
డోపింగ్ వ్యవహారంపై మెతక వైఖరి వీడి 3 నెలల వేటు
ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందే ముగియనున్న సస్పెన్షన్
లండన్: వరల్డ్ టాప్ ర్యాంక్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్‌పై ఎట్టకేలకు మూడు నెలల నిషేధం విధించారు. స్టార్ అయినా... ఎంతటి వారైనా... డోపింగ్‌కు పాల్పడితే శిక్ష తప్పదనే సంకేతాన్ని ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) ఇచ్చినట్లయ్యింది. దాదాపు ఏడాదిగా నలుగుతున్న ఈ కేసుకు ఎట్టకేలకు నిషేధంతో తెర పడనుంది. మూడు గ్రాండ్‌స్లామ్‌ల విజేత, ఇటలీకి చెందిన ప్రపంచ నంబర్‌వన్ సినెర్ గత మార్చిలో డోపింగ్‌లో పట్టుబడ్డాడు.
అతని నమూనాల్లో నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలినా... ఈ టాప్ ర్యాంకర్‌పై అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) మెతక వైఖరి అవలంభించింది. అతని టెస్టు ఫలితాన్ని ప్రపంచానికి తెలియనివ్వలేదు. కొన్ని నెలల తర్వాత బయటికి పొక్కినా కూడా 23 ఏళ్ల సినెర్ తను ఉద్దేశ పూర్వకంగా తీసుకోలేదని, బహుశా మసాజ్‌కు వాడిన తైలం వల్లా తన శరీరంలోకి ప్రవేశించి ఉండొచ్చనే వివరణతో ఐటీఐఏ సంతృప్తి చెంది పెద్దగా చర్యలేం తీసుకోలేదు.
దీంతో టెన్నిస్ ఇంటిగ్రిటీపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు దిగ్గజాలు, స్టార్లు, విశ్లేషకులు ‘ఒక్కొక్కరికి ఒక్కోలా చట్టాలు–చర్యలా’ అంటు దుమ్మెత్తిపోశారు. అయినా ఐటీఐఏ నిమ్మకు నీరెత్తినట్లే ఉండిపోయింది కానీ చర్యలు మాత్రం చేపట్టలేదు. ‘వాడా’ మాత్రం పరీక్షల్లో పట్టుబడ్డాడు కాబట్టి ఏడాదైనా నిషేధం విధించాలని స్పోర్ట్స్ అర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. చివరకు తాజాగా ఐటీఐఏ, సినెర్, వాడాల మధ్య ఒప్పందం కుదరడంతో వాడా ఇటీవల అప్పీల్‌ను ఉపసంహరించుకుంది.
ఒప్పందంలో భాగంగా మూడు నెలలు నిషేధం విధించేందుకు ఐటీఐఏ సిద్ధమవగా... సినెర్ కూడా విమర్శలకు చెక్ పెట్టేందుకు సమ్మతించడంతో డోపింగ్ వివాదం ముగిసింది. ఫిబ్రవరి 9వ తేదీ నుంచి మే 4 వరకు ఈ నిషేధం అమలవుతుంది. ఈ కాలంలో అతను ఏ స్థాయి టెన్నిస్ టోర్నీల్లో పాల్గొనేందుకు వీలుండదు. అయితే మే 25 నుంచి జరిగే సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ ఆడేందుకు ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో అతను బరిలోకి దిగుతాడు.
ఇదేం సస్పెన్షన్?
సినెర్‌కు విధించిన మూడు నెలల శిక్ష పట్ల టెన్నిస్‌లో పలువురు ఆటగాళ్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో విమర్శించిన తరహాలోనే సినెర్ చాలా తక్కువ శిక్షతో బయటపడ్డాడని... టెన్నిస్‌లో ఒక్కో ఆటగాడికి ఒక్కో రకమైన నిబంధన ఉందని వారు వ్యాఖ్యానించారు. ‘సినెర్ సన్నిహితులు తమ పరపతిని బాగా ఉపయోగించినట్లుంది. కేవలం మూడు నెలల నిషేధంతో సరిపెట్టేలా చేసుకోగలిగారు.
ఒక్క టైటిల్ వెనక్కి తీసుకోలేదు. కనీసం ప్రైజ్‌మనీలో కూడా కోత విధించలేదు. మరి అతను తప్పు చేసినట్లా, చేయనట్లా. టెన్నిస్‌కు దురదృష్టకరమైన రోజు. ఇక్కడ నిజాయితీ మిగల్లేదు’ అని కిరియోస్ అన్నాడు. మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన స్టాన్ వావ్రింకా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘టెన్నిస్ ఇక ఏమాత్రం స్వచ్ఛమైన ఆట కానే కాదు’ అని చెప్పాడు.
టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ కూడా ‘ఇక్కడి వ్యవస్థ నిజంగా చెడిపోయింది. ఇది ఒక క్లబ్‌లా మాత్రమే వ్యవహరిస్తోంది. ఒక్కో కేసుకు ఒక్కో రకంగా స్పందిస్తోంది. అన్నింటా అసమానతలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత, పద్ధతి లేవు. ఇది ఆటగాళ్లను అగౌరవపర్చడమే. ఇకపై మార్పు అవసరం’ అని స్పందించింది.
Comments
Please login to add a commentAdd a comment