షరపోవా సెరెనా షో
ఇక సెమీస్‌లో అమీతుమీ
- ముగురుజా సంచలనం
- వింబుల్డన్ టోర్నమెంట్
లండన్: తమ అనుభవాన్నంతా రంగరించి పోరాడిన మరియా షరపోవా (రష్యా), సెరెనా విలియమ్స్ (అమెరికా) వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ షరపోవా 6-3, 6-7 (3/7), 6-2తో అన్‌సీడెడ్ కోకో వాండెవెగె (అమెరికా)పై... టాప్ సీడ్ సెరెనా 3-6, 6-2, 6-3తో 23వ సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్)పై కష్టపడి గెలిచి సెమీస్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. రెండు క్వార్టర్స్‌లోనూ షరపోవా, సెరెనా నిర్ణాయక మూడో సెట్‌లో తమ అసలు సిసలు ఆటతీరును కనబరిచారు.
వాండెవెగెతో 2 గంటల 45 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌ను షరపోవా రెండో సెట్‌లోనే ముగించాల్సింది. అయితే క్వార్టర్స్ చేరే క్రమంలో ముగ్గురు సీడెడ్ క్రీడాకారిణులను (6వ సీడ్ సఫరోవా, 22వ సీడ్ సమంతా స్టోసుర్, 11వ సీడ్ ప్లిస్కోవా) ఓడించిన వాండెవెగె అద్భుత పోరాటంతో పుంజుకుంది. రెండో సెట్‌లో 5-4తో ఆధిక్యంలో ఉన్న షరపోవా పదో గేమ్‌లో తన సర్వీస్‌ను నిలబెటుకోవాల్సిన పరిస్థితిలో కోల్పోయింది. దాంతో స్కోరు 5-5తో సమమైంది. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకున్నారు. టైబ్రేక్‌లో షరపోవా 3-0తో ముందంజ వేసినా... ఆ తర్వాత వాండెవెగె చెలరేగి వరుసగా ఏడు పాయింట్లను సాధించి రెండో సెట్‌ను దక్కించుకుంది.
రెండో సెట్‌లో ఈ అమెరికా యువతార ప్రదర్శన చూశాక మరో సంచలనం నమోదవుతుందా అనే అనుమానం కలిగింది. అయితే కెరీర్‌లో 48వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతోన్న షరపోవా తన అనుభవాన్నంతా ఉపయోగించి నిర్ణాయక మూడో సెట్‌లో కోలుకుంది. ఆరంభంలోనే వాండెవెగె సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఈ మాజీ చాంపియన్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నాలుగు ఏస్‌లు సంధించిన ఈ రష్యా భామ 10 డబుల్ ఫాల్ట్‌లు చేయడం గమనార్హం. 2011 తర్వాత షరపోవా ఈ టోర్నీలో సెమీస్‌కు చేరడం ఇదే తొలిసారి. అజరెంకాతో జరిగిన మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్‌ను కోల్పోయినా... నిరుత్సాహ పడకుండా తర్వాతి రెండు సెట్‌లను నెగ్గి 2012 తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌కు చేరింది.
మరోవైపు 20వ సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) 7-5, 6-3తో టిమియా బాసిన్‌స్కీ (స్విట్జర్లాండ్)పై నెగ్గి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. అంతేకాకుండా 1997లో అరంటా శాంచెజ్ తర్వాత వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కు చేరిన తొలి స్పెయిన్ క్రీడాకారిణిగా ముగురుజా గుర్తింపు పొందింది. సెమీస్‌లో 13వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో ముగురుజా ఆడుతుంది. క్వార్టర్స్‌లో రద్వాన్‌స్కా 7-6 (7/3), 3-6, 6-3తో మాడిసన్ కీస్ (అమెరికా)పై గెలిచింది.