సింధు సాధించేనా!
రియో డీ జనీరో: రియో ఒలింపిక్సలో మన తెలుగుతేజం, బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పివి సింధు పతకం సాధించడానికి అడుగుదూరంలో నిలిచింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత యిహాన్ వాంగ్‌పై అద్భుత విజయం సాధించి సెమీస్ కు దూసుకెళ్లింది. ఎలాంటి అంచనాలు లేకుండా రియోకు వెళ్లిన సింధు... సంచలన ఆటతీరుతో క్వార్టర్స్‌లో చైనా వాల్ను అధిగమించి పతకంపై ఆశలు రేపింది. ఇక ఒక విజయం సాధిస్తే సింధూకు రజత పతకం దక్కుతుంది. ఒక వేళ ఓడితే మాత్రం కాంస్య పతకం కోసం మరో మ్యాచ్ వరకూ నిరీక్షించక తప్పుదు.
ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్ పోరులో ప్రపంచ రెండో ర్యాంకర్, లండన్ ఒలింపిక్స్ రజత పతక విజేత యిహాన్ వాంగ్‌పై సింధు సంచలన విజయం సాధించింది. ఈ ఒలింపిక్స్ లో తొమ్మిదో సీడింగ్ గా బరిలోకి దిగిన సైనా 22-20, 21-19 తేడాతో వాంగ్ను మట్టికరిపించింది. 2015లో డెన్మార్క్ ఓపెన్లో వాంగ్ను ఓడించిన సింధు అదే తరహా ఆట తీరుతో ఒలింపిక్స్లోనూ చెలరేగింది. దీంతో వాంగ్ పై వరుసగా రెండో విజయం సాధించింది.
ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మ్యాచ్ చివరి వరకూ అత్యంత నిలకడను ప్రదర్శించింది. ఓ దశలో తొలి గేమ్లో వెనుకబడిన సింధు... అంచనాలకు అందుకుంటూ నెమ్మదిగా ముందంజ వేసింది. ఆ తరువాత రెండో గేమ్లో కూడా సింధు తన సహజ సిద్ధమైన ఆట తీరునే ప్రదర్శించింది. విజయమే తుది లక్ష్యంగా చెలరేగిన సింధుపై ఇప్పుడు యావత్ భారతవాని కోటి ఆశలు పెట్టుకుంది. గురువారం రాత్రి గం.7.30 ని.లకు సింధు .. జపాన్ క్రీడాకారిణి ఒకుహారాతో అమీతుమీ తేల్చుకోనుంది.
స్మాష్లే సింధు ఆయుధం
ఇటీవల కాలంలో స్మాష్లను కొట్టడంలో సింధు ఆరి తేరిందనే చెప్పాలి. సింధు కచ్చితమైన స్మాష్లతోనే ఒలింపిక్స్ లో కీలక విజయాల్ని సొంతం చేసుకుంది. ప్రత్యర్థి ఎటువంటి తప్పిదం చేసినా అందుకు బదులు చెప్పేందుకు స్మాష్లనే ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తోంది. మరోవైపు సింధు మంచి ఎత్తు ఉండటం కూడా ఆమెకు బాగా కలిసొస్తుంది. ఈ రోజు జరిగే సెమీస్ పోరులో సింధు.. ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి, జపాన్ స్టార్ ఒకుహురాతో తలపడనుంది. తన కంటే ఎంతో మెరుగైన ఇద్దరు క్రీడాకారిణులను ఇప్పటికే ఓడించిన సింధు.. తాజా పోరును కూడా అలానే కొనసాగించాలని ఆశిస్తుంది. ప్రిక్వార్టర్, క్వార్టర్ల్లో వరుస సెట్లలో మ్యాచ్లను కైవసం చేసుకున్న సింధు అదే ఆట తీరును ప్రదర్శించాలని భారత అభిమానుల ఆకాంక్ష కూడా.
20 ఏళ్ల తరువాత..
ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో కేవలం ఒక చైనా క్రీడాకారిణి మాత్రమే సెమీస్ అర్హత సాధించడం సుమారు 20 ఏళ్ల తరువాత ఇదే ప్రథమం. ఒక సెమీస్ లో భారత క్రీడాకారిణి సింధు, జపాన్ క్రీడాకారిణి ఓకుహరాలు పోరుకు సిద్ధమవ్వగా, మరో సెమీస్లో కరోలిన్ మారిన్(స్పెయిన్)తో లీ ఘురీ(చైనా) తలపడనుంది. దీంతో రెండు పతకాలకు చైనా క్రీడాకారిణులు దూరం కాక తప్పలేదు. 2000, 04 సంవత్సరాల్లో స్వర్ణం, కాంస్య పతకాల్ని సాధించిన చైనా క్రీడాకారిణులు.. 2008, 12ల్లో స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు. దీంతో 1996 తరువాత తొలిసారి చైనా హవాకు మళ్లీ ఫుల్ స్టాప్ పడిందనే చెప్పాలి.