ప్రపంచంపై పిడుగు | COVID Virus Affecting Global Business | Sakshi
Sakshi News home page

ప్రపంచంపై పిడుగు

Published Sun, Mar 1 2020 3:24 AM | Last Updated on Sun, Mar 1 2020 8:38 AM

COVID Virus Affecting Global Business - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దాదాపు 2 నెలల క్రితం చైనా నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న వేళ... నగరవాసులు స్వస్థలాలకు పయనమవుతున్న సమయాన... దక్షిణ చైనాలోని వూహాన్‌ నగరంలో ఓ మహమ్మారి ఊపిరిపోసుకుంది! ఒక్కొక్కరినీ కబళించడం మొదలుపెట్టింది!! ఏం జరిగిందో అర్థం చేసుకొనేలోగా.. ఎలా అడ్డుకోవాలో ఆలోచించేలోగా మరింతగా కోరలు చాస్తూ ఖండాలు దాటేసింది. ప్రపంచంపై పిడుగులా పడిన ఆ ప్రాణాంతక వైరసే కోవిడ్‌–19

పెరుగుతున్న బాధితుల సంఖ్య
వైద్యరంగంలో ఎన్నో అద్భుతాలు సాధించామనుకున్న దేశాలు సైతం కోవిడ్‌–19 వైరస్‌ సవాలుకు బెంబేలెత్తిపోతున్నాయి. రోజురోజుకూ కోవిడ్‌ బాధిత దేశాల సంఖ్య పెరిగిపోతుండటం ఓ భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇప్పటికే దాదాపు లక్ష మందిని చుట్టేసిన కోవిడ్‌ వైరస్‌.. 3 వేల మందిని బలితీసుకుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. శనివారం నాటికి కోవిడ్‌–19 కోరల్లో చిక్కుకున్న దేశాల సంఖ్య 61కి చేరింది. (అమెరికాలో తొలి కోవిడ్-19 మృతి)

దీంతో చాలా దేశాలు ఇతర దేశాలకు రాకపోకలను నిషేధిస్తూ కోవిడ్‌–19ను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఒకవైపు చైనాలో కోవిడ్‌ తీవ్రత తగ్గుతూ కనిపిస్తూంటే మరోవైపు పొరుగునే ఉన్న దక్షిణ కొరియా... మధ్యప్రాచ్య దేశమైన ఇరాన్‌లో వైరస్‌ విజృంభిస్తోంది. నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌ను సైతం కరోనా వైరస్‌ ప్రశ్నార్థకం చేయగా... ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో క్రీడా, వినోద కార్యక్రమాలు రద్దయిపోతున్నాయి. మరోవైపు ఇప్పటివరకూ కొన్ని దేశాలకే పరిమితమైన కరోనా వైరస్‌ కాస్తా... ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించే అవకాశాలు లేకపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ శనివారం జారీ చేసిన హెచ్చరిక.. ప్రమాద ఘంటికల తీవ్రతను మరింత పెంచేసింది! (.కొరియాలో కోవిడ్ తీవ్రం)

కొత్త పోకడలు పోతోంది...
రెండు నెలలుగా విజృంభిస్తున్న కోవిడ్‌–19 వైరస్‌ గత రెండు రోజుల్లో కొత్త పోకడలు పోతోంది. దక్షిణ కొరియాలో శనివారం ఓ 73 ఏళ్ల మహిళ వారం రోజుల్లో రెండోసారి వ్యాధిబారిన పడింది. ఆసుపత్రిలో చికిత్స తీసుకుని పూర్తి స్వస్థత చేకూరి డిశ్చార్జ్‌ అయిన తరువాత వారం రోజుల్లోనే మరోసారి వ్యాధి బారిన పడటంతో వైద్యాధికారుల్లో ఆందోళన మొదలైంది. రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోవడంతో ఇలా జరిగిందని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నప్పటికీ ఇదే పరిస్థితి ఇతర దేశాల్లోనూ కనిపించే అవకాశం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. చైనాలో కూడా పది మందికి రెండోసారి ఇన్ఫెక్షన్‌కు గురైనట్లు వార్తలు వస్తూండటం ఇక్కడ ప్రస్తావనార్హం. (గూగుల్కు పాకిన కరోనా వైరస్)

మధ్యప్రాచ్య దేశం ఇరాన్‌లోనూ కోవిడ్‌–19 పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. శనివారం ఈ దేశంలో 593 మంది వ్యాధి బారిన పడినట్లు గణాంకాలు చెబుతుండగా ఈ జాబితాలో వేల మందికి పరీక్షలు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆ దేశ ప్రభుత్వమే హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా ఇరాన్‌లో 43 మంది మరణించారు. అయితే ఈ సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేరు చెప్పేందుకు ఇష్టపడని వైద్యాధికారి బీబీసీతో మాట్లాడుతూ చెప్పడం గమనార్హం. ఇరాన్‌లో వ్యాధి సోకిన వారికి, మరణించిన వారికి ఉన్న నిష్పత్తి చైనా కంటే ఏడు రెట్లు అధికంగా ఏడు శాతంగా ఉండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా, కొరియా, ఇటలీల తరువాత అత్యధిక సంఖ్యలో కోవిడ్‌–19 బాధితులు ఉన్న దేశం ఇరాన్‌ కాగా... సింగపూర్, హాంకాంగ్‌లను మినహాయిస్తే మిగిలిన దేశాల్లోని వ్యాధిగ్రస్తుల సంఖ్య వందకు లోపే ఉంది. సుమారు 19 దేశాల్లో ఒక్క రోగి మాత్రమే ఉండగా పాకిస్తాన్, భారత్‌లలో ఇద్దరు, ముగ్గురు మాత్రమే ఈ వైరస్‌ బారిన పడ్డారు. (కోవిడ్ క్రాష్ : అంబానీకి నష్టం ఎంతంటే?)

వాణిజ్యం కుదేలు...
ప్రాణాంతక మహమ్మారి కోవిడ్‌–19 వివిధ దేశాలకు విస్తరిస్తున్నకొద్దీ దాని ప్రభావం వ్యాపారంపై ఎక్కువగా పడుతోంది. వారం రోజుల వ్యవధిలో అమెరికా మార్కెట్లలో 3.18 లక్షల కోట్ల డాలర్ల సంపద ఆవిరైపోగా భారత్‌లో ఒక్క శుక్రవారం రోజే 5.45 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద మాయమైపోయింది. శనివారం నాటికి కోవిడ్‌ వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టం 350 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుందని అంచనా. ఐటీ దిగ్గజ కంపెనీలు ఆపిల్, మైక్రోసాఫ్ట్‌లతోపాటు నైకీ, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్, మాస్టర్‌కార్డ్‌ వంటి కంపెనీలు కరోనా వైరస్‌ ప్రభావం తమ ఆదాయంపై ఉండబోతోంది అంటూ హెచ్చరికలు జారీ చేశాయి కూడా. పలు దేశాలు ప్రయాణాలపై నిషేధాలు విధించిన ఫలితంగా వ్యాపారానికి తీవ్ర నష్టం జరుగుతోందని అంచనా. సరుకుల రవాణా కూడా స్తంభించిపోవడం తయారీ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది.

భారత్‌ విషయాన్నే తీసుకుంటే ఎరువులు, మందుల తయారీకి మనం ఎక్కువగా ఆధారపడే చైనా రసాయనాల సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. అయితే కొన్ని రోజులుగా పరిస్థితిలో కొంత మార్పు వచ్చిందని, ఒకటీ అర నౌకలు చైనా నుంచి సరుకులు రవాణా చేయడం మొదలుపెట్టాయని హైదరాబాద్‌లోని బల్క్‌ డ్రగ్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ అసోసియేషన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇతర దేశాల విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ముందు ముందు పరిస్థితి మరింత దిగజారే అవకాశముందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. మార్చి నెల మధ్యలో కోవిడ్‌–19 పూర్తి ప్రభావం ప్రపంచ దేశాల సప్లై చెయిన్‌ మేనేజ్‌మెంట్‌పై ఉంటుందని వేల కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకోవడం లేదా నిలిపివేయడం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు. విడిభాగాల కోసం చైనాపై ఆధారపడే కంపెనీల పరిస్థితి మరింత కష్టంగా ఉంటుందని చెబుతున్నారు. 2002–2003లో సార్స్‌ వ్యాధి ప్రబలిన సందర్భంలో అంతర్జాతీయ మార్కెట్లు కొద్దిమేరకు పతనమయ్యాయని, ఆ తరువాతి కాలంలో చైనా ప్రాముఖ్యత పెరిగిపోవడం.. అతిపెద్ద ఆరోగ్య సమస్యకు ఆ దేశమే కేంద్రంగా మారిన నేపథ్యంలో ఈ సారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యాంశాలు..
– మధ్యప్రాచ్య దేశాల శరణార్థులు యూరప్‌లోకి ప్రవేశించేందుకు మార్గమైన గ్రీస్‌లో కోవిడ్‌–19 ప్రభావం తీవ్రమయ్యే అవకాశముందని జర్మనీ హెచ్చరించింది. సరిహద్దుల వద్ద నియంత్రణను కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించింది.
– ఇరాన్‌లోని అన్ని పాఠశాలలను 3 రోజులపాటు మూసివేస్తు అక్కడి ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం మసీదుల్లో సామూహిక ప్రార్థనలను కూడా రద్దు చేసింది.
– ప్రజలంతా వీలైనంత వరకూ ఇళ్లలోనే ఉండాలని, వైరస్‌పై పోరు కీలక దశకు చేరుకున్న తరుణంలో ఇది అత్యవసరమని దక్షిణ కొరియా శనివారం అభ్యర్థించింది.
– ఇటలీకి వెళ్లదలచుకున్న అమెరికన్‌ పౌరులు తమ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్చరికలు జారీ చేసింది. 
– వైరస్‌ తీవ్రత నేపథ్యంలో ఉద్యోగాలకు హాజరుకాని ఉద్యోగులకు ఆర్థిక సాయం అందించేందుకు నిధిని ఏర్పాటు చేయాలని జపాన్‌ నిర్ణయించింది.
– ఇరాన్‌ దేశస్తులు తమ దేశంలోకి రావడంపై రష్యా శుక్రవారం తాత్కాలిక నిషేదం విధించింది. ఆదివారం నుంచి దక్షిణ కొరియా వారికీ నో ఎంట్రీ చెప్పనుంది. 
– దక్షిణ కొరియన్లకు ఇస్తున్న వీసా ఫ్రీ ఎంట్రీని వియత్నాం శనివారం నుంచి రద్దు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement