హోటల్ గదిలోనే యులియా ప్రాక్టీస్
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడేందుకు వచ్చి క్వారంటైన్‌లో చిక్కుకుపోయిన విదేశీ టెన్నిస్ ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గదుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఒకరు పేర్కొనగా, తమకు అందిస్తున్న భోజనం సరిగా లేదని మరో ప్లేయర్ వాపోయాడు. శనివారం మెల్‌బోర్న్‌కు ప్లేయర్లను తీసుకొచ్చిన విమానాల్లో నలుగురికి కరోనా పాజిటివ్ ఫలితం రావడంతో అందులో ప్రయాణించిన 47 మంది ఆటగాళ్లను కఠిన క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో ఒకరైన కజకిస్తాన్ మహిళా ప్లేయర్ యులియా పుతిన్‌సెవా తన గదిలో ఎలుక తిరుగుతోన్న వీడియోను ట్విట్టర్‌లో పంచుకుంది. ప్రాక్టీస్‌కు అనుమతించకపోవడంతో ఆమె తన గదిలోని బీరువాను ప్రాక్టీస్ వాల్‌గా మార్చుకుంది.
బీరువాకు బంతి కొడుతూ షాట్‌లు ప్రాక్టీస్ చేసింది. విమానంలో ప్రయాణించిన వారిలో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారంతా క్వారంటైన్‌లో ఉండాలని తనకు ముందే చెబితే అసలు ఈ ప్రయాణం గురించి పునరాలోచించుకునేదాన్నని ఆమె వ్యాఖ్యానించింది. ప్రపంచ 15వ ర్యాంక్ ప్లేయర్ పాబ్లో కరెనో బుస్టా... క్వారంటైన్‌లో తనకు అందించిన నాణ్యతలేని భోజనంపై అసంతృప్తి వెలిబుచ్చగా, ఫ్రెంచ్ ప్లేయర్ బెనోయిట్ పెయిర్ హోటల్ భోజనాన్ని తిరస్కరించి బయట నుంచి తెప్పించుకున్నట్లు చెప్పాడు. మరోవైపు ఆస్ట్రేలియన్ ఓపెన్ చీఫ్ క్రెగ్ టిలీ అనుకున్న షెడ్యూల్ ప్రకారమే ఫిబ్రవరి 8 నుంచి పోటీలు జరుగుతాయని ఆదివారం స్పష్టం చేశారు. కష్టమైనప్పటికీ ఆటగాళ్లు తప్పనిసరిగా క్వారంటైన్‌లో ఉండాల్సిందేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment