లండన్: వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో స్విట్జర్లాండ్ దిగ్గజం ఫెడరర్ తొలి రౌండ్‌లో గట్టిపోటీ ఎదుర్కొన్నాడు. ప్రపంచ 41వ ర్యాంకర్ అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో నాలుగు సెట్‌లు ముగిసి, ఐదో సెట్ ప్రారంభమాయ్యక మనారినో గాయం కారణంగా వైదొలిగాడు. దాంతో ఫెడరర్ విజయం ఖాయమైంది. 2 గంటల 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తొలి సెట్‌ను 6–4తో గెలిచాడు. అనంతరం మనారినో రెండో సెట్‌ను 7–6 (7/3)తో, మూడో సెట్‌ను 6–3తో నెగ్గి సంచలనం సృష్టించే దిశగా సాగిపోయాడు. అయితే నాలుగో సెట్‌లో ఫెడరర్ 5–2తో ఆధిక్యంలో ఉన్నదశలో మనారినో కోర్టులో జారిపడటంతో అతని మోకాలికి గాయమైంది. ఎనిమిదో గేమ్‌లో మనారినో సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ నాలుగో సెట్‌ను 6–2తో గెల్చుకున్నాడు. ఐదో సెట్ తొలి గేమ్‌లో తొలి పాయింట్ ముగిశాక మనారినో ఇక ఆడలేనంటూ చైర్ అంపైర్‌కు చెప్పేసి మ్యాచ్ నుంచి వైదొలిగాడు.
గాయంతో వైదొలిగిన సెరెనా
అమెరికా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించింది. అలెక్సాండ్రా సస్నోవిచ్ (బెలారస్)తో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో తొలి సెట్‌లో స్కోరు 3–3తో సమంగా ఉన్నదశలో సెరెనా చీలమండ గాయం కారణంగా వైదొలిగింది. కెరీర్‌లో 23 గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలిచిన సెరెనా వింబుల్డన్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే వెనుదిరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment