నాదల్, ఫెడరర్ ముందంజ
మెల్బోర్న్: టెన్నిస్ దిగ్గజాలు రాఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ఆస్ట్రేలియా ఓపెన్‌లో ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ నాదల్, మూడో సీడ్ ఫెడరర్ మూడో రౌండ్లోకి ప్రవేశించారు. అయితే వింబుల్డన్ రన్నరప్, ఐదో సీడ్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)కు రెండో రౌండ్లోనే చుక్కెదురైంది. ప్రపంచ 39వ ర్యాంకర్ ఫ్రాన్సిస్ టియాఫో (అమెరికా)... ఆరో ర్యాంకర్ కెవిన్‌కు షాకిచ్చాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), మూడో సీడ్ వోజ్నియాకి (డెన్మార్క్), ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు.
అలవోకగా నెగ్గిన నాదల్...
పురుషుల సింగిల్స్‌లో బుధవారం జరిగిన రెండో రౌండ్లో నాదల్ 6–3, 6–2, 6–2తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై అలవోక విజయం సాధించగా, ఫెడరర్ 7–6 (7/5), 7–6 (7/3), 6–3 క్వాలిఫయర్ డానియెల్ ఎవాన్స్ (ఇంగ్లండ్)పై చెమటోడ్చి నెగ్గాడు. వింబుల్డన్ ఫైనలిస్ట్ అండర్సన్ 6–4, 4–6, 4–6, 5–7తో అన్‌సీడెడ్ టియాఫో చేతిలో కంగుతిన్నాడు. ఆరో సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 7–5, 6–7 (9/11), 6–4, 6–4తో మెక్‌డోనాల్డ్ (అమెరికా)పై గెలుపొందగా, ఫెబియానోతో పోరాడి ఓడిన మ్యాచ్‌లో ఒపెల్కా (అమెరికా) అదరగొట్టాడు. అతను 67 ఏస్‌లు సంధించడం విశేషం. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో చివరకు థామస్ ఫెబియానో (ఇటలీ) 6–7 (15/17), 6–2, 6–4, 3–6, 7–6, (10/5)తో ఒపెల్కాపై నెగ్గాడు.
బెర్టెన్స్ ఔట్
మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)కు 6–3, 3–6, 3–6తో రష్యా క్రీడాకారిణి పల్యుచెంకోవా చేతిలో చుక్కెదురైంది. మిగతా మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కెర్బర్ 6–2, 6–3తో బియట్రిజ్ మైయా (బ్రెజిల్)పై, ఐదో సీడ్ స్టీఫెన్స్ 6–3, 6–1తో టిమియా బబొస్ (హంగేరి)పై, మూడో సీడ్ వోజ్నియాకి 6–1, 6–3తో లార్సన్ (స్వీడెన్)పై 8వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–1, 6–3తో కెమెలియా బెగు (రుమేనియా)పై, షరపోవా (రష్యా) 6–2, 6–1తో రెబెక్కా పీటర్సన్ (స్వీడెన్)పై గెలుపొందారు.
భారత పోరాటం తొలిరౌండ్లోనే...
ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో భారత పోరాటం తొలిరౌండ్లోనే ముగిసింది. డబుల్స్‌లో భారత జోడీలన్నీ నిరాశపరిచాయి. 15వ సీడ్ రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జంట 1–6, 6–4, 5–7తో కెరెనొ బుస్టా–గార్సియా లోపెజ్ (స్పెయిన్) జోడీ చేతిలో కంగుతినగా, లియాండర్ పేస్– రెయిస్ వరేలా (మెక్సికో) ద్వయం 5–7, 6–7 (4/7)తో క్రాజిసెక్ (అమెరికా)– సిటాక్ (ఆస్ట్రేలియా) జంట చేతిలో ఓడింది. జీవన్ నెడున్‌జెళియాన్–మోన్రో (అమెరికా) జోడీ 6–4, 6–7 (8/10), 5–7తో కెవిన్ క్రావిట్జ్ (జర్మనీ)–నికొలా మెక్టిక్ (క్రొయేషియా) జంట చేతిలో పరాజయం చవిచూసింది.