మరియా షరపోవా
కాలిఫోర్నియా: మాజీ ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ మరియా షరపోవా తన కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ తో తెగదెంపులు చేసుకున్నారు. ఇటీవల జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే షరపోవా పరాజయం చెందడంతో కోచ్‌కు కటీఫ్ చెబుతూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో వారిద్దరి నాలుగు సంవత్సరాల భాగస్వామ్యానికి తెర పడింది. పరస్పర అంగీకారం మేరకే విడిపోతున్నట్టు షరపోవా తెలిపారు. కోచ్ అందించిన సహకారం మర్చిపోలేనిదని, ఆట, కోచింగ్ కంటే తమ మధ్య స్నేహం చాలా విలువైందని అన్నారు. అతని పని తీరు, నాపై తనకున్న విశ్వాసం అద్భుతమైందని తెలిపారు. ఇలాంటి పర్యవేక్షకుడు తనకు కోచ్‌గా ఉండటం ఒక అదృష్టంగా షరపోవా అభివర్ణించారు.
డచ్ దేశానికి చెందిన గ్రోనెవెల్డ్.. 2014లో షరపోవాకు కోచింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అదే ఏడాది షరపోవా ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది. మరొకవైపు గ్రోనెవెల్డ్ పర్యవేక్షణలో రెండు టైటిల్స్‌ను షరపోవా గెలిచారు. తామిద్దరం విడిపోతున్న విషయాన్ని కోచ్ స్వెన్ గ్రోనెవెల్డ్ ధ్రువీకరిస్తూ, ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. తాను ఇప్పటి వరకు కలిసి పనిచేసిన వారిలో అత్యంత కష్టపడే వ్యక్తి షరపోవా అని, ఆమె భవిష్యత్తులో మరింత పోరాట పటిమను కొనసాగించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఓ వ్యక్తిగా, క్రీడాకారిణిగా తన పట్ల నాకు అమితమైన గౌరవం ఉందని అన్నారు. ఈ వారం జరిగిన ఇండియన్ వెల్స్ టోర్నీ మొదటి రౌండ్‌లోనే జపాన్ నంబర్ వన్ నయోమి ఒసాకాపై 6-4, 6-4 తేడాతో ఓడిపోయారు షరపోవా. అంతకుముందు నిషేధం తర్వాత ఈ ఏడాది జనవరిలో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పునరాగమనం చేసిన షరపోవా.. మూడో రౌండ్‌లో ఏంజెలిక్ కెర్బెర్ చేతిలో కూడా ఓటమిపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment