ప్రిక్వార్టర్ ఫైనల్ చేరిన అగ్రశ్రేణి ఆటగాళ్లు
ఆస్ట్రేలియన్ ఓపెన్
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో కొందరు సీడెడ్ ప్లేయర్లకు అనూహ్య పరాజయాలు ఎదురవుతుంటే... టాప్ స్టార్లు అలవోక విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకోగా... వీరికి దీటుగా యువ క్రీడాకారులు సైతం మేటి ఆటగాళ్లను ఢీకొట్టి మరీ మూడో రౌండ్‌ను దాటేశారు. క్వాలిఫయర్ లెర్నర్ టియెన్, 22 ఏళ్ల మిచెల్సన్ తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ ఈవెంట్‌లో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.
మెల్‌బోర్న్: పురుషుల విభాగంలో డిఫెండింగ్
చాంపియన్, ఇటలీ స్టార్ యానిక్ సినెర్...మహిళల విభాగంలో ఫ్రెంచ్ ఓపెన్ ‘హ్యాట్రిక్’ చాంపియన్, పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్‌లు ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నలో ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో స్వియాటెక్‌తో పాటు ఆరో సీడ్ ఎలినా రిబాకినా (కజకిస్తాన్), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ డారియా కసత్కినా (రష్యా) ప్రిక్వార్టర్స్ చేరారు.
వీరితో పాటు ఎనిమిదో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా), 13వ సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) నాలుగో రౌండ్ చేరుకున్నారు. ఇరు విభాగాల్లో నాలుగో సీడ్ ప్లేయర్లు ఫ్రిట్జ్ (అమెరికా), పావొలిని (ఇటలీ)లకు మూడో రౌండ్లోనే చుక్కెదురైంది. భార్యభర్తలు స్వితోలినా (ఉక్రెయిన్), మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) చెప్పుకోదగిన విజయాలతో ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లో ముందంజ వేశారు. స్వితోలినా గత సీజన్ రెండు గ్రాండ్‌స్లామ్‌ల రన్నరప్ పావొలినిని కంగుతినిపిస్తే, మోన్‌ఫిల్స్... గత యూఎస్ ఓపెన్ రన్నరప్ టేలర్ ఫ్రిట్జ్‌కు చెక్ పెట్టాడు.
సినెర్ జోరు...
డిఫెండింగ్ చాంపియన్, టాప్‌సీడ్ యానిక్ సినెర్ అలవోక విజయంతో ప్రిక్వార్టర్స్ చేరాడు. శనివారం పురుషుల సింగిల్స్‌లో జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో అతను 6–3, 6–4, 6–2తో అమెరికాకు చెందిన 46వ ర్యాంకర్ మార్కొస్ గిరోన్‌ను వరుస సెట్లలో ఓడించాడు. గత సీజన్‌లో ఆసీస్, ఫ్రెంచ్ ఓపెన్‌లను గెలుచుకున్న 23 ఏళ్ల ఇటలీ టాప్‌స్టార్ ఈ సీజన్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. మరో మ్యాచ్‌లో గేల్ మోన్‌ఫిల్స్ ప్రిక్వార్టర్స్ చేరడం ద్వారా వన్నె తగ్గని వెటరన్ ప్లేయర్‌గా టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ సరసన నిలిచాడు.
మూడో రౌండ్లో 38 ఏళ్ల మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్) 3–6, 7–5, 7–6 (7/1), 6–4తో నాలుగో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)కు షాకిచ్చాడు. 2020లో ఫెడరర్ 38 ఏళ్ల వయసులో తన ఆఖరి ఆ్రస్టేలియన్ ఓపెన్ ఆడి సెమీస్ చేరాడు. డి మినార్ (ఆసీస్) 5–7, 7–6 (7/3), 6–3, 6–3తో సెరుండొలొ (అర్జెంటీనా)పై, 13వ సీడ్ రూన్ (డెన్మార్క్) 6–7 (5/7), 6–3, 4–6, 6–4, 6–4తో కెక్మనోవిచ్ (సెర్బియా)పై గెలిచారు. సంచలన క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా) 7–6 (12/10), 6–3, 6–3తో ఫ్రాన్స్‌కు చెందిన మౌటెట్‌ను ఓడించాడు. అన్‌సీడెడ్ మిచెల్సన్ (అమెరికా) 6–3, 7–6 (7/5), 6–2తో 19వ సీడ్ కచనొవ్ (రష్యా)ను
కంగుతినిపించాడు.
స్వితోలినా ముందంజ
మోన్‌ఫిల్స్ భార్య ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) తన భర్త నెగ్గిన కోర్టులోనే అనంతరం జరిగిన మ్యాచ్‌లో 2–6, 6–4, 6–0తో గత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ (2024)ల రన్నరప్ జాస్మిన్ పావొలిని (ఇటలీ)ని కంగుతినిపించింది. రెండో సీడ్ స్వియాటెక్ 6–1, 6–0తో యూఎస్ ఓపెన్ (2021) మాజీ చాంపియన్, బ్రిటన్ ప్లేయర్ ఎమ్మా రాడుకానుపై అలవోక విజయం సాధించింది. 19వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) 6–4, 6–4తో పదోసీడ్ సహచర ప్లేయర్ కొలిన్స్‌ను ఓడించింది. 6వ సీడ్ రిబాకినా 6–3, 6–4తో డయానా యా్రస్తెస్కా (ఉక్రెయిన్)పై, 8వ సీడ్ నవారో 6–4, 3–6, 6–4తో ఓన్స్ జాబెర్ (ట్యూనిíÙయా)పై, 9వ సీడ్ కసత్కినా (రష్యా) 7–5, 6–1తో పుతిన్‌త్సెవా (కజకిస్తాన్)పై గెలుపొందారు.
బాలాజీ జోడీ అవుట్
ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఈవెంట్ నుంచి భారత డబుల్స్ ప్లేయర్ శ్రీరామ్ బాలాజీ నిష్క్రమించాడు. మెక్సికన్ భాగస్వామి మిగుల్ ఏంజిల్ రేయెస్ వారెలతో జోడీ కట్టిన భారత ఆటగాడు రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. పురుషుల డబుల్స్‌లో శనివారం జరిగిన పోరులో బాలాజీ–ఏంజిల్ రేయెస్ ద్వయం 6–7 (1/7), 6–4, 3–6తో పోర్చుగల్‌కు చెందిన న్యూనో బోర్జెస్–ఫ్రాన్సిస్కొ కాబ్రల్ జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.
Comments
Please login to add a commentAdd a comment