సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రతా సంస్థ (ఐటీఐఏ) తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డోపీలుగా తేలిన యానిక్ సినెర్(Jannik Sinner), స్వియాటెక్(Iga Swiatek)ల ఉదంతంపై ఐటీఐఏ వ్యవహారశైలిని దుయ్యబట్టాడు. ఐటీఐఏ అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
బ్రిస్బేన్ ఈవెంట్ కోసం
అదే విధంగా.. టాప్ స్టార్‌ల డోపింగ్ మరకలపై గోప్యతను పాటించి టెన్నిస్ సమాజం నుంచి నిజాన్ని దాచడంపై సరికాదని పేర్కొన్నాడు. తన కెరీర్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్.. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. 2009 తర్వాత బ్రిస్బేన్ ఈవెంట్ ఆడేందుకు వచ్చిన అతడు మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా.. ‘సినెర్ ఉద్దేశ పూర్వకంగా నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నాడా లేదంటే ప్రమేయం లేకుండా తీసుకున్నాడా అనే విషయంపై నేను చర్చించడం లేదు.
ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదు
ఎందుకంటే గతంలో డోపీగా తేలితే సస్పెన్షన్‌కు గురైన ఎంతోమంది ప్లేయర్లు ఉన్నారు. కొందరు దిగువ ర్యాంకు ప్లేయర్లు తమ డోపింగ్ కేసు–నిషేధం పరిష్కారమవ్వాలని ఏడాదిగా చూస్తున్నారు.
కానీ వీళ్ల (సినెర్, స్వియాటెక్) విషయాన్నేమో ప్రపంచానికి తెలీకుండా గోప్యత పాటించడం, తూతూ మంత్రపు నిషేధం చర్యలతో సరిపెట్టడం, మొత్తం టెన్నిస్ సమాజానికి కళ్లకు గంతలు కట్టడం వంటివి చేస్తున్న టెన్నిస్ ఇంటిగ్రిటీ వ్యవహారశైలీ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.
ఇది ఆటకున్న ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా ఉంది. ఒక సమాఖ్య అందరు ఆటగాళ్లను సమానంగా చూడదా? ఒక్కొక్కరికి ఒక్కో నిబంధనలు ఉంటాయా? ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదు’ అని జొకోవిచ్ సమాఖ్య తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. తానైతే ప్రస్తుతం కొత్తసీజన్‌పై తాజాగా దృష్టి సారించినట్లు చెప్పాడు.
ఘనమైన రికార్డు
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో ఫైనల్ చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియన్ సూపర్‌స్టార్‌కు చక్కని రికార్డు ఉంది. ఇక్కడ అతడు 10 టైటిల్స్ సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment