టెన్నిస్ ద్రోణుడు | Tennis Coach | Sakshi
Sakshi News home page

టెన్నిస్ ద్రోణుడు

Published Tue, Nov 25 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

టెన్నిస్ ద్రోణుడు

టెన్నిస్ ద్రోణుడు

అర్జునుడు విలువిద్యలో నేర్పరి అని కొనియాడే సమయంలో ద్రోణాచార్యుడిని కూడా తలుచుకోవాలని మహాభారతం గుర్తు చేస్తుంది.
 ఆ స్ఫూర్తితోనే భారతదేశ వర్ధమాన టెన్నిస్ క్రీడాకారులు సాకేత్ మైనేని, విష్ణువర్ధన్,  సురేశ్ కృష్ణ, పి.సి. విఘ్నేశ్, వై. సందీప్‌రెడ్డి, సౌజన్య భవిశెట్టి... వంటి వారి గురించి చెప్పుకునే ప్రతిసారీ.. వారిని మేటి క్రీడాకారులుగా తీర్చి దిద్దిన కోచ్ సి. వి. నాగరాజును కూడా గుర్తు చేసుకోవాలి.
 
సికింద్రాబాద్‌లోని ఆర్ ఆర్ సి (రైల్వే రిక్రియేషన్ క్లబ్) గ్రౌండ్స్‌లో ఐదేళ్ల నుంచి 22 ఏళ్ల వయసున్న సుమారు యాభై మంది పిల్లలు టెన్నిస్ సాధన చేస్తున్నారు. కొందరు పిల్లల తల్లులు ఓ పక్కగా కూర్చుని ఓ కంట టెన్నిస్ సాధనను గమనిస్తూ కబుర్లలో ఉన్నారు. ప్రాక్టీస్ చేస్తున్న పిల్లల్లో ప్రతి ఒక్కరి ఆటతీరును గమనిస్తూ ఉన్నారు 53 ఏళ్ల కంజీవరం వెంకట్రావు నాగరాజు. షాట్‌లో పొరపాటు జరిగితే వెంటనే పిల్లలను పేరుతో పిలిచి షాట్ అలా కాదంటూ వెళ్లి సరిచేస్తున్నారు. ఇంతలో ఓ కుర్రాడు మడమకు దెబ్బ తగిలించుకున్నాడు. వెంటనే క్రేప్ బ్యాండేజ్‌తో కట్టుకట్టి ‘ఈ రోజుకి ఇక ఆడకు. ఇంటికి వెళ్లి మమ్మీడాడీతో ఫోన్ చేయించు, ఏం చేయాలో చెప్తాను’ అని ఓ పక్కన కూర్చోబెట్టారు. రాకెట్ పట్టుకోవడం మొదలు ఆటలో మెలకువలు నేర్పించడం, గాయమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పడం, క్రీడాకారులు తీసుకోవాల్సిన రోజువారీ ఆహార పట్టిక తయారు చేసివ్వడం వరకు కోచ్‌దే బాధ్యత. అలా ఈ కోచ్ చేతిలో తయారైన టెన్నిస్ క్రీడాకారులు ఇవాళ జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. ‘‘సాకేత్ మైనేని, విష్ణువర్ధన్, సౌజన్య భవిశెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఆడుతున్నారు. నా విద్యార్థులు డేవిస్ కప్ సాధించారు, ఏషియన్ గేమ్స్‌లో పతకాలు గెలుచుకున్నారు. శిక్షకుడిగా నా సంతోషం నేను తయారు చేసిన వారి విజయాల్లోనే ఉంటుంది’’ అంటారు నాగరాజు.
 
తెలుగు నేలపై నాలుగోతరం..!

తల్లిదండ్రులిద్దరూ మంచి క్రీడాకారులు కావడమే తనను క్రీడల వైపు మరల్చింది అంటారు నాగరాజు. ‘‘మా అమ్మ రాజేశ్వరీ వెంకట్రావ్ బెంగుళూరులో టెన్నిస్ ఆడేది. తండ్రి సి.డి. వెంకట్రావ్ ఉస్మానియా తరఫున ఆడేవారు. నేను జూనియర్స్ లెవెల్‌లో నేషనల్స్ ఆడాను. సాధారణ ఉద్యోగాలు చేస్తే టెన్నిస్‌కు దూరం కావాల్సిందే అని తెలిసిన తర్వాత టెన్నిస్ కోచ్ కావడానికి కావల్సిన కోర్సులు చేసి శిక్షకుడిగా మారాను’’ అని వివరించారాయన.

నాగరాజు పూర్వీకులది తమిళనాడులోకి కంజీవరం. నాలుగు తరాల ముందు శ్రీనివాసన్ సికింద్రాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. అతడి కుమారుడు దామోదర్ మొదలియార్ డెక్కన్ రైల్వేస్‌లో ఉద్యోగి. అతడి కుమారుడే టెన్నిస్ క్రీడాకారుడు సి.డి. వెంకట్రావ్ - ప్రస్తుతం టెన్నిస్ శిక్షకులైన నాగరాజు తండ్రి. అలా తమిళనాడు నుంచి వచ్చి తెలుగుగడ్డపై స్థిరపడినవారిలో నాలుగోతరం తనదంటారాయన.
 ఇంతమంది క్రీడాకారులను తయారు చేస్తున్నప్పటికీ తన కుటుంబం నుంచి టెన్నిస్ వారసులను తయారు చేయలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేశారు నాగరాజు. ‘‘నాకు ఒక్కతే అమ్మాయి. పేరు సాయికుమారి. నేను  పొద్దున్నే గ్రౌండ్‌కి వచ్చేవాడిని. తిరిగి ఇంటికి వెళ్లేటప్పటికి అమ్మాయి స్కూలుకెళ్ళేది. సాయంత్రం తాను ఇంటికి వచ్చేటప్పటికి నేను గ్రౌండ్‌కు రావడం, నేను ఇల్లు చేరేసరికి తను నిద్రపోవడం... తన బాల్యం దాదాపుగా ఇలాగే గడిచింది. తనకు టెన్నిస్ నేర్పించాలని నేను చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. మా ఆవిడ టీచరు కావడంతోనో ఏమో మా అమ్మాయికి పుస్తకాల మీద, చదువు మీద ఆసక్తి ఎక్కువగా కనిపించింది. దాంతో తనను అలాగే కొనసాగనిచ్చాం. ఆమె ఇప్పుడు ఓ బహుళ జాతి సంస్థలో ఉద్యోగం చేస్తూ భర్తతో కలిసి ముంబయిలో ఉంటోంది. తండ్రిగా నన్ను చాలా ప్రేమిస్తుంది కానీ, తనకు టెన్నిస్ మీద ప్రేమ కలగలేదు’’ అన్నారాయన కొంచెం బాధగా.

 ఇది నిరంతర సాధన!

 పిల్లలను క్రీడాకారులుగా తయారు చేయాలంటే వారికి కనీసంగా గ్రౌండ్‌కి రాగలిగిన ఆసక్తి ఉంటే చాలు, ఆ తర్వాత వారిని చైతన్యవంతం చేసి క్రీడాస్ఫూర్తి పెంచడం పెద్ద కష్టం కాదంటారు నాగరాజు.
 
‘‘టెన్నిస్ సాధన ఐదేళ్ల వయసులో మొదలు పెట్టి ఇరవై రెండు - ఇరవై మూడేళ్లు వచ్చే వరకు నిరంతరాయంగా  చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు తయారవుతారు. పద్దెనిమిదేళ్ల ముందే ఓ కల కనాలి. ఆ కలను సాకారం చేసుకోవడానికి అంతకాలం పాటు ఓపిగ్గా శ్రమించాలి’’ అని సూచించారు నాగరాజు. ఉత్తమ శిక్షకుడిగా ‘ఫార్కుందా అలీ అవార్డు’, ‘ప్రైడ్ ఇండియా’ పురస్కారాలను అందుకున్న నాగరాజు ప్రభుత్వం సహకరించి మంచి క్రీడాప్రాంగణానికి అవకాశం కల్పిస్తే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయగలనని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. నిజమే! ద్రోణాచార్యుడైనా సరే అంత గొప్ప విలుకాళ్లను తయారు చేయగలిగాడంటే పాలకులు తగిన వనరులు కల్పించడం వల్లే సాధ్యమైంది. ఆధునిక యుగానికీ అదే వర్తిస్తుంది.
 - వాకా మంజులారెడ్డి
 ఫొటోలు: శివ మల్లాల
 
‘‘తల్లిదండ్రులు కొంత ఖర్చుకు, కొన్ని త్యాగాలకు సిద్ధంగా ఉండాలి. పెళ్లిళ్లు, వేడుకలంటూ సాధనకు అంతరాయం రానివ్వకూడదు. పిల్లలతోపాటు తల్లిదండ్రుల్లో ఒకరు పిల్లల ఆట కోసమే సమయాన్ని కేటాయించాలి. కోచ్‌ఫీజు, పిల్లల దుస్తులు, టోర్నమెంట్‌లకు తీసుకెళ్లే చార్జీల వంటివి కలుపుకుని నెలకు పది నుంచి పదిహేను వేల ఖర్చు ఉంటుంది. వారిని గ్రౌండ్‌కు తీసుకురావడం, సూచించిన పోషకాహారం పెట్టడం వరకు తల్లిదండ్రులు చూసుకుంటే చాలు. వారిలో ఆట పట్ల ఆసక్తిని పెంచడం, ఆడితీరాలనేటట్లు చైతన్యవంతం చేయడం వంటివన్నీ మేమే చూసుకుంటాం.’’
 - కె.వి. నాగరాజు,
 టెన్నిస్ కోచ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement