ఇక నుం‘చైనా’ ఆట! | 'Student Olympics' In the country for the first time in mancherial | Sakshi
Sakshi News home page

ఇక నుం‘చైనా’ ఆట!

Published Sun, Sep 10 2017 1:43 AM | Last Updated on Sun, Sep 17 2017 6:39 PM

ఇక నుం‘చైనా’ ఆట!

ఇక నుం‘చైనా’ ఆట!


- దేశంలోనే తొలిసారిగా మంచిర్యాలలో ‘స్టూడెంట్‌ ఒలింపిక్స్‌’  
- వచ్చే నవంబర్‌లో నిర్వహణ
 
సాక్షి, హైదరాబాద్‌: ఒలింపిక్స్‌.. ఆసియా క్రీడలు.. ఏవైనా చైనాదే హవా. క్రికెట్‌ వంటి కొన్ని క్రీడల్లో మినహా అన్నింటా చైనా క్రీడాకారులే ముందుంటారు. అక్కడ కేజీ స్థాయి నుంచి ప్రతి విద్యార్థి ఏదో ఓ క్రీడలో పాల్గొనాల్సిందే. కఠోర శ్రమతోపాటు ఇలా పాఠశాల స్థాయి నుంచే వారికి క్రీడల్లో అమితాసక్తి కలిగేలా చైనా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలే ఆ దేశాన్ని క్రీడాపటంలో టాప్‌గా నిలుపుతున్నాయి.
 
ఇప్పుడు ఇదే తరహాలో తెలంగాణ విద్యార్థులను కూడా తీర్చిదిద్దేందుకు తొలి అడుగు పడబోతోంది. క్రీడల్లో ప్రావీణ్యం కల్పించే సంగతి పక్కనపెడితే.. అసలు క్రీడల్లో పాల్గొనేలా ఆసక్తి కలిగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు ‘స్టూడెంట్‌ ఒలింపిక్స్‌’ అన్న పేరుతో వచ్చే నవంబర్‌లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. తొలిసారిగా నిర్వహణకు మంచిర్యాల జిల్లాను ఎంపిక చేశారు. క్రీడలు, పర్యాటక యువజనాభ్యుదయ శాఖ దీనికి రంగం సిద్ధం చేస్తోంది. తాజాగా కార్యక్రమ నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను ఆ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రూపొందించారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా మంచిర్యాల కలెక్టర్‌ కర్ణన్‌కు సూచించారు.
 
ముంబై సంస్థ చేయూతతో..
కేవలం పాఠశాల స్థాయిలో పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రయోజనం ఉండదు. ఈ నేపథ్యంలో క్రీడలు, పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం.. ముంబైకి చెందిన ‘స్పోర్ట్స్‌ ఫర్‌ ఆల్‌’ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ సహకారంతో ప్రణాళికాబద్ధంగా పోటీలు నిర్వహించటంతోపాటు.. క్రీడాకారుల ర్యాంకుల గురించి అప్పటికప్పుడు తెలిపే ఓ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేశారు. ఈవెంట్‌లో విద్యార్థులు సాధించిన పాయింట్ల వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేయగానే వారి ర్యాంకు, రేటింగ్‌ కార్డు వెలువడుతుంది. ముంబై సంస్థకు జిల్లా స్థాయి క్రీడా సంఘాలు, ప్రభుత్వ సంస్థలు సహకరిస్తాయి.
 
మంచిర్యాలనే ఎందుకంటే..
మంచిర్యాల జిల్లాలో ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువ. జీహెచ్‌ఎంసీ తర్వాత తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న ప్రాంతంగా మంచిర్యాలకు గుర్తింపు ఉంది. దీంతో ఈ విధానానికి ప్రయోగాత్మకంగా ఆ జిల్లాను ఎంపిక చేశారు. ఈ పోటీలకు దాదాపు రూ.కోటిన్నర వరకు ఖర్చవుతుందని అంచనా. ఇందుకోసం ప్రతి ప్రైవేటు పాఠశాల విద్యార్థి నుంచి ఎంట్రీ ఫీజుగా రూ.వంద (తాత్కాలిక అంచనా) వరకు వసూలు చేస్తారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తరఫున ఆ మొత్తాన్ని స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్, ఇతర క్రీడా సంస్థలు చెల్లిస్తాయి. మరోవైపు వచ్చే ఏడాది ఇతర జిల్లాల్లో పోటీలు నిర్వహించనున్నారు. శారీరక వైకల్యం ఉన్న వారికి పారా ఒలింపిక్స్‌ తరహాలో విడిగా పోటీలు నిర్వహిస్తారు.
 
దేశంలోనే తొలిసారిగా..
ఇప్పటి వరకు మన దేశంలో నిర్బంధ క్రీడల నిర్వహణ విధానం లేదు. దేశంలోనే తొలిసారి ఈ ప్రయోగానికి తెలంగాణ శ్రీకారం చుడుతోంది. మంచిర్యాల జిల్లాలో ప్రతి విద్యార్థి తొలుత పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొనాలి. విజయం సాధించిన వారితో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అందులో టాప్‌లో ఉన్న వారి మధ్య డివిజన్‌ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. వారికి బంగారు, వెండి, కంచు పతకాలు, ప్రశంసా పత్రాలు, ర్యాంక్‌ కార్డులు అందజేస్తారు.
 
ప్రతీ విద్యార్థి పాల్గొనేలా..
కేజీ నుంచి కళాశాల స్థాయి వరకు.. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థ అన్న తేడా లేకుండా ప్రతీ విద్యార్థి కనీసం ఒక క్రీడలో విధిగా పాల్గొనేలా చేసి వారిలో క్రీడలంటే భయం పోగొట్టాలన్నది ప్రధాన ఆలోచన. ఆ పోటీల్లో వారు పొందిన రేటింగ్స్‌ను రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులతో పోలుస్తూ సర్టిఫికెట్లు అందిస్తారు. ఇలా విద్యార్థుల ప్రతిభను వెలుగులోకి తీసుకురావడంతోపాటు భవిష్యత్తులో మంచి శిక్షణతో క్రీడాకారులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. చైనాతోపాటు కొన్ని యూరప్‌ దేశాలు ఇదే పంథాను అనుసరిస్తూ క్రీడల్లో ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. 
 
ఆ పరిస్థితి మారాలి
నాకు క్రీడలంటే ఇష్టం. కానీ విద్యార్థి దశలో పోటీలు నిర్వహించక, వాటిలో ప్రోత్సాహం లేక నాలాంటి చాలామంది క్రీడలకు దూరంగా ఉండిపోయారు. ఆ పరిస్థితి మారాల్సి ఉంది. దీనికి ‘స్టూడెంట్‌ ఒలింపిక్స్‌’ ఆలోచన దోహదం చేస్తుంది. విద్యార్థులకు ఏ క్రీడలో నైపుణ్యం ఉందో తెలుసుకుని వారిని ఆ క్రీడల్లో ఉత్తములుగా తయారు చేయొచ్చు. క్రీడాకారులు కాకున్నా మంచి ఆరోగ్యాన్ని సాధించటం ద్వారా చదువు, ఇతర వ్యాపకాల్లో రాటుదేలే వీలుంది. మానసిక, శారీరక స్థైర్యం పెరుగుతుంది’
– క్రీడలు, పర్యాటక యువజనాభ్యుదయ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement