పోలాండ్ టెన్నిస్ స్టార్‌పై నెల రోజుల నిషేధం
లండన్: అంతర్జాతీయ టెన్నిస్‌లో అగ్ర స్థాయిలో మరోసారి డోపింగ్ ఉదంతం కలకలం రేపింది. ఇటీవలే పురుషుల నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) డోపింగ్‌లో పట్టుబడగా ఈసారి మహిళల స్టార్ ప్లేయర్ వంతు వచ్చిoది. ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీల విజేత, ప్రపంచ రెండో ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలండ్) డోపింగ్‌లో పట్టుబడింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె తక్కువ శిక్షకే పరిమితమైంది. స్వియాటెక్‌పై కేవలం నెల రోజుల నిషేధం విధిస్తున్నట్లు ఇంటర్నేషనల్ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) ప్రకటించింది.
ఈ ఉదంతంలో స్వియాటెక్‌పై ఇప్పటికే తాత్కాలిక నిషేధం విధించారు. ఆమె దీనిని సవాల్ చేయడానికి ముందు ఈ ఏడాది సెపె్టంబర్ 22 నుంచి అక్టోబర్ 4 మధ్య కాలంలో సస్పెన్షన్‌లోనే ఉంది. ఆ సమయంలో స్వియాటెక్ మూడు టోర్నీలో కొరియా ఓపెన్, చైనా ఓపెన్, వుహాన్ ఓపెన్‌లకు దూరమైంది. దాంతో మరో ఎనిమిది రోజులు మాత్రమే ఆమె శిక్ష మిగిలి ఉండగా... ఇది డిసెంబర్ 4తో ముగుస్తుంది.
గత రెండు సీజన్లలో ఎక్కువ భాగం వరల్డ్ నంబర్‌వన్‌గా ఉన్న స్వియాటెక్ వరుస విజయాలతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టోర్నీలో లేని సమయంలో ఆగస్టులో ఆమె ఇచ్చిన శాంపిల్స్‌లో డోపీగా తేలింది. నిషేధిత ఉత్ప్రేరకం ‘ట్రైమెటాజిదైన్’ను ఆమె వాడినట్లు పరీక్షలో బయటపడింది. అయితే ఇది తాను ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని పేర్కొంది. జెట్ లాగ్, నిద్రలేమి వంటి సమస్యల కోసం వాడిన మందులో ఇది ఉందని, దీని వాడకం తమ దేశంలో చాలా సాధారణమని ఆమె వివరణ ఇచ్చిoది.
విచారణ సమయంలో స్వియాటెక్ వివరణపై సంతృప్తి చెందిన ఐటీఐఏ ఆమె తప్పేమీ లేదంటూ స్వల్ప శిక్షతో సరిపెట్టింది. నెల రోజుల నిషేధంతో పాటు 1,58,944 డాలర్లు (రూ. 1 కోటి 34 లక్షలు) జరిమానాగా విధించింది. 23 ఏళ్ల స్వియాటెక్ ఇప్పటి వరకు కెరీర్‌లో మొత్తం 21 సింగిల్స్ టైటిల్స్ సాధించింది. ఇందులో ఐదు గ్రాండ్‌స్లామ్ టోర్నీలు (ఫ్రెంచ్ ఓపెన్–2024, 2023, 2022, 2020; యూఎస్ ఓపెన్–2022) కూడా ఉండటం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment