సానియా కూడా అదే దారిలో...
బెంగళూరు: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు దూరమవుతున్న టెన్నిస్ ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ క్రీడల్లో ఆడలేమని ప్రకటించగా... తాజాగా మహిళల డబుల్స్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ జాబితాలో చేరింది. ఇంచియాన్‌లో ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నమెంట్లు కూడా జరుగుతుండడమే ఈ ఆటగాళ్ల నిర్ణయానికి కారణం. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకపోతే విలువైన పాయింట్లతో పాటు ఆర్థికంగా నష్టం చేకూరనుండడంతో వీరంతా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దూరమవుతున్నారు. పేస్, బోపన్న, సానియాలకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నుంచి బుధవారం అనుమతి లభించింది. ‘ఆటగాళ్ల విజ్ఞప్తిని మన్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీల్లో వారిని ఆడేందుకు అనుమతిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనాలంటే వారు తమ పాయింట్లను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది’ అని ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ఖన్నా తెలిపారు. ఇటీవలే యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ నెగ్గిన సానియా... ఆసియా క్రీడల్లో పాల్గొనే నిర్ణయాన్ని ‘ఐటా’కు వదిలేసిన సంగతి తెలిసిదే. మరోవైపు ఈ ఆటగాళ్ల స్థానంలో ఇతరులను ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోవడంతో యువ ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, సనమ్ సింగ్, సాకేత్ మైనేని, దివిజ్ శరణ్‌లపై భారత్ పతకాల ఆశలు పెట్టుకోవాల్సి ఉంది. సానియా లేకపోవడంతో మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా ఏమేరకు రాణిస్తుందో చూడాల్సి ఉంది.
ఇది నా జీవనాధార సమస్య: లియాండర్ పేస్
భారత్ తరఫున ఆసియా గేమ్స్‌లో పాల్గొనకపోవడం బాధాకరమే అయినా తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని 41 ఏళ్ల లియాండర్ పేస్ అన్నాడు. అయితే దేశం పట్ల తన కమిట్‌మెంట్‌ను ఎవరూ ప్రశ్నించలేరని చెప్పాడు. ‘ఇది నా జీవనాధార సమస్య. ఇప్పుడు నా ప్రపంచ ర్యాంకింగ్ 35కు దిగజారింది. అందుకే వచ్చే ఏడాది ‘ఉద్యోగ భద్రత’ చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కౌలాలంపూర్, టోక్యో టోర్నమెంట్స్‌లో నేను కచ్చితంగా ఆడాలి. సరిగ్గా ఇవి ఆసియా గేమ్స్ సమయంలోనే జరుగుతున్నాయి. 24 ఏళ్లుగా దేశం కోసం నేను చాలాసార్లు ఆడాను. నా నిబద్ధతను శంకించాల్సిన పని లేదు’ అని పేస్ వివరించాడు.