ఆసియా క్రీడలకు జ్వాల దూరం
న్యూఢిల్లీ: డబుల్స్ స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల ఆసియా క్రీడల నుంచి వైదొలిగింది. కుడి మోకాలిలో నొప్పి కారణంగా ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. జ్వాలకు రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు. ‘ఆసియా క్రీడల కోసం ప్రాక్టీస్ చేస్తుంటే కాస్త నొప్పి అనిపించింది. అయితే ఏం కాదని నా కోచ్ చెప్పారు. కానీ మంగళవారం మోకాలి దగ్గర వాపు వచ్చింది. వెంటనే ఇద్దరు డాక్టర్లను కలిశా. 10, 12 రోజుల విశ్రాంతి అవసరమని చెప్పారు. నాకు మరో మార్గం లేక గేమ్స్ నుంచి తప్పుకున్నా. గాయం కారణంగా నా కెరీర్‌లో ఎప్పుడూ టోర్నీలకు దూరంగా ఉండలేదు’ అని జ్వాల పేర్కొంది. వాపు తగ్గు ముఖం పట్టినా మోకాలి మీద బరువు వేయలేకపోతున్నానని చెప్పింది. వచ్చే ఏడాది తనకు చాలా ముఖ్యమని చెప్పిన ఈ హైదరాబాదీ యూరోపియన్ సర్క్యూట్‌లో బరిలోకి దిగుతానని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే జ్వాల స్థానంలో మరొకర్ని తీసుకోవాల్సిన అవసరం లేదని చీఫ్ కోచ్ చెప్పినట్లు ‘బాయ్’ అధికారి తెలిపారు. అవసరమైనప్పుడు డబుల్స్‌లో అశ్వినికి తోడుగా ప్రద్న్యా, పీవీ సింధులలో ఒకర్ని ఆడిస్తారన్నారు.