచి ఏడాది పాటు నటుడు జాకీలాంగ్‌తో ప్రేమాయణం  2008 నుంచి రెండు సంవత్సరాల పాటు కామన్ అనే పేరున్న సింగర్‌తో ప్రేమలో గడిపింది  అమెరికా బాస్కెట్‌బాల్ లీగ్ ఎన్‌బీఏలో ప్లేబోయ్‌గా పేరున్న స్టోడిమేర్‌తో 2010లో కొంతకాలం ప్రేమాయణం  2011లో కెనడా సింగర్ డ్రేక్‌తో కొంతకాలం డేటింగ్ చేసింది  2012లో టెన్నిస్ క్రీడాకారుడు దిమిత్రోవ్‌తో కలిసి ఉన్నట్లు వార్తలు వచ్చాయి  2013 నుంచి ప్రస్తుతం వరకు టెన్నిస్ కోచ్ ప్యాట్రిక్‌తో ప్రేమలో ఉంది.
 
  ఓటమిని ఎలా స్వీకరిస్తుంది?
 ఓటమిని అంగీకరించదు. మ్యాచ్ ముగిశాక ఒక రోజు పాటు కోపంతోనే ఉంటుంది. పలుసార్లు మ్యాచ్ ఓడిపోయాక మీడియా ప్రశ్నలకు విసుగ్గా సమాధానం చెప్పింది.

 హ్యూమన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ! అమెరికాలో వైద్య విద్యకు ముందు విద్యార్థులు చదివే పుస్తకం. ముఖచిత్రం సెరెనా విలియమ్స్‌ది. మనిషి శరీరం బాగా క్లిష్టమైన స్థాయిలో ఎలా పని చేస్తుందో ఈ పుస్తకంలో వివరిస్తారు. దిగ్గజాలుగా ఎదిగిన క్రీడాకారుల మెంటాలిటీ ఒకటే. పోరాడు... చివరి క్షణం దాకా పోరాడు. సెరెనా కూడా అటు కోర్టులో ప్రత్యర్థులతో, ఇటు కోర్టు బయట జాత్యహంకారులతో పోరాడుతూనే ఉంది.
 
 ఎవరైనా కోర్టులోకి వస్తున్నప్పుడు ఎంతో కొంత ఒత్తిడితో ఉంటారు. కానీ సెరెనా మాత్రం మ్యాచ్ గెలవబోతున్నాననే ధీమాతో వస్తుంది. నిజానికి తనను చూస్తే ప్రత్యర్థి సగం మ్యాచ్‌కు ముందే ఓడిపోతుంది. ఇలాంటి లక్షణం గతంలో మైక్ టైనస్‌లో కనిపించేది. ప్రత్యర్థులెవరూ అతని కళ్లలోకి చూసేవారు కాదు. చూస్తే భయంతో ఓడిపోతారని. ప్రస్తుతం సెరెనా కూడా టైసన్ లాగే ప్రత్యర్థులను వణికిస్తోంది.
 
 మూడేళ్ల వయసులోనే
 సెరెనా విలియమ్స్ అమెరికాలోని చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చింది. ఐదుగురు అక్కచెల్లెళ్లలో ఆమె చిన్నది. వాళ్ల అమ్మ ఆరెసెన్ ప్రిన్స్‌కు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత రిచర్డ్ విలియమ్స్‌ను రెండో వివాహం చేసుకుంది. రిచర్డ్ విలియమ్స్ దంపతులకు తొలి సంతానం వీనస్. రెండో అమ్మాయి సెరెనా. రిచర్డ్‌కు టెన్నిస్ అంటే ఆసక్తి ఎక్కువ. ఈ ఆటలో మాత్రమే డబ్బులు బాగా వస్తాయని, ఒక్క గ్రాండ్‌స్లామ్ గెలిస్తే లైఫ్ సెటిల్ అయిపోతుందని చిన్న వయసులోనే రాకెట్స్ కొని కూతుళ్లు ఇద్దరికీ ఇచ్చేశాడు. 1984లో మూడేళ్ల వయసులో సెరెనా తొలిసారి టెన్నిస్ రాకెట్ చేతబట్టింది.
 
 అయితే నల్ల జాతీయులను అమెరికాలో స్వేచ్ఛగా ఆడుకోనివ్వరని రిచర్డ్స్‌కు భయం. చాలాకాలం పాటు ఇంట్లోనే కూతుళ్లకు టెన్నిస్ నేర్పించాడు. చిన్నగా టోర్నీలకు పంపడం ప్రారంభించాడు. తన జాతకాన్ని మార్చేది వీనస్ అని రిచర్డ్స్ నమ్మకం. పదేపదే అదే మాట అనేవాడు. దీనివల్ల తెలియకుండానే ఓ వివక్ష చూపించాడు. అలా ఆరేళ్ల వయసులోనే సెరెనాకు అర్థమైపోయింది... గెలవాలంటే పోరాడాలని.
 
 ప్రత్యర్థి ప్రపంచమే!
 క్రమంగా అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లి టోర్నమెంట్స్ ఆడటం మొదలుపెట్టారు. వీనస్ కంటే సెరెనా బాగా ఆడేది. పదేళ్ల వయసు వచ్చేసరికి సెరెనా ఆ ఏజ్ గ్రూప్‌లో అమెరికాలో నంబర్‌వన్‌గా ఎదిగింది. అయితే సెరెనా విజయాలను శ్వేత జాతీయుల తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. జాతి వివక్ష వ్యాఖ్యలు మొదలయ్యాయి. అప్పుడు సెరెనాకు బాగా తెలిసిపోయింది... తాను పోరాడాల్సింది ప్రపంచంతో అని.
 
 పాఠశాలలో హేళన... వెక్కిరించే అబ్బాయిలు... అడుగడుగునా కనిపించే ‘వివక్ష’. 1995లో తొలిసారి ప్రొఫెషనల్ సర్క్యూట్‌లోకి 14 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది. ఆ తర్వాత రెండేళ్లకే మగవాళ్లకు సవాళ్లు విసురుతూ.. తనపై గెలిచి చూపించమనేది. అటు వీనస్ కూడా అంతే. సెరెనాకు ఏమాత్రం తగ్గేది కాదు. అక్కాచెళ్లెల్లు ఎప్పుడూ ఒకే మాట మీద ఉండేవారు. ఎవరినైనా సవాల్ చేసేవారు.
 
 ‘ఓపెన్’ గెలిచినా వెక్కిరింతలే
 1999లో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. దీనికి కొద్దిగా ముందే ఫ్రెంచ్ ఓపెన్‌లో అక్కతో కలిసి డబుల్స్ టైటిల్ సాధించినా, సింగిల్స్ టైటిల్ నెగ్గడంలో ఉన్న మజా ఏంటో సెరెనాకు తెలిసింది. అంతేకాదు చిన్నప్పుడు తనని అవమానించిన వ్యక్తులు చూస్తుండగా... తన దేశంలోనే తొలిసారి సగర్వంగా ట్రోఫీని అందుకుంది. అంతే... అప్పుడు ప్రారంభమైన ప్రస్థానం 2015 వరకూ కొనసాగుతూనే ఉంది.
 
 2000వ సంవత్సరం నాటికి అక్కాచెళ్లెల్లు ఇద్దరు పీక్స్‌లోకి వచ్చేశారు. ఎవరు గెలుస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఆ ఇద్దరి మధ్య పోరాటం చూడటానికి టెన్నిస్ అభిమానులకు రెండు కళ్లు సరిపోయేవి కావు. టెన్నిస్ ప్రపంచం మీద విలియమ్స్ సిస్టర్స్ ముద్ర పడిపోతూ ఉన్న సమయంలో... ఓ ఆందోళన. అక్కాచెళ్లల్ల మధ్య మ్యాచ్‌లలో ఎవరు గెలవాలో తండ్రి రిచర్డ్స్ ముందే నిర్ణయిస్తున్నాడంటూ విమర్శలు వచ్చాయి. ఇది ఆ కుటుంబానికి షాక్. తామేంటో, తమ సత్తా ఏంటో చూపించినా... ఇంకా తేలికగా చూస్తున్నారు.... సెరెనా కోపం నషాళానికి అంటింది. అప్పుడు నిర్ణయించుకుంది... ఇక ఎవరినీ ఉపేక్షించకూడదని.
 
 చీదరించుకున్నా... చారిటీ కోసం...
 2001లో ఇండియన్ వెల్స్ ఓపెన్. సెరెనా, వీనస్‌ల మధ్య మ్యాచ్. తనకు గాయం ఉందని ఆడలేనని వీనస్ ముందే చెప్పేసింది. కానీ నిర్వాహకులు మాత్రం ఆడుతుందనే ఆశతో చివరిక్షణం వరకు చూశారు. కానీ రాలేదు. దీంతో అభిమానులు అక్కాచెళ్లెల్లు కలిసి మోసం చేస్తున్నారని భావించారు. సెరెనా ఫైనల్ ఆడుతున్నప్పుడు అడుగడుగునా హేళన చేశారు. దీంతో సెరెనా 14 ఏళ్ల పాటు ఆ టోర్నమెంట్‌ను బహిష్కరించింది. ఎవరు ఎంత బతిమాలినా ఒప్పుకోలేదు. తాజాగా ఈ ఏడాది 2015లో మళ్లీ ఆ టోర్నమెంట్ ఆడింది. అది కూడా ఓ చారిటీ సంస్థ కోరిక మేరకు ఆడింది.
 
 అంపైర్లు కూడా ప్రత్యర్థులే
 ఇక 2004 యూఎస్ ఓపెన్‌లో అయితే ఏకంగా అంపైర్ సెరెనా పట్ల వివక్ష చూపించారు. పదే పదే కావాలని సెరెనాకు వ్యతిరేకంగా నిర్ణయాలు ఇచ్చారు. దీనిపై తను గొంతు విప్పింది. ఎందుకిలా? అంటూ ప్రశ్నించింది. ఫలితమే... హాక్‌ఐ (ఏ్చఠీజు ఉడ్ఛ) టెక్నాలజీ. అప్పుడు సెరెనా చేసిన పోరాటం వల్ల ఇప్పుడు మిగిలిన క్రీడాకారులంతా టెక్నాలజీ సహాయంతో న్యాయమైన నిర్ణయాలను చూస్తున్నారు.
 
 సెరెనా కోపాన్ని ఎప్పుడూ దాచుకోదు. 2009 యూఎస్ ఓపెన్‌లో తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు వస్తున్నాయనే కోపంతో లైన్ అంపైర్‌ను చంపేస్తానని బెదిరించింది. అంతే... అవకాశం కాచుకుని కూర్చున్నవాళ్లంతా జూలు విదిల్చారు. మామూలుగా జరిమానాతో సరిపెట్టొచ్చు. కానీ నిషేధం విధిస్తామన్నారు. క్షమించమని బహిరంగంగా కోరితే నిర్ణయాన్ని సమీక్షిస్తామన్నారు. తనకు ఇష్టం లేకపోయినా శ్రేయోభిలాషుల సలహా మేరకు క్షమించమని కోరింది. నిషేధాన్ని తప్పించుకుంది, కానీ లక్షా 75 వేల డాలర్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది.
 అయితే ఈ రెండు దశాబ్దాలలో సెరెనా శాంతించింది. వయసుతో పాటు తనలో పరిణితి కూడా వచ్చింది. అయినా కోర్టులో అడుగుపెట్టగానే వచ్చే కసి మాత్రం తగ్గలేదు. తగ్గదు కూడా. తనలో ఆ తపన, పట్టుదల తగ్గిన రోజు సెరెనా కోర్టులో కనిపించదు.
                                                                                                              - బత్తినేని జయప్రకాష్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement