Asian sports
-
అర్జున అవార్డు గ్రహీత.. ఐస్‌క్రీమ్‌లు అమ్ముతున్నాడు!
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో రజత పతక విజేత... ‘అర్జున’ అవార్డు గ్రహీత...ఈ ఘనతలేవీ కూడా ఒక అంతర్జాతీయ బాక్సర్‌కు చిరుద్యోగం, ఆర్థిక భద్రతను ఇవ్వలేకపోయాయి. ఫలితంగా అప్పులు తీర్చుకునేందుకు అతను రోడ్డుపై ఐస్ క్రీమ్‌లు అమ్ముకోవాల్సిన దీన స్థితి! 30 ఏళ్ల భారత వెటరన్ బాక్సర్ దినేశ్ కుమార్ పరిస్థితి ఇది. చాలా మందిలాగే హరియాణాలోని బాక్సింగ్ అడ్డా భివాని నుంచి వెలుగులోకి వచ్చిన దినేశ్ అంతర్జాతీయ స్థాయిలో 17 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలు సాధించాడు. 2010లో చైనాలోని గ్వాంగ్జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో దినేశ్ 81 కేజీల విభాగంలో రజత పతకం సాధించాడు. అతని ప్రదర్శనకు గాను అదే ఏడాది రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా ‘అర్జున’ పురస్కారం కూడా అందుకున్నాడు. 2014 కామన్వెల్త్ క్రీడలకు కొద్ది రోజుల ముందు జరిగిన రోడ్డు ప్రమాదం అతని కెరీర్‌ను ప్రమాదంలో పడేసింది. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం లేని దినేశ్ గత నాలుగేళ్లలో తీవ్రంగా ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ‘నన్ను బాక్సర్‌గా తీర్చిదిద్దేందుకే మా నాన్న ఎన్నో అప్పులు చేశారు. అవన్నీ తీరక ముందే నాకు ప్రమాదం జరిగింది. చికిత్స కోసం మళ్లీ అప్పులు చేయాల్సి వచ్చింది. ఒక అంతర్జాతీయ ఆటగాడిగా నాకు గత ప్రభుత్వంతో పాటు ఇప్పటి ప్రభుత్వం కూడా ఎలాంటి సహాయం చేయలేదు. చిన్నపాటి ఉద్యోగం కూడా లేదు. ఇప్పుడు నాకు రోజు గడవడంతో పాటు అప్పులు తీర్చాలంటే మరో మార్గం లేదు. అందుకే ఇలా తోపుడు బండిపై రోడ్డు మీద కుల్ఫీ (ఐస్‌క్రీమ్)లు అమ్మేందుకు సిద్ధమయ్యాను’ అని దినేశ్ కుమార్ ఆవేదనగా చెప్పాడు. 2018 ఆసియా క్రీడల విజేతలకు భారీ మొత్తంలో నగదు పురస్కారాలు ప్రకటించిన హరియాణా ప్రభుత్వం దినేశ్లాంటి గత విజేతను ఇప్పటిౖకైనా ఆదుకుంటుందేమో వేచి చూడాలి. -
ఆసియా క్రీడలకు భారత్ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల సందర్భంగా మైదానంలో, బయటా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని భారత బృందానికి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ సూచించారు. ఈనెల 18 నుంచి సెప్టెంబరు 2 వరకు ఇండోనేసియాలోని జకార్తా, పాలెంబాంగ్‌లో జరిగే ఆసియా క్రీడల్లో భారత్ నుంచి 36 క్రీడాంశాల్లో 572 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. మరోవైపు ఈ క్రీడల్లో యువ జావెలిన్ త్రోయర్, కామన్వెల్త్ క్రీడల చాంపియన్ నీరజ్ చోప్రా మార్చ్‌పాస్ట్‌లో త్రివర్ణ పతాకధారిగా వ్యవహరించనున్నాడు. 20 ఏళ్ల నీరజ్ చోప్రా గతేడాది ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో, 2016 లో అండర్–20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. -
ఈ సారి కూత ఆలస్యం...
ముంబై: ఆరో సీజన్ కబడ్డీ కూత ఆలస్యంగా మొదలవనుంది. త్వరలో ఆసియా క్రీడలు జరగనున్న నేపథ్యంలో ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) షెడ్యూల్‌ను వెనక్కి జరపాల్సి వచ్చింది. ఈ అక్టోబర్ 5 నుంచి మొదలయ్యే పీకేఎల్–6 వచ్చే జనవరి 5న జరిగే ఫైనల్‌తో ముగియనుంది. ఈ మేరకు షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు నిర్వాహక సంస్థ మషాల్ స్పోర్ట్స్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఫార్మాట్‌లాగే ఈసారీ 13 వారాల పాటు 138 మ్యాచ్‌ల్ని నిర్వహిస్తారు. లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి మాట్లాడుతూ ‘సాధారణంగా పీకేఎల్‌ను జూలై–అక్టోబర్ నెలల్లో నిర్వహిస్తాం. అయితే ఆగస్టు–సెప్టెంబర్‌లో ఆసియా క్రీడలు ఉండటంతో స్వదేశీ, విదేశీ ఆటగాళ్లంతా పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అక్టోబర్‌కు మార్చాం’ అని అన్నారు. గత సీజన్లలాగే ఆరో సీజన్ కూడా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, అద్భుతమైన కబడ్డీ అనుభవాన్ని ఇస్తుందని ఆయన చెప్పారు. మ్యాచ్‌లను ‘స్టార్ స్పోర్ట్స్’ నెట్వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. -
ఆసియా క్రీడలకు రజని
న్యూఢిల్లీ: గత తొమ్మిదేళ్లుగా భారత మహిళల హాకీ జట్టులో సభ్యురాలిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి, గోల్‌కీపర్ ఇతిమరపు రజని తొలిసారి ఆసియా క్రీడల్లో బరిలోకి దిగనుంది. ఆగస్టు, సెప్టెంబర్లలో ఇండోనేసియాలో జరిగే ఈ మెగా ఈవెంట్లో పాల్గొనే భారత మహిళల హాకీ జట్టులో రజని రెండో గోల్‌కీపర్‌గా ఎంపికైంది. ఈ నెలలో లండన్‌లో జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులోనూ ఈ చిత్తూరు జిల్లా క్రీడాకారిణికి స్థానం లభించింది. ఆసియా క్రీడల కోసం ప్రకటించిన 18 మంది సభ్యుల భారత బృందానికి రాణి రాంపాల్ నాయకత్వం వహిస్తుంది. ఈ క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధిస్తే 2020 టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో భారత్‌కు కాంస్య పతకం లభించింది. భారత మహిళల హాకీ జట్టు: సవిత, ఇతిమరపు రజని (గోల్‌కీపర్లు), దీప్ గ్రేస్ ఎక్కా, సునీత లాక్రా, దీపిక, గుర్జీత్ కౌర్, రీనా ఖోఖర్, నమిత టొప్పో, లిలిమా మింజ్, మోనిక, ఉదిత, నిక్కీ ప్రధాన్, నేహా గోయల్, రాణి రాంపాల్, వందన కటారియా, లాల్రెమ్సియామి, నవ్‌నీత్ కౌర్, నవ్‌జ్యోత్ కౌర్. -
ఇక నుం‘చైనా’ ఆట!
- దేశంలోనే తొలిసారిగా మంచిర్యాలలో ‘స్టూడెంట్ ఒలింపిక్స్’ - వచ్చే నవంబర్‌లో నిర్వహణ సాక్షి, హైదరాబాద్: ఒలింపిక్స్.. ఆసియా క్రీడలు.. ఏవైనా చైనాదే హవా. క్రికెట్ వంటి కొన్ని క్రీడల్లో మినహా అన్నింటా చైనా క్రీడాకారులే ముందుంటారు. అక్కడ కేజీ స్థాయి నుంచి ప్రతి విద్యార్థి ఏదో ఓ క్రీడలో పాల్గొనాల్సిందే. కఠోర శ్రమతోపాటు ఇలా పాఠశాల స్థాయి నుంచే వారికి క్రీడల్లో అమితాసక్తి కలిగేలా చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఆ దేశాన్ని క్రీడాపటంలో టాప్‌గా నిలుపుతున్నాయి. ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ విద్యార్థులను కూడా తీర్చిదిద్దేందుకు తొలి అడుగు పడబోతోంది. క్రీడల్లో ప్రావీణ్యం కల్పించే సంగతి పక్కనపెడితే.. అసలు క్రీడల్లో పాల్గొనేలా ఆసక్తి కలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ‘స్టూడెంట్ ఒలింపిక్స్’ అన్న పేరుతో వచ్చే నవంబర్‌లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తొలిసారిగా నిర్వహణకు మంచిర్యాల జిల్లాను ఎంపిక చేశారు. క్రీడలు, పర్యాటక యువజనాభ్యుదయ శాఖ దీనికి రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రూపొందించారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా మంచిర్యాల కలెక్టర్ కర్ణన్‌కు సూచించారు. ముంబై సంస్థ చేయూతతో.. కేవలం పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో క్రీడలు, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.. ముంబైకి చెందిన ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ సహకారంతో ప్రణాళికాబద్ధంగా పోటీలు నిర్వహించటంతోపాటు.. క్రీడాకారుల ర్యాంకుల గురించి అప్పటికప్పుడు తెలిపే ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఈవెంట్లో విద్యార్థులు సాధించిన పాయింట్ల వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయగానే వారి ర్యాంకు, రేటింగ్ కార్డు వెలువడుతుంది. ముంబై సంస్థకు జిల్లా స్థాయి క్రీడా సంఘాలు, ప్రభుత్వ సంస్థలు సహకరిస్తాయి. మంచిర్యాలనే ఎందుకంటే.. మంచిర్యాల జిల్లాలో ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ. జీహెచ్ఎంసీ తర్వాత తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రాంతంగా మంచిర్యాలకు గుర్తింపు ఉంది. దీంతో ఈ విధానానికి ప్రయోగాత్మకంగా ఆ జిల్లాను ఎంపిక చేశారు. ఈ పోటీలకు దాదాపు రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందుకోసం ప్రతి ప్రైవేటు పాఠశాల విద్యార్థి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.వంద (తాత్కాలిక అంచనా) వరకు వసూలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తరఫున ఆ మొత్తాన్ని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఇతర క్రీడా సంస్థలు చెల్లిస్తాయి. మరోవైపు వచ్చే ఏడాది ఇతర జిల్లాల్లో పోటీలు నిర్వహించనున్నారు. శారీరక వైకల్యం ఉన్న వారికి పారా ఒలింపిక్స్ తరహాలో విడిగా పోటీలు నిర్వహిస్తారు. దేశంలోనే తొలిసారిగా.. ఇప్పటి వరకు మన దేశంలో నిర్బంధ క్రీడల నిర్వహణ విధానం లేదు. దేశంలోనే తొలిసారి ఈ ప్రయోగానికి తెలంగాణ శ్రీకారం చుడుతోంది. మంచిర్యాల జిల్లాలో ప్రతి విద్యార్థి తొలుత పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొనాలి. విజయం సాధించిన వారితో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అందులో టాప్‌లో ఉన్న వారి మధ్య డివిజన్ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. వారికి బంగారు, వెండి, కంచు పతకాలు, ప్రశంసా పత్రాలు, ర్యాంక్ కార్డులు అందజేస్తారు. ప్రతీ విద్యార్థి పాల్గొనేలా.. కేజీ నుంచి కళాశాల స్థాయి వరకు.. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థ అన్న తేడా లేకుండా ప్రతీ విద్యార్థి కనీసం ఒక క్రీడలో విధిగా పాల్గొనేలా చేసి వారిలో క్రీడలంటే భయం పోగొట్టాలన్నది ప్రధాన ఆలోచన. ఆ పోటీల్లో వారు పొందిన రేటింగ్స్‌ను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులతో పోలుస్తూ సర్టిఫికెట్లు అందిస్తారు. ఇలా విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంతోపాటు భవిష్యత్తులో మంచి శిక్షణతో క్రీడాకారులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. చైనాతోపాటు కొన్ని యూరప్ దేశాలు ఇదే పంథాను అనుసరిస్తూ క్రీడల్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. ఆ పరిస్థితి మారాలి నాకు క్రీడలంటే ఇష్టం. కానీ విద్యార్థి దశలో పోటీలు నిర్వహించక, వాటిలో ప్రోత్సాహం లేక నాలాంటి చాలామంది క్రీడలకు దూరంగా ఉండిపోయారు. ఆ పరిస్థితి మారాల్సి ఉంది. దీనికి ‘స్టూడెంట్ ఒలింపిక్స్’ ఆలోచన దోహదం చేస్తుంది. విద్యార్థులకు ఏ క్రీడలో నైపుణ్యం ఉందో తెలుసుకుని వారిని ఆ క్రీడల్లో ఉత్తములుగా తయారు చేయొచ్చు. క్రీడాకారులు కాకున్నా మంచి ఆరోగ్యాన్ని సాధించటం ద్వారా చదువు, ఇతర వ్యాపకాల్లో రాటుదేలే వీలుంది. మానసిక, శారీరక స్థైర్యం పెరుగుతుంది’ – క్రీడలు, పర్యాటక యువజనాభ్యుదయ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం -
ఆసియా క్రీడలకు జ్వాల దూరం
న్యూఢిల్లీ: డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల ఆసియా క్రీడల నుంచి వైదొలిగింది. కుడి మోకాలిలో నొప్పి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. జ్వాలకు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. ‘ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుంటే కాస్త నొప్పి అనిపించింది. అయితే ఏం కాదని నా కోచ్ చెప్పారు. కానీ మంగళవారం మోకాలి దగ్గర వాపు వచ్చింది. వెంటనే ఇద్దరు డాక్టర్లను కలిశా. 10, 12 రోజుల విశ్రాంతి అవసరమని చెప్పారు. నాకు మరో మార్గం లేక గేమ్స్ నుంచి తప్పుకున్నా. గాయం కారణంగా నా కెరీర్లో ఎప్పుడూ టోర్నీలకు దూరంగా ఉండలేదు’ అని జ్వాల పేర్కొంది. వాపు తగ్గు ముఖం పట్టినా మోకాలి మీద బరువు వేయలేకపోతున్నానని చెప్పింది. వచ్చే ఏడాది తనకు చాలా ముఖ్యమని చెప్పిన ఈ హైదరాబాదీ యూరోపియన్ సర్క్యూట్లో బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే జ్వాల స్థానంలో మరొకర్ని తీసుకోవాల్సిన అవసరం లేదని చీఫ్ కోచ్ చెప్పినట్లు ‘బాయ్’ అధికారి తెలిపారు. అవసరమైనప్పుడు డబుల్స్‌లో అశ్వినికి తోడుగా ప్రద్న్యా, పీవీ సింధులలో ఒకర్ని ఆడిస్తారన్నారు. -
సానియా కూడా అదే దారిలో...
బెంగళూరు: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడలకు దూరమవుతున్న టెన్నిస్ ఆటగాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్, లియాండర్ పేస్, రోహన్ బోపన్న ఈ క్రీడల్లో ఆడలేమని ప్రకటించగా... తాజాగా మహిళల డబుల్స్ స్టార్ సానియా మీర్జా కూడా ఈ జాబితాలో చేరింది. ఇంచియాన్‌లో ఆసియా క్రీడలు జరిగే సమయంలోనే ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నమెంట్లు కూడా జరుగుతుండడమే ఈ ఆటగాళ్ల నిర్ణయానికి కారణం. అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకపోతే విలువైన పాయింట్లతో పాటు ఆర్థికంగా నష్టం చేకూరనుండడంతో వీరంతా ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు దూరమవుతున్నారు. పేస్, బోపన్న, సానియాలకు అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నుంచి బుధవారం అనుమతి లభించింది. ‘ఆటగాళ్ల విజ్ఞప్తిని మన్నించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటీపీ, డబ్ల్యూటీఏ టోర్నీల్లో వారిని ఆడేందుకు అనుమతిస్తున్నాం. ఈ ఏడాది చివర్లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనాలంటే వారు తమ పాయింట్లను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఏర్పడింది’ అని ‘ఐటా’ అధ్యక్షుడు అనిల్ ఖన్నా తెలిపారు. ఇటీవలే యూఎస్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ నెగ్గిన సానియా... ఆసియా క్రీడల్లో పాల్గొనే నిర్ణయాన్ని ‘ఐటా’కు వదిలేసిన సంగతి తెలిసిదే. మరోవైపు ఈ ఆటగాళ్ల స్థానంలో ఇతరులను ఎంపిక చేసే అవకాశం కూడా లేకపోవడంతో యువ ఆటగాళ్లు యూకీ బాంబ్రీ, సనమ్ సింగ్, సాకేత్ మైనేని, దివిజ్ శరణ్‌లపై భారత్ పతకాల ఆశలు పెట్టుకోవాల్సి ఉంది. సానియా లేకపోవడంతో మహిళల సింగిల్స్‌లో అంకితా రైనా ఏమేరకు రాణిస్తుందో చూడాల్సి ఉంది. ఇది నా జీవనాధార సమస్య: లియాండర్ పేస్ భారత్ తరఫున ఆసియా గేమ్స్‌లో పాల్గొనకపోవడం బాధాకరమే అయినా తప్పనిసరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని 41 ఏళ్ల లియాండర్ పేస్ అన్నాడు. అయితే దేశం పట్ల తన కమిట్మెంట్ను ఎవరూ ప్రశ్నించలేరని చెప్పాడు. ‘ఇది నా జీవనాధార సమస్య. ఇప్పుడు నా ప్రపంచ ర్యాంకింగ్ 35కు దిగజారింది. అందుకే వచ్చే ఏడాది ‘ఉద్యోగ భద్రత’ చూసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కౌలాలంపూర్, టోక్యో టోర్నమెంట్స్‌లో నేను కచ్చితంగా ఆడాలి. సరిగ్గా ఇవి ఆసియా గేమ్స్ సమయంలోనే జరుగుతున్నాయి. 24 ఏళ్లుగా దేశం కోసం నేను చాలాసార్లు ఆడాను. నా నిబద్ధతను శంకించాల్సిన పని లేదు’ అని పేస్ వివరించాడు.