మళ్లీ లవ్‌ ఆల్‌ | special story to tennis star maria parashova | Sakshi
Sakshi News home page

మళ్లీ లవ్‌ ఆల్‌

Published Sun, Feb 5 2017 10:25 PM | Last Updated on Fri, Sep 28 2018 7:47 PM

మళ్లీ లవ్‌ ఆల్‌ - Sakshi

మళ్లీ లవ్‌ ఆల్‌

టెన్నిస్‌ క్రీడాకారిణి  మారియా షరపోవా
టెన్నిస్‌లో ‘లవ్‌’ అంటే జీరో. షరపోవా ఇప్పుడు ‘లవ్‌’లో ఉంది.
ఆటను ఫ్రెష్‌గా... లవ్‌ నుంచి స్టార్ట్‌ చేయబోతోంది!
అసలైతే... లవ్‌ అంటే ప్రేమ.
షరపోవాను ఎంతోమంది లవ్‌ చేశారు.
ఆమె మాత్రం ఆటనే లవ్‌ చేసింది.
బ్యాన్‌ తర్వాత.. ఈ ఏడాది షరపోవా ఆడబోతున్న
తొలి ఆట కోసం ప్రపంచమంతా కళ్లలో లవ్వొత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది.


షరపోవా కోపంగా ఉంది! కోపంగా ఉన్నప్పుడు   రాకెట్‌తో లాగిపెట్టి బంతిని కొడుతుంది. ప్రాక్టీస్‌ వాల్‌ను పిడిగుద్దులు గుద్దినట్టుగా బంతిని వాల్‌ పైకి ఈడ్చి కొడుతూనే ఉంటుంది. షరపోవా మంచి అమ్మాయి. ఊరికినేతనకు కోపం రాదు.

చేసిన తప్పు కాదు... చెప్పిన తప్పు!
కొన్నాళ్లుగా షరపోవా కోపంగానే ఉంటోంది. ఏడాది క్రితం డోపింగ్‌ టెస్ట్‌లో ఆ అమ్మాయి దొరికిపోయింది. నిజానికి ‘దొరికిపోయేంత’ పెద్ద తప్పు తనేం చేయలేదు. ‘అరె! ఈ మందును నేను ఎప్పటి నుంచో వాడుతున్నా’ అని పబ్లిగ్గా చెప్పింది. అదే తప్పయింది! నిరుడు జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌కు ముందు డ్రగ్‌ టెస్ట్‌ చేసినప్పుడు ఆమె ఒంట్లో ‘మెల్డోనియం’ అనే మందు బయటపడింది. అదేమీ నిషేధించిన ఔషధం కాదు. అయితే వరల్డ్‌ యాంటీ డోపింగ్‌ ఏజెన్సీ 2016 జనవరి 1 నుంచి నిషేధిత ఔషధాలలో దానిని కూడా చేర్చడంతో షరపోవా దోషి కావలసి వచ్చింది! అందుకు పడిన శిక్ష ఆట నుంచి రెండేళ్ల బ్యాన్‌! షరపోవా నివ్వెరపోయింది. తన వాదన వినిపించింది. శిక్షాకాలం రెండేళ్ల నుంచి పదిహేను నెలలకు తగ్గిపోయింది. కానీ షరపోవా కోపం తగ్గిపోలేదు.

తలో రాయి విసిరినా.. నో సారీ
కోపంగా ఉన్నప్పుడు షరపోవా గోడల్ని పగలగొట్టే మాట నిజమే కానీ, ఇప్పుడామె కొద్దిగా మారింది. కోపం నుంచి కొద్దికొద్దిగా పికప్‌ అవుతోంది. మెడిటేషన్‌ చేస్తోంది. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో చిన్నపాటి అధ్యయనం చేస్తోంది. మంచి మంచి బుక్స్‌ చదువుతోంది. బయోగ్రఫీ రాస్తోంది. ఇవి కాక.. బాక్సింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తోంది! బాక్సింగ్‌ మధ్యలో తనకు నచ్చని వ్యక్తులు గుర్తొస్తే, ఆ కోపాన్ని బాక్సింగ్‌ బ్యాగ్‌ మీద చూపిస్తోంది. బ్యాగ్‌కి ఏమీ కాదు. కానీ పంచ్‌ పడిన ప్రతిసారీ.. ఆమె లోపల కదలాడే మనుషుల దవడలు పగిలిపోతున్నాయి! నైస్‌.
ఎవరివై ఉంటాయి షరపోవా ఊహాల్లోని ఆ శత్రుచిత్రాలు? ఎవరివైనా కావచ్చు. ఆమెను చాలామందే చికాకు పరిచారు. డేవిడ్‌ హెగర్టీ! ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌. ఆమె బ్యాన్‌ నిర్ణయం అతడిదే; ఇంకా.. సాటి ప్లేయర్‌లు జాన్‌ మెకన్రో, ప్యాట్‌ క్యాష్, జెన్నిఫర్‌ కాప్రియాటీ, సెరెనా విలియమ్స్, రోజర్‌ ఫెడరర్, రాఫెల్‌ నాదల్, ఆండీ ముర్రే, నొవాక్‌ జొకోవిచ్‌.. వీళ్లలో ఎవరి దవడలైనా కావచ్చు. వీళ్లంతా తలో మాట వేశారు. ఇలా చేసిందంటే నమ్మలేక పోతున్నాం అని ఒకరు, తన 35 టైటిళ్లనీ వెనక్కు తీసేసుకోవాలి అని ఒకరు, సారీ చెప్పినా ఒప్పుకోవద్దని ఒకరు... ఇలా తలో రాయి విసిరారు. షరపోవా ఇప్పటికీ సారీ చెప్పలేదు. ఎప్పటికీ చెప్పేది లేదని కూడా అన్నారు. బ్యాన్‌ తీరిపోయాక జర్మనీలోని స్టట్‌గార్ట్‌ క్లే కోర్టులో ఏప్రిల్‌ 26న తొలి టోర్నమెంట్‌ ఆడబోతున్నారు.

ఆట ఒక్కటే  నిజమైన బాయ్‌ఫ్రెండ్‌
ఇష్టమైన వాళ్లకు దూరంగా ఎన్నాళ్లైనా, ఎన్నేళ్లైనా దూరంగా ఉండగలం. ఇష్టమైన ఆటకు ఒక రోజు కూడా ఉండలేం. షరపోవాకు టెన్నిస్‌ అంటే కేవలం ఇష్టం కాదు. ప్రాణం. పద్దెనిమిదవ యేటే టెన్నిస్‌లో ఆమె వరల్డ్‌ నం.1 ర్యాంకులోకి వచ్చేశారు. అదే ఏడాది 18వ బర్త్‌డే పార్టీలో అమెరికన్‌ పాప్‌ రాక్‌ బ్యాండ్‌ ‘మెరూన్‌ 5’ సింగర్‌ ఆడమ్‌ లెవీన్‌ ఆమెకు పరిచయం అయ్యాడు. డేటింగ్‌ అయ్యాక అతడు లేడు. ఆట మాత్రమే ఉంది. తర్వాత అమెరికన్‌ టెలివిజన్‌ ప్రొడ్యూజర్‌ చార్లీ ఎబర్సోల్‌ ఆమె జీవితంలోకి వచ్చాడు. కొన్నాళ్ల డేటింగ్‌ తర్వాత అతడూ లేడు. ఆట ఉంది. ఆ తర్వాత స్లొవేనియా బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ సషా ఉజాసిక్, తర్వాత బల్గేరియన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ గ్రిగర్‌ డిమిట్రోవ్‌. వీళ్లూ మిగల్లేదు! ప్రతిసారీ ఆట ఒక్కటే షరపోవాతో ఉంటోంది. ఆట కోసం ప్రేమను వదులుకోవడం లేదు షరపోవా. ఆటను మాత్రమే ఆమె ప్రేమించింది.

పన్నెండేళ్ల క్రితం వరల్డ్‌ నంబర్‌ 1 అయిన షరపోవాకు ఇప్పుడు ఏ ర్యాంకూ లేదు. మళ్లీ కొత్తగా జీవితాన్ని మొదలు పెట్టాలి. ర్యాంకులే ఆమె జీవితం అని కాదు దీని అర్థం. అసలంటూ రాకెట్‌ పట్టడమే ఆమె లైఫ్‌. షరపోవా రష్యన్‌ ప్రొఫెషనల్‌ ప్లేయర్‌. ఇరవై రెండేళ్లుగా యు.ఎస్‌.లో ఉంటోంది. ఒలింపిక్‌ మెడలిస్ట్‌.

గెలిస్తే ప్రాక్టీస్‌... ఓడితే షాపింగ్‌!
మ్యాచ్‌ గెలిచినప్పుడు షరపోవా వెంటనే తర్వాతి మ్యాచ్‌కు ప్రాక్టీస్‌ మొదలు పెడతారు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పుడు ఆ ప్రెజర్‌ నుంచి బయట పడడానికి షాపింగ్‌కి వెళతారు! ఇప్పుడంటే బ్యాన్‌ టైమ్‌లో సరదాగా బాక్సింగ్‌కి వెళుతున్నారు కానీ, షరపోవాకు టెన్నిస్‌ తప్ప మరే ఆటా ఇష్టం లేదు. పిప్పీ లాంగ్‌స్టాకింగ్‌ బుక్స్‌ చదివే అలవాటు ఆమెకు ఇంకా పోలేదు. ‘ఇంకా’ అంటే.. ఇంత పెద్దయినా! పిప్పీ లాంగ్‌స్టాకింగ్‌... స్వీడిష్‌ రచయిత్రి ఆస్ట్రిడ్‌ లిండ్‌గ్రెన్‌ నవలల్లోని ఒక అమ్మాయి క్యారెక్టర్‌. పిప్పీ జుట్టు ఎర్రగా ఉంటుంది. రెండు జడలు ఉంటాయి. సింగిల్‌ హ్యాండ్‌తో తన గుర్రాన్ని అదుపు చేస్తుంటుంది. చురుగ్గా ఉంటుంది. ఆ పాత్రలో తనను తాను ఊహించుకుంటుందట షరపోవా. అందుకే ఆమెకు పిప్పీ అంటే అంతిష్టం. బాల్యం నుంచి దూర దూరంగా వచ్చేస్తున్నకొద్దీ, బాల్యం ఆమెకు దగ్గర దగ్గరగా రావడం షరపోవా జీవితంలోని ఒక విశేషం. చిన్నపిల్ల నవ్వు, చిన్నపిల్ల చూపు, చిన్నపిల్ల వెక్కిరింపు ఇవెక్కడికీ పోలేదు. ఆమె దగ్గర చిన్నప్పటి స్టాంప్‌ కలెక్షన్‌ ఇంకా పోగవుతూనే ఉంది. చిన్నప్పటి ఆమె జ్ఞాపకాల సుగంధ పరిమళం స్టెల్లా మెకార్ట్నీ ఎప్పుడూ ఆమె ఒంటిని అంటుకునే ఉంటుంది!

యాదృచ్ఛికంగా.. అదే రోజు!
సోవియెట్‌ యూనియ¯Œ లో చెర్నోబిల్‌ అణు ప్రమాదం సంభవించిన తర్వాత ఏడాదికి న్యాగన్‌ పట్టణంలో షరపోవా పుట్టింది. ఆ పట్టణం చెర్నోబిల్‌ దుర్ఘటన జరిగిన ప్రిప్యత్‌ పట్టణానికి 3,500 కి.మీ. దూరంలో ఉంటుంది. ఉండడం కాదు, చెర్నోబిల్‌ ప్రమాద ప్రభావం పడకుండా ఉండేందుకు షరపోవా తల్లిదండ్రులే ముందు జాగ్రత్తగా ప్రిప్యత్‌ నుంచి ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా వెళ్లిన తర్వాతే బిడ్డను కనాలని నిర్ణయించుకుని న్యాగన్‌లో తలదాచుకున్నారు. చెర్నోబిల్‌ ప్రమాదం 1986 ఏప్రిల్‌ 26న జరిగింది. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అదే రోజున షరపోవా తన ‘రీబర్త్‌’ టెన్నిస్‌ను ఆడబోతున్నారు.

తండ్రి స్నేహితుడు రాకెట్‌ ఇచ్చాడు
షరపోవాకు రెండేళ్ల వయసులో ఆమె కుటుంబం సోచ్‌ సిటీకి మారింది. అక్కడ ఆమె తండ్రికి అలెగ్జాండర్‌ కఫెల్కి కోవ్‌ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అలెగ్జాండర్‌ తన పద్నాలుగేళ్ల కొడుకు ఎవ్‌జెనీకి టెన్నిస్‌లో శిక్షణ ఇప్పిస్తున్నప్పుడు ఈ ఇద్దరి పెద్దమనుషులు కలుసుకోవడం జరిగింది. తర్వాత రెండేళ్లకు తండ్రితో పాటు ఆట చూడడానికి వచ్చిన షరపోవాను చూసి ముచ్చట పడి ఆ చిన్నారికి కూడా ఓ టెన్నిస్‌ రాకెట్‌ కొనిచ్చాడు అలెగ్జాండర్‌. అదే తొలిసారి షరపోవా రాకెట్‌ పట్టుకోవడం. లోకల్‌ పార్క్‌లో చాలాకాలం పాటు ఆ రాకెట్‌తోనే ఆడింది షరపోవా. తర్వాత రష్యన్‌ కోచ్‌ యూరి యట్కిన్‌ దగ్గర టెన్నిస్‌ పాఠాలు నేర్చుకుంది. తొలి ఆటలోనే షరపోవాలోని అతి ప్రత్యేకమైన ‘హ్యాండ్‌–ఐ కోఆర్డినేషన్‌’ని గమనించాడు కోచ్‌.

మార్టినా నవ్రతిలోవా ‘లిఫ్ట్‌’ ఇచ్చారు!
ఆరవ యేట మాస్కోలో మార్టినా నవ్రతిలోవా నడుపుతున్న టెన్నిస్‌ క్లినిక్‌లో చేరడం షరపోవా కెరీర్‌ను మలుపుతిప్పింది. మార్టినా ఈ చిన్నారిని ఫ్లోరిడాలోని ఐ.ఎం.జి.అకాడమీకి రికమండ్‌ చేశారు! ఆండ్రీ అగస్సీ, మోనికా సెలెస్, అన్నా కోర్నికోవా లాంటి టెన్నిస్‌ దిగ్గజాలు ట్రైనింగ్‌ తీసుకున్న అకాడమీ అది. కానీ షరపోవా తండ్రి దగ్గర డబ్బుల్లేవు. అప్పు చేయాలి. డబ్బైతే అప్పు చేయగలడు కానీ, ఇంగ్లిషులో మాట్లాడలేడు కదా! ఇంట్లో ఎవ్వరికీ ఇంగ్లిష్‌ రాదు. ఆ భయంతో ఏడాది తాత్సారం చేసి, చివరికి ధైర్యం చేశాడు. అయితే వీసా నిబంధనలు తండ్రీ కూతుళ్లను మాత్రమే యు.ఎస్‌.లోకి రానిచ్చాయి. తల్లి ఎలీనా రెండేళ్ల పాటు భర్తకు, కూతురికి దూరంగా రష్యాలోనే ఉండిపోవలసి వచ్చింది.

కూతురి కోసం ప్లేట్లు కడిగాడు
1994లో షరపోవా, ఆమె తండ్రి తొలిసారి అమెరికాలో అడుగుపెట్టేనాటికి వాళ్ల దగ్గరున్న డబ్బు 700 డాలర్లు. ఇప్పటి లెక్కల్లో కేవలం 47 వేల రూపాయలు. వాటిని జాగ్రత్తగా వాడుకుంటూనే ఫ్లోరిడాలోని చుట్టుపక్కల ఇళ్లల్లో ప్లేట్లు కడగడం వంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు యూరి. తర్వాతి ఏడాదికల్లా అకాడమీ ప్రవేశానికి అర్హమైన తొమ్మిదేళ్ల వయసు రాగానే కూతుర్ని ఐ.ఎం.జి.లో చేర్చారు. ఇక షరపోవాకి ట్యూషన్‌ ఫీజు, ఇతర సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ అకాడమీవే. అలా కెరీర్‌తో పాటు, షరపోవా జీవితం కూడా యు.ఎస్‌.తో ఫిక్స్‌ అయిపోయింది. ఆటల్లోనే కాదు, చారిటీల్లో కూడా ఇప్పుడామె పెద్ద సెలబ్రిటీ. సర్వీస్‌ ఓరియెంటెడ్‌ యువ క్రీడాకారిణి.

స్వీట్‌ ఎట్‌ హార్ట్‌!
సుగర్‌పోవా అనే క్యాండీ అమెరికాలో విరివిగా దొరుకుతుంది. ఫన్నీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే స్వీట్‌గా ఉంటుంది. క్యాండీల వ్యాపారి జెఫ్‌ రూబిన్‌.. షరపోవా పేరు మీదే, ఆమెతో కలసి ఈ సుగర్‌పోవా క్యాండీని సృష్టించాడు. దాని అమ్మకాలపై వచ్చే డబ్బు ‘షరపోవా చారిటీ’కి వెళుతుంది. ఒక సందర్భంలో షరపోవా తన పేరును సుగర్‌పోవాగా మార్చుకోవాలని కూడా అనుకున్నారు! అంతగా షరపోవా వల్ల ఆ ప్రోడక్ట్‌ ఇమేజ్‌ పెరిగిపోయింది. ప్రస్తుతం హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూల్లో షరపోవా చదువుతున్న షార్ట్‌టర్మ్‌ కోర్సు కూడా తన క్యాండీ బిజినెస్‌ను విస్తృతం చెయ్యడానికి ఉపయోగపడేదే.

ఇదీ షరపోవా బ్రీఫ్‌ బయోగ్రఫీ. అసలు ఆమె ఇంగ్లిష్‌ ఎలా నేర్చుకుందీ, కనీస విద్యార్హతలు లేకుండానే హార్వర్డ్‌లో ఇప్పుడు కోర్సు ఎలా చేస్తోందీ అనే డీటెయిల్స్‌ కావాలనుకునేవారు తను రాయబోతున్న పుస్తకం కోసం వచ్చే సెప్టెంబర్‌ వరకు ఆగాలి. మొదట ఇంగ్లిష్‌లో, తర్వాత రష్యన్‌ భాషలో పబ్లిష్‌ కాబోతున్న ఆ పుస్తకం.. నో డౌట్‌.. ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.



‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ ఘనత
మహిళల టెన్నిస్‌ చరిత్రలో ఇప్పటివరకు 10 మంది మాత్రమే ‘కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ (నాలుగు వేర్వేరు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించడం) ఘనతను అందుకున్నారు. అప్పటికే మూడు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన షరపోవా 2012లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ దక్కించుకోవడం ద్వారా ఈ
ఘనత సాధించారు.

పద్నాలుగేళ్లకే ప్రొఫెషనల్‌
తొమ్మిదేళ్ల వయసులోనే అండర్‌–16 టోర్నమెంట్‌లో విజేతగా నిలిచిన షరపోవా ఒక్కో మెట్టు అధిగమిస్తూ కెరీర్‌లో ముందుకు సాగారు. 14 ఏళ్లకే ప్రొఫెషనల్‌గా మారారు. 2003లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌లలో (ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, వింబుల్డన్, యూఎస్‌ ఓపెన్‌) మెయిన్‌ ‘డ్రా’ మ్యాచ్‌ల్లో ఆడారు. 2004లో షరపోవా కెరీర్‌ మలుపు తిరిగింది. ఆ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ ఫైనల్లో టాప్‌ సీడ్, డిఫెండింగ్‌ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా)పై వరుస సెట్‌లలో షరపోవా గెలిచి 17 ఏళ్లకే వింబుల్డన్‌ చాంపియన్‌గా అవతరించి పెను సంచలనం సృష్టించారు. అదే ఏడాది సీజన్‌ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో సెరెనాను మరోసారి ఓడించి షరపోవా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానానికి ఎగబాకారు. 2005లో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను సంపాదించారు. షరపోవా ఆటతీరు దూకుడుగా ఉంటుంది.. రివర్స్‌ ఫోర్‌హ్యాండ్‌ షాట్‌లు ఎక్కువగా ఆడే షరపోవా సంప్రదాయ వాలీ, ఓవర్‌హెడ్‌ స్మాష్‌లు అంతగా ఆడరు. వీటికి బదులు నెట్‌ వద్దకు దూసుకొస్తూ బంతి గాల్లో ఉన్నపుడు వాలీ షాట్‌లు ఆడటాన్ని ఇష్టపడతారు. ఆటద్వారా షరపోవా సంపాదించిన ప్రైజ్‌మనీ 3 కోట్ల 64 లక్షల 84 వేల 486 డాలర్లు (రూ. 245 కోట్లు).
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement