శిక్ష అనుభవించాక ఇదేం శిక్ష?
షరపోవాకు వైల్డ్‌కార్డ్ నిరాకరణపై డబ్ల్యూటీఏ చీఫ్ వ్యాఖ్య
పారిస్: మాజీ నంబర్‌వన్ మరియా షరపోవాకు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో వైల్డ్‌కార్డ్‌ను నిరాకరించడంపై డబ్ల్యూటీఏ చీఫ్ స్టీవ్ సైమన్ మండిపడ్డారు. స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్డు (సీఏఎస్ ) షరపోవాకు విధించిన 15 నెలల శిక్ష అనుభవించాక కూడా మళ్లీ శిక్షించడమేంటని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకుల (ఎఫ్‌ఎఫ్‌టీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మాజీ చాంపియన్‌ను ఇలా అవమానించడం అనుచితమని ఆయన వ్యాఖ్యానించారు.
టెన్నిస్ యాంటి డోపింగ్ ప్రోగ్రామ్ (టీఏడీపీ)లో బాధ్యత కలిగిన భాగస్వాములైన గ్రాండ్‌స్లామ్, డబ్ల్యూటీఏ, ఐటీఎఫ్, ఏటీపీ సంస్థలు శిక్షించిన క్రీడాకారిణిని మళ్లీ ఈ రకంగా శిక్షించడం సరైనది కాదని సైమన్ అభిప్రాయపడ్డారు. గత నెల 26తో 15 నెలల నిషేధం పూర్తయిన తర్వాత షరపోవా... స్టట్‌గార్ట్ ఓపెన్‌లో తొలిసారిగా బరిలోకి దిగింది. ఇందులో సెమీస్ చేరిన ఆమె తదనంతరం మాడ్రిడ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. అయితే గాయాలైన వారికే తప్ప డోపీలకు వైల్డ్ కార్డ్‌లు ఇవ్వమని ఫ్రెంచ్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు.