
కాలిఫోర్నియా: రికార్డుస్థాయిలో ఆరోసారి ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నమెంట్ టైటిల్‌ను సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. తొలి రౌండ్‌లో ‘బై’ పొందిన ఈ ఐదుసార్లు మాజీ చాంపియన్ రెండో రౌండ్‌లో 6–1, 7–5తో పీటర్ గొజోవిజిక్ (జర్మనీ)పై గెలుపొంది ఈ టోర్నీలో వరుసగా పదోసారి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను అలవోకగా నెగ్గిన ఫెడరర్‌కు రెండో సెట్‌లో గట్టిపోటీ ఎదురైంది. కేవలం రెండు ఏస్‌లు కొట్టిన ఈ స్విస్ స్టార్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఓవరాల్‌గా ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసిన ఫెడరర్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయాడు. ఇదే టోర్నీ మహిళల విభాగంలో అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ పోరాటం ముగిసింది. గార్బిన్ ముగురుజా (స్పెయిన్)తో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో సెరెనా తొలి సెట్‌ను 3–6తో కోల్పోయి, రెండో సెట్‌లో 0–1తో వెనుకబడిన దశలో గాయం కారణంగా వైదొలిగింది.
బోపన్న జంట ఓటమి
పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–షపోవలోవ్ (కెనడా) ద్వయం రెండో రౌండ్‌లో 4–6, 6–1, 8–10తో జొకోవిచ్ (సెర్బియా)–ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ) జోడీ చేతిలో ‘సూపర్ టైబ్రేక్’లో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment