షరపోవా... నీకిది తగునా...
రష్యా స్టార్ పునరాగమనం తీరుపై వొజ్నియాకి అసంతృప్తి
కాలిఫోర్నియా: నిషేధం ఎత్తేయగానే ముందుగా రష్యన్ స్టార్ మరియా షరపోవా కిందిస్థాయి టోర్నీలతో పునరాగమనం చేయాలని మాజీ ప్రపంచ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) సూచించింది. వచ్చిరాగానే ఓ మేటి డబ్ల్యూటీఏ టోర్నీలో బరిలోకి దిగడం తోటి క్రీడాకారిణిలను అగౌరవపరచడమేనని ఆమె చెప్పింది. నిషేధిత జాబితాలోని మెడిసిన్‌ను వాడటంతో షరపోవాపై 15 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26తో ఆమె నిషేధం తొలగిపోనుంది. అయితే అప్పటికే మొదలయ్యే స్టుట్‌గార్ట్ ఓపెన్‌లో షరపోవా బరిలోకి దిగనుండటంపై వొజ్నియాకి పెదవి విరిచింది.
ఆమెతో తనకెలాంటి ఇబ్బందిలేదని అయితే కిందిస్థాయి టోర్నీలో పునరాగమనం చేస్తే బాగుంటుందని చెప్పింది. ‘మానవ మాత్రులందరూ తప్పు చేస్తారు. సరిదిద్దుకునేందుకు మరో అవకాశముంటుంది. ఇందులో నాకే ఇబ్బంది లేదు. కానీ నిషేధం గడువు పూర్తికాని సమయంలోనే మొదలయ్యే ఓ టోర్నీలో ఆడటమనేది సబబుగా లేదు’ అని వొజ్నియాకి తెలిపింది. ‘గాయంతో పునరాగమనం చేయడం వేరు... డోపింగ్ బ్యాన్‌తో పునరాగమనం చేయడం వేరు! ఈ రెండింటిని సమదృష్టితో చూడలేం’ అని వివరించింది.