
భార్య మిర్కాతో ఫెదరర్ (Photo Source: Roger Federer Twitter)
మిర్కాతో ఫెదరర్ ప్రేమ ప్రయాణం! కవలల జోడీ.. గొప్ప మనసున్న జంట! ఆసక్తికర విషయాలు
Roger Federer- Miroslava Mirka Love Story: ‘‘మా అమ్మ, నాన్న.. మిర్కా సమక్షంలో మీతో ఈ విషయాన్ని పంచుకోవడం ఆనందంగా ఉంది. సుదీర్ఘ ప్రయాణం.. ఇంతవరకు ఇలా సాఫీగా సాగుతుందని ఎవరు అనుకుని ఉంటారు. జస్ట్ ఇన్‌క్రెడిబుల్’’... స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన రిటైర్మెంట్ నేపథ్యంలో శనివారం చేసిన ట్వీట్ ఇది. అవును నిజమే.. సుదీర్ఘ కెరీర్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఫెదరర్ ప్రయాణం నిజంగా అసాధారణమైనదే.
కళాత్మకమైన ఆటకు మారుపేరుగా.. వివాదరహితుడిగా.. జెంటిల్‌మెన్‌గా పేరు తెచ్చుకున్న ఫెడ్డీ సాధించిన ఘనతల్లో తన కుటుంబానిది కీలక పాత్ర. తల్లిదండ్రులు రాబర్ట్, లినెట్టె.. ముఖ్యంగా భార్య మిర్కా.. తన విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిందని ఫెదరర్ తరచూ చెబుతూ ఉంటాడు.
నిజానికి రోజర్ ఫెదరర్ పక్కా ‘ఫ్యామిలీ మ్యాన్’. అమ్మానాన్న.. భార్య మిర్కా, నలుగురు పిల్లలు అతడి ప్రపంచం. ఈ ప్రపంచాన్ని మరింత అందంగా మలిచి.. ఆటగాడిగా ఫెదరర్ విజయవంతంగా కొనసాగేందుకు భార్యగా తాను చేయగలిగిదంతా చేసింది.. చేస్తోంది మిర్కా. భర్తను అర్థం చేసుకుంటూ అతడికి అండగా నిలుస్తోంది.
ఇంతకీ మిర్కా ఎవరు?
మిరస్లొవా మిర్కా ఫెదరర్.. 1978 ఏప్రిల్ 1న జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు మిరొస్లొవా వావ్‌రింకోవాగా నామకరణం చేశారు. ఈమె కూడా టెన్నిస్ ప్లేయరే! స్లొకేవియాలో జన్మించిన మిర్కాకు రెండేళ్ల వయసు ఉన్నపుడే ఆమె కుటుంబం స్విట్జర్లాండ్‌కు వలస వచ్చింది.
మిర్కాకు తొమ్మిదేళ్ల వయసున్నపుడు జర్మనీలోని ఓ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఆమెను తీసుకువెళ్లాడు తండ్రి. అక్కడే తను మార్టినా నవ్రతిలోవా(చెక్- అమెరికన్ ప్లేయర్)ను చూసింది. చురుకైన మిర్కాను చూసిన నవత్రిలోవా.. ఆమె టెన్నిస్ ప్లేయర్‌గా రాణించగలదని చెప్పడం సహా.. తన రాకెట్‌ను బహుమతిగా పంపింది.
అంతేకాదు మిర్కా టెన్నిస్ పాఠాలు నేర్చుకునేలా ఏర్పాట్లు చేసింది కూడా! అలా నవ్రతిలోవా స్ఫూర్తితో తన టెన్నిస్ ప్రయాణం మొదలుపెట్టిన మిర్కా.. 2001లో కెరీర్ అత్యుత్తమ ర్యాంకు 76 సాధించింది.
రోజర్- మిర్కా ప్రేమకథ అక్కడ మొదలైంది!
సిడ్నీ ఒలింపిక్స్- 2000 సందర్భంగా రోజర్ ఫెదరర్- మిర్కాలకు పరిచయం జరిగింది. పరిచయం స్నేహంగా.. ఆపై ప్రేమగా మారింది. అలా కొన్నేళ్ల పాటు ప్రణయంలో మునిగితేలిన ఈ జంట 2009లో వివాహ బంధంతో ఒక్కటైంది. రోజర్ స్వస్థలం బాసెల్‌లో వీరి పెళ్లి జరిగింది.
అదే ఏడాది రోజర్- మిర్కా దంపతులకు కవలలు జన్మించారు. మొదటి సంతానంగా జన్మించిన కుమార్తెలకు చార్లెనీ రివా- మిలా రోజ్‌గా పేర్లు పెట్టారు. ఆ తర్వాత సుమారు ఐదేళ్లకు అంటే 2014లో ఈ జంట కవల కుమారులకు జన్మినిచ్చారు. వీరి పేర్లు లియో, లిన్నీ.
పిల్లలతో కలిసి మ్యాచ్ వీక్షిస్తూ..
ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అయిన మిర్కా.. సిడ్నీ ఒలింపిక్స్‌లో స్విట్జర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించింది. పాదానికి గాయమైన కారణంగా అర్ధంతరంగా ఆమె కెరీర్ ముగిసిపోయింది. పెళ్లి తర్వాత కుటుంబానికే పూర్తి సమయం కేటాయించిన మిర్కా.. భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ పర్‌ఫెక్ట్ పార్ట్‌నర్ అనిపించుకుంది.
ఇక కేవలం ఇంట్లోనే కాదు.. మైదానంలో కూడా భర్త వెన్నంటే ఉండేందుకు ప్రయత్నిస్తుంది మిర్కా. ఫెదరర్ మ్యాచ్ ఉందంటే తమ నలుగురు పిల్లలతో కలిసి అక్కడికి చేరుకుంటుంది. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలతో కలిసి మ్యాచ్‌లు వీక్షిస్తూ ఉంటుంది. 2017లో రోజర్ వింబుల్డన్ టైటిల్ గెలిచిన సమయంలో.. ఆ అద్భుత క్షణాలకు సాక్షిగా నిలిచింది మిర్కా.
మంచి మనసున్న దంపతులు!
రోజర్‌కు అన్ని విషయాల్లో అండగా ఉండే మిర్కా.. అతడు చేసే సామాజిక కార్యక్రమాల్లోనూ తోడుగా ఉంటుంది. కోవిడ్ కారణంగా నష్టపోయిన స్విస్ కుటుంబాలకు ఈ జంట 2020లో ఒక మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చింది.
అదే విధంగా రోజర్ ఫెదరర్ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికాలో విద్యాభివృద్ధికి తోడ్పడుతున్నారు ఈ దంపతులు. ఇందుకోసం మిలియన్ డాలర్లకు పైగా విరాళం అందించారు. ఓ సందర్భంలో రోజర్ మాట్లాడుతూ.. తమ కుమార్తెలు భవిష్యత్తులో ఈ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారని భావిస్తున్నానని.. అందుకు వీలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు వెల్లడించాడు.
కేవలం ఆటలో మాత్రమే కాదు.. సేవా గుణంలోనూ ఫెదరర్ రారాజే! మరి అతడి హృదయపు పట్టపురాణి మిర్కా.. మహారాణి కాక ఇంకేమవుతుంది!?
-సాక్షి, వెబ్‌డెస్క్
చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా?
Ind Vs Aus: టీ20 సిరీస్.. అరుదైన రికార్డుల ముంగిట కోహ్లి! అదే జరిగితే..
It was beautiful to release the news surrounded by my Mum and Dad and Mirka. Who would have thought that the journey would last this long. Just incredible! pic.twitter.com/0rRAMRSaRu
— Roger Federer (@rogerfederer) September 16, 2022