Tennis players
-
ఎందుకీ వివక్ష.. ఏమిటీ ద్వంద్వ ప్రమాణాలు?!
సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్(Novak Djokovic) అంతర్జాతీయ టెన్నిస్ సమగ్రతా సంస్థ (ఐటీఐఏ) తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. డోపీలుగా తేలిన యానిక్ సినెర్(Jannik Sinner), స్వియాటెక్(Iga Swiatek)ల ఉదంతంపై ఐటీఐఏ వ్యవహారశైలిని దుయ్యబట్టాడు. ఐటీఐఏ అవలంభిస్తున్న ద్వంద్వ ప్రమాణాలు సిగ్గుచేటంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్ ఈవెంట్ కోసంఅదే విధంగా.. టాప్ స్టార్ల డోపింగ్ మరకలపై గోప్యతను పాటించి టెన్నిస్ సమాజం నుంచి నిజాన్ని దాచడంపై సరికాదని పేర్కొన్నాడు. తన కెరీర్లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన జొకోవిచ్.. బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టోర్నీతో కొత్త సీజన్‌ను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. 2009 తర్వాత బ్రిస్బేన్ ఈవెంట్ ఆడేందుకు వచ్చిన అతడు మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ‘సినెర్ ఉద్దేశ పూర్వకంగా నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నాడా లేదంటే ప్రమేయం లేకుండా తీసుకున్నాడా అనే విషయంపై నేను చర్చించడం లేదు.ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదుఎందుకంటే గతంలో డోపీగా తేలితే సస్పెన్షన్‌కు గురైన ఎంతోమంది ప్లేయర్లు ఉన్నారు. కొందరు దిగువ ర్యాంకు ప్లేయర్లు తమ డోపింగ్ కేసు–నిషేధం పరిష్కారమవ్వాలని ఏడాదిగా చూస్తున్నారు. కానీ వీళ్ల (సినెర్, స్వియాటెక్) విషయాన్నేమో ప్రపంచానికి తెలీకుండా గోప్యత పాటించడం, తూతూ మంత్రపు నిషేధం చర్యలతో సరిపెట్టడం, మొత్తం టెన్నిస్ సమాజానికి కళ్లకు గంతలు కట్టడం వంటివి చేస్తున్న టెన్నిస్ ఇంటిగ్రిటీ వ్యవహారశైలీ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది.ఇది ఆటకున్న ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ఉంది. ఒక సమాఖ్య అందరు ఆటగాళ్లను సమానంగా చూడదా? ఒక్కొక్కరికి ఒక్కో నిబంధనలు ఉంటాయా? ఇదేం వివక్షో నాకైతే అర్థం కావడం లేదు’ అని జొకోవిచ్ సమాఖ్య తీరుపై విమర్శలతో విరుచుకుపడ్డాడు. తానైతే ప్రస్తుతం కొత్తసీజన్పై తాజాగా దృష్టి సారించినట్లు చెప్పాడు.ఘనమైన రికార్డుఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న జొకోవిచ్ వింబుల్డన్‌లో ఫైనల్ చేరాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియన్ సూపర్‌స్టార్‌కు చక్కని రికార్డు ఉంది. ఇక్కడ అతడు 10 టైటిల్స్ సాధించాడు. -
'ఆ రూమ్‌లు మెడిటేషన్‌కు మాత్రమే.. శృంగారం కోసం కాదు'
టెన్నిస్‌లో నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు ఉంటే అందులో వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్కడి నిర్వాహకులు కొన్ని విషయాల్లో చాలా కఠినంగా ఉంటారు. తాజాగా సోమవారం నుంచి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ ప్రారంభమైంది. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో మ్యాచ్‌లు జరిగే కోర్టుల వద్ద క్వైట్ రూమ్స్ (Quite Rooms) ఏర్పాటు చేయడం ఆనవాయితీ. సాధారణంగా ఈ క్వైట్ రూమ్స్‌ను ఆటగాళ్లు, ఇతర వ్యక్తులు ప్రార్థనలు, మెడిటేషన్స్ కోసం మాత్రమే ఉపయోగించాలనే రూల్ ఉంది. కానీ గతేడాది జరిగిన వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ సమయంలో ఈ క్వైట్ రూమ్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లు రిపోర్టులు వచ్చాయి. కొంతమంది ఆటగాళ్లు శృంగారంలో పాల్గొనగా.. మరికొంతమంది తమ పార్ట్‌నర్స్‌తో ఏకాంతంగా గడిపినట్లు సమాచారం. ముఖ్యంగా కోర్టు 12కు ఆనుకొని ఉన్న క్వైట్ రూమ్‌లో ఇలాంటివి వెలుగు చూసినట్లు తెలిసింది. అందుకే వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ నిర్వాహకులు ఈసారి టోర్నీ ప్రారంభానికి ముందే ఆటగాళ్లకు, ఇతరులకు ముందే వార్నింగ్ ఇచ్చారు. క్వైట్ రూమ్‌లు కేవలం మెడిటేషన్స్, ప్రార్థనల కోసం మాత్రమే ఉపయోగించాలని.. తమ పర్సనల్ పనులు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశారు. ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్(ALETC) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సాలీ బోల్టన్ ఇదే విషయమై స్పందించారు. ''క్వైట్ రూమ్ అనేది చాలా ముఖ్యం. కేవలం అక్కడ మనసు ప్రశాంతత కోసం ధ్యానం, ప్రార్థనలు మాత్రమే చేయాలి. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదు. ప్రార్థనల కోసం అయితే పర్లేదు. అలాగే తల్లులు తమ పిల్లలకు పాలిచ్చేందుకు కూడా ఇక్కడ సౌకర్యాలు(BreastFeeding Centres) ఉంటాయి. కాబట్టే దీన్ని సరైన మార్గంలో వినియోగించుకోవాలి.''అంటూ పేర్కొంది. చదవండి: కోల్‌కతాలో పర్యటిస్తున్న అర్జెంటీనా స్టార్ గోల్ కీపర్.. నోరూరించే వంటకాలు రెడీ 'పదివేల మంది మహిళలతో శృంగారంలో పాల్గొన్నా' -
రష్యా, బెలారస్ టెన్నిస్ ఆటగాళ్లకు ఊరట.. నిషేధం ఎత్తివేత
Russia And Belarus Tennis Players: ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం నేపథ్యంలో గత ఏడాది రష్యా, బెలారస్ టెన్నిస్ క్రీడాకారులపై ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ క్లబ్ నిషేధం విధించింది. దాంతో ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రష్యా, బెలారస్ క్రీడాకారులు పాల్గొనలేకపోయారు. అయితే ఈ ఏడాది రష్యా, బెలారస్ క్రీడాకారులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తున్నామని, వారు తటస్థ క్రీడాకారుల హోదాలో పాల్గొనవచ్చని ఆల్ ఇంగ్లండ్ క్లబ్ తెలిపింది. దాంతో పురుషుల విభాగంలో స్టార్స్ మెద్వెదెవ్, రుబ్లెవ్, ఖచ నోవ్ (రష్యా), మహిళల విభాగంలో విక్టోరియా అజరెంకా, ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత అరీనా సబలెంకా (బెలారస్) వింబుల్డన్‌లో ఆడేందుకు మార్గం సుగమమైంది. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ జూలై 3 నుంచి 16 వరకు జరుగుతుంది. చదవండి: IPL2023 Opening Ceremony: అట్టహాసంగా ఐపీఎల్ ఆరంభ వేడుకలు: దుమ్ములేపిన తమన్నా, రష్మిక.. తెలుగు పాటలతో -
గదుల్లో ఎలుకలు, నాణ్యతలేని ఆహారం
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చి క్వారంటైన్లో చిక్కుకుపోయిన విదేశీ టెన్నిస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒకరు పేర్కొనగా, తమకు అందిస్తున్న భోజనం సరిగా లేదని మరో ప్లేయర్ వాపోయాడు. శనివారం మెల్బోర్న్కు ప్లేయర్లను తీసుకొచ్చిన విమానాల్లో నలుగురికి కరోనా పాజిటివ్ ఫలితం రావడంతో అందులో ప్రయాణించిన 47 మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఒకరైన కజకిస్తాన్ మహిళా ప్లేయర్ యులియా పుతిన్సెవా తన గదిలో ఎలుక తిరుగుతోన్న వీడియోను ట్విట్టర్లో పంచుకుంది. ప్రాక్టీస్‌కు అనుమతించకపోవడంతో ఆమె తన గదిలోని బీరువాను ప్రాక్టీస్ వాల్‌గా మార్చుకుంది. బీరువాకు బంతి కొడుతూ షాట్లు ప్రాక్టీస్ చేసింది. విమానంలో ప్రయాణించిన వారిలో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారంతా క్వారంటైన్లో ఉండాలని తనకు ముందే చెబితే అసలు ఈ ప్రయాణం గురించి పునరాలోచించుకునేదాన్నని ఆమె వ్యాఖ్యానించింది. ప్రపంచ 15వ ర్యాంక్ ప్లేయర్ పాబ్లో కరెనో బుస్టా... క్వారంటైన్లో తనకు అందించిన నాణ్యతలేని భోజనంపై అసంతృప్తి వెలిబుచ్చగా, ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పెయిర్ హోటల్ భోజనాన్ని తిరస్కరించి బయట నుంచి తెప్పించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ చీఫ్ క్రెగ్ టిలీ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 8 నుంచి పోటీలు జరుగుతాయని ఆదివారం స్పష్టం చేశారు. కష్టమైనప్పటికీ ఆటగాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సిందేనని పేర్కొన్నారు. -
మన ముగ్గురం కలిసి...
పారిస్: కరోనా మహమ్మారి దెబ్బకు టోర్నీల్లేక ఇబ్బందులెదుర్కొంటున్న యువ ఆటగాళ్లకు ఆర్థికంగా చేయూత అందించేందుకు టెన్నిస్ దిగ్గజాలు రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్), నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) సిద్ధమవుతున్నారు. టెన్నిస్‌లో రాణించాలని కోటి ఆశలతో వచ్చిన కొత్త ఆటగాళ్లకు ప్రస్తుత లాక్డౌన్ శరాఘాతమైంది. వీరికి ఎలాంటి స్పాన్సర్షిప్స్ ఉండవు. చిన్నాచితక టోర్నీల్లో ఆడితేనే ప్రైజ్‌మనీల రూపంలో డబ్బు వస్తుంది. లేదంటే లేదు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) నుంచి కూడా ఆర్థిక తోడ్పాటు ఉండదు. ముఖ్యంగా 200 ర్యాంకు నుంచి 700 ర్యాంకుల్లో ఉన్న వారికి టోర్నీలు జరగడమే ఇం‘ధనం’. లేదంటే కెరీర్ బండి నడవదు. వాళ్లు సొంత డబ్బులతో టోర్నీలకు వెళ్తారు. ఆ టోర్నీలే లేకపోతే వారి కష్టాలు వర్ణనాతీతం. దీన్ని గమనించిన ఈ ముగ్గురు దిగ్గజాలు భవిష్యత్ టెన్నిస్ తారల కోసం నిధిని ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారు. అంతర్జాతీయ టెన్నిస్ ఆటగాళ్ల సంఘానికి అధ్యక్షుడైన జొకోవిచ్ మాట్లా డుతూ... ‘మన ముగ్గురం కలిసి 30 నుంచి 45 లక్షల డాలర్లు సమకూర్చితే... ఈ మొ త్తాన్ని తక్కువ ర్యాంకు ఆటగాళ్లకు పంపిణీ చేయవచ్చు’ అని సూచించాడు. భవిష్యత్ టెన్నిస్ బాగుండాలనే ఈ ప్రతిపాదన తెచ్చినట్లు అతను చెప్పాడు. ఈ ఏడాది చివర్లో జరిగే వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీలో వచ్చిన ప్రైజ్‌మనీతో ఈ నిధిని జమచేయవచ్చని అన్నాడు. ఒకవేళ ఈ సీజన్ మొత్తం రద్దయితే ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో దక్కించుకున్న ప్రైజ్‌మనీ నుంచైనా నిధిని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు జొకోవిచ్ తెలిపాడు. -
టెన్నిస్‌లో బెట్టింగ్ కలకలం!
బెర్లిన్: టెన్నిస్‌లో బెట్టింగ్ కలకలం చోటుచేసుకుంది. దాదాపు 135 మందికి పైగా ప్రొఫెషనల్ ఆటగాళ్లకు బెట్టింగ్‌లతో సంబంధం ఉందని... అందులో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) టాప్–30 ర్యాంకింగ్ ఆటగాళ్లు ఉన్నారంటూ జర్మనీ మీడియా డై వెల్ట్, బ్రాడ్‌క్యాస్టర్ జీడీఎఫ్ బాంబు పేల్చింది. వీరు తొందర్లోనే అమెరికా దర్యాప్తు సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ), యూరోపియన్ అథారిటీస్లతో విచారణ ఎదుర్కోనున్నారని ఆ మీడియా సంస్థలు తెలిపాయి. ఇందులో ఇప్పటి వరకు 3 ఏటీపీ టూర్ టైటిల్స్ నెగ్గిన టాప్–30 ర్యాంకు ఆటగాడు ఉన్నాడని సమాచారం. అర్మేనియా బెట్టింగ్ మాఫియాతో చేతులు కలిపిన కొందరు టెన్నిస్ ఆటగాళ్లు మ్యాచ్ ఫలితాలను తారుమారు చేస్తున్నారని బెల్జియం న్యాయవాది ఎరిక్ బిషప్ తెలిపారు. ఈ బెట్టింగ్‌ల ద్వారా కొన్ని వేల యూరోలు చేతులు మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఫిక్సింగ్ చేస్తూ దొరికిన అర్జెంటినా మాజీ టెన్నిస్ ఆటగాడు మార్కొ ట్రుంగెల్లిటి ఈ బెట్టింగ్ సమాచారం అందించినట్లుగా టెన్నిస్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. -
సాకేత్, వినాయక్ ఓటమి
పుణే: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాకేత్ మైనేని, కాజా వినాయక్ శర్మతోపాటు హైదరాబాద్ ప్లేయర్ అనిరుధ్ చంద్రశేఖర్ కథ ముగిసింది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాకేత్ మైనేని 6–3, 5–7, 4–6తో ఎర్గిల్ కిర్కిన్ (టర్కీ) చేతిలో... వినాయక్ శర్మ 2–6, 1–6తో సెమ్ ఇల్కెల్ (టర్కీ) చేతిలో... అనిరుధ్ 3–6, 2–6తో రొబెర్టో ఒల్మెడో (స్పెయిన్) చేతిలో ఓడిపోయారు. భారత్‌కే చెందిన ప్రజ్నేశ్ గుణేశ్వరన్, సుమీత్ నాగల్, రామ్‌కుమార్ రామనాథన్, శశికుమార్ ముకుంద్ రెండో రౌండ్లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించారు. -
చెన్నైలో టెన్నిస్ క్రీడాకారుల ఫాషన్ షో
-
టెన్నిస్ ద్రోణుడు
అర్జునుడు విలువిద్యలో నేర్పరి అని కొనియాడే సమయంలో ద్రోణాచార్యుడిని కూడా తలుచుకోవాలని మహాభారతం గుర్తు చేస్తుంది. ఆ స్ఫూర్తితోనే భారతదేశ వర్ధమాన టెన్నిస్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సురేశ్ కృష్ణ, పి.సి. విఘ్నేశ్, వై. సందీప్‌రెడ్డి, సౌజన్య భవిశెట్టి... వంటి వారి గురించి చెప్పుకునే ప్రతిసారీ.. వారిని మేటి క్రీడాకారులుగా తీర్చి దిద్దిన కోచ్ సి. వి. నాగరాజును కూడా గుర్తు చేసుకోవాలి. సికింద్రాబాద్‌లోని ఆర్ ఆర్ సి (రైల్వే రిక్రియేషన్ క్లబ్) గ్రౌండ్స్‌లో ఐదేళ్ల నుంచి 22 ఏళ్ల వయసున్న సుమారు యాభై మంది పిల్లలు టెన్నిస్ సాధన చేస్తున్నారు. కొందరు పిల్లల తల్లులు ఓ పక్కగా కూర్చుని ఓ కంట టెన్నిస్ సాధనను గమనిస్తూ కబుర్లలో ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల్లో ప్రతి ఒక్కరి ఆటతీరును గమనిస్తూ ఉన్నారు 53 ఏళ్ల కంజీవరం వెంకట్రావు నాగరాజు. షాట్లో పొరపాటు జరిగితే వెంటనే పిల్లలను పేరుతో పిలిచి షాట్ అలా కాదంటూ వెళ్లి సరిచేస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు మడమకు దెబ్బ తగిలించుకున్నాడు. వెంటనే క్రేప్ బ్యాండేజ్‌తో కట్టుకట్టి ‘ఈ రోజుకి ఇక ఆడకు. ఇంటికి వెళ్లి మమ్మీడాడీతో ఫోన్ చేయించు, ఏం చేయాలో చెప్తాను’ అని ఓ పక్కన కూర్చోబెట్టారు. రాకెట్ పట్టుకోవడం మొదలు ఆటలో మెలకువలు నేర్పించడం, గాయమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం, క్రీడాకారులు తీసుకోవాల్సిన రోజువారీ ఆహార పట్టిక తయారు చేసివ్వడం వరకు కోచ్‌దే బాధ్యత. అలా ఈ కోచ్ చేతిలో తయారైన టెన్నిస్ క్రీడాకారులు ఇవాళ జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ‘‘సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. నా విద్యార్థులు డేవిస్ కప్ సాధించారు, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు గెలుచుకున్నారు. శిక్షకుడిగా నా సంతోషం నేను తయారు చేసిన వారి విజయాల్లోనే ఉంటుంది’’ అంటారు నాగరాజు. తెలుగు నేలపై నాలుగోతరం..! తల్లిదండ్రులిద్దరూ మంచి క్రీడాకారులు కావడమే తనను క్రీడల వైపు మరల్చింది అంటారు నాగరాజు. ‘‘మా అమ్మ రాజేశ్వరీ వెంకట్రావ్ బెంగుళూరులో టెన్నిస్ ఆడేది. తండ్రి సి.డి. వెంకట్రావ్ ఉస్మానియా తరఫున ఆడేవారు. నేను జూనియర్స్ లెవెల్లో నేషనల్స్ ఆడాను. సాధారణ ఉద్యోగాలు చేస్తే టెన్నిస్‌కు దూరం కావాల్సిందే అని తెలిసిన తర్వాత టెన్నిస్ కోచ్ కావడానికి కావల్సిన కోర్సులు చేసి శిక్షకుడిగా మారాను’’ అని వివరించారాయన. నాగరాజు పూర్వీకులది తమిళనాడులోకి కంజీవరం. నాలుగు తరాల ముందు శ్రీనివాసన్ సికింద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అతడి కుమారుడు దామోదర్ మొదలియార్ డెక్కన్ రైల్వేస్‌లో ఉద్యోగి. అతడి కుమారుడే టెన్నిస్ క్రీడాకారుడు సి.డి. వెంకట్రావ్ - ప్రస్తుతం టెన్నిస్ శిక్షకులైన నాగరాజు తండ్రి. అలా తమిళనాడు నుంచి వచ్చి తెలుగుగడ్డపై స్థిరపడినవారిలో నాలుగోతరం తనదంటారాయన. ఇంతమంది క్రీడాకారులను తయారు చేస్తున్నప్పటికీ తన కుటుంబం నుంచి టెన్నిస్ వారసులను తయారు చేయలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు నాగరాజు. ‘‘నాకు ఒక్కతే అమ్మాయి. పేరు సాయికుమారి. నేను పొద్దున్నే గ్రౌండ్‌కి వచ్చేవాడిని. తిరిగి ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మాయి స్కూలుకెళ్ళేది. సాయంత్రం తాను ఇంటికి వచ్చేటప్పటికి నేను గ్రౌండ్‌కు రావడం, నేను ఇల్లు చేరేసరికి తను నిద్రపోవడం... తన బాల్యం దాదాపుగా ఇలాగే గడిచింది. తనకు టెన్నిస్ నేర్పించాలని నేను చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మా ఆవిడ టీచరు కావడంతోనో ఏమో మా అమ్మాయికి పుస్తకాల మీద, చదువు మీద ఆసక్తి ఎక్కువగా కనిపించింది. దాంతో తనను అలాగే కొనసాగనిచ్చాం. ఆమె ఇప్పుడు ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తూ భర్తతో కలిసి ముంబయిలో ఉంటోంది. తండ్రిగా నన్ను చాలా ప్రేమిస్తుంది కానీ, తనకు టెన్నిస్ మీద ప్రేమ కలగలేదు’’ అన్నారాయన కొంచెం బాధగా. ఇది నిరంతర సాధన! పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలంటే వారికి కనీసంగా గ్రౌండ్‌కి రాగలిగిన ఆసక్తి ఉంటే చాలు, ఆ తర్వాత వారిని చైతన్యవంతం చేసి క్రీడాస్ఫూర్తి పెంచడం పెద్ద కష్టం కాదంటారు నాగరాజు. ‘‘టెన్నిస్ సాధన ఐదేళ్ల వయసులో మొదలు పెట్టి ఇరవై రెండు - ఇరవై మూడేళ్లు వచ్చే వరకు నిరంతరాయంగా చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. పద్దెనిమిదేళ్ల ముందే ఓ కల కనాలి. ఆ కలను సాకారం చేసుకోవడానికి అంతకాలం పాటు ఓపిగ్గా శ్రమించాలి’’ అని సూచించారు నాగరాజు. ఉత్తమ శిక్షకుడిగా ‘ఫార్కుందా అలీ అవార్డు’, ‘ప్రైడ్ ఇండియా’ పురస్కారాలను అందుకున్న నాగరాజు ప్రభుత్వం సహకరించి మంచి క్రీడాప్రాంగణానికి అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. నిజమే! ద్రోణాచార్యుడైనా సరే అంత గొప్ప విలుకాళ్లను తయారు చేయగలిగాడంటే పాలకులు తగిన వనరులు కల్పించడం వల్లే సాధ్యమైంది. ఆధునిక యుగానికీ అదే వర్తిస్తుంది. - వాకా మంజులారెడ్డి ఫొటోలు: శివ మల్లాల ‘‘తల్లిదండ్రులు కొంత ఖర్చుకు, కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. పెళ్లిళ్లు, వేడుకలంటూ సాధనకు అంతరాయం రానివ్వకూడదు. పిల్లలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల ఆట కోసమే సమయాన్ని కేటాయించాలి. కోచ్ఫీజు, పిల్లల దుస్తులు, టోర్నమెంట్లకు తీసుకెళ్లే చార్జీల వంటివి కలుపుకుని నెలకు పది నుంచి పదిహేను వేల ఖర్చు ఉంటుంది. వారిని గ్రౌండ్‌కు తీసుకురావడం, సూచించిన పోషకాహారం పెట్టడం వరకు తల్లిదండ్రులు చూసుకుంటే చాలు. వారిలో ఆట పట్ల ఆసక్తిని పెంచడం, ఆడితీరాలనేటట్లు చైతన్యవంతం చేయడం వంటివన్నీ మేమే చూసుకుంటాం.’’ - కె.వి. నాగరాజు, టెన్నిస్ కోచ్ -
సానియా కూడా అదే దారిలో...
బెంగళూరు: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు దూరమవుతున్న టెన్నిస్ ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ క్రీడల్లో ఆడలేమని ప్రకటించగా... తాజాగా మహిళల డబుల్స్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ జాబితాలో చేరింది. ఇంచియాన్‌లో ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నమెంట్లు కూడా జరుగుతుండడమే ఈ ఆటగాళ్ల నిర్ణయానికి కారణం. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకపోతే విలువైన పాయింట్లతో పాటు ఆర్థికంగా నష్టం చేకూరనుండడంతో వీరంతా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దూరమవుతున్నారు. పేస్, బోపన్న, సానియాలకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నుంచి బుధవారం అనుమతి లభించింది. ‘ఆటగాళ్ల విజ్ఞప్తిని మన్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీల్లో వారిని ఆడేందుకు అనుమతిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనాలంటే వారు తమ పాయింట్లను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది’ అని ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ఖన్నా తెలిపారు. ఇటీవలే యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ నెగ్గిన సానియా... ఆసియా క్రీడల్లో పాల్గొనే నిర్ణయాన్ని ‘ఐటా’కు వదిలేసిన సంగతి తెలిసిదే. మరోవైపు ఈ ఆటగాళ్ల స్థానంలో ఇతరులను ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోవడంతో యువ ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, సనమ్ సింగ్, సాకేత్ మైనేని, దివిజ్ శరణ్‌లపై భారత్ పతకాల ఆశలు పెట్టుకోవాల్సి ఉంది. సానియా లేకపోవడంతో మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా ఏమేరకు రాణిస్తుందో చూడాల్సి ఉంది. ఇది నా జీవనాధార సమస్య: లియాండర్ పేస్ భారత్ తరఫున ఆసియా గేమ్స్‌లో పాల్గొనకపోవడం బాధాకరమే అయినా తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని 41 ఏళ్ల లియాండర్ పేస్ అన్నాడు. అయితే దేశం పట్ల తన కమిట్మెంట్ను ఎవరూ ప్రశ్నించలేరని చెప్పాడు. ‘ఇది నా జీవనాధార సమస్య. ఇప్పుడు నా ప్రపంచ ర్యాంకింగ్ 35కు దిగజారింది. అందుకే వచ్చే ఏడాది ‘ఉద్యోగ భద్రత’ చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కౌలాలంపూర్, టోక్యో టోర్నమెంట్స్‌లో నేను కచ్చితంగా ఆడాలి. సరిగ్గా ఇవి ఆసియా గేమ్స్ సమయంలోనే జరుగుతున్నాయి. 24 ఏళ్లుగా దేశం కోసం నేను చాలాసార్లు ఆడాను. నా నిబద్ధతను శంకించాల్సిన పని లేదు’ అని పేస్ వివరించాడు. -
యువ క్రీడాకారిణులకు జీవీకే చేయూత
జింఖానా, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్ యువ టెన్నిస్ క్రీడాకారిణులు సామ సాత్విక, షేక్ జాఫ్రీన్లకు జీవీకే అకాడమీ స్పాన్సర్ చేయనుంది. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అకాడమీ డెరైక్టర్ జీవీ కృష్ణారెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. ‘ఈ ఇద్దరు క్రీడాకారిణులు ప్రస్తుతం మంచి ప్రతిభతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే షేక్ జాఫ్రీన్ 2013 బధిరుల ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. సాత్విక జాతీయ స్థాయిలో ఎన్నో విజయాలను నమోదు చేసింది. అయితే ఇటువంటి క్రీడాకారిణులకు ప్రోత్సాహం ఎంతో అవసరం. గతేడాది మేము స్పాన్సర్ చేసిన అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల ప్రస్తుతం జూనియర్ విభాగంలో అగ్రస్థానంలో నిలిచినందుకు ఎంతో గర్విస్తున్నాము. ఆమెతో మా ఒప్పందాన్ని మరో ఏడాది పొడిగించాం. మన రాష్ట్రంలో ప్రతిభాశీలురు చాలా మంది ఉన్నా సరైన మార్గదర్శనం, ప్రోత్సాహం లేక మరుగున పడిపోతున్నారు. అలాంటి క్రీడాకారులకు చేయూతనిచ్చి వారిని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం’ అని జీవీకే రెడ్డి అన్నారు.