షరపోవా, ముగురుజా అవుట్
►ప్రిక్వార్టర్ ఫైనల్లో పరాజయం
►సెవస్తోవా, క్విటోవా సంచలనం
►యూఎస్ ఓపెన్ టోర్నీ
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పరంపర కొనసాగుతోంది. డోపింగ్ నిషేధం గడువు పూర్తయ్యాక ఆడుతోన్న తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మరియా షరపోవా (రష్యా)... మరోవైపు మూడో సీడ్ ముగురుజా (స్పెయిన్)ల పోరు ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌ల్లో 16వ సీడ్ అనస్తాసియా సెవస్తోవా (లాత్వియా) 5–7, 6–4, 6–2తో మాజీ నంబర్‌వన్, మాజీ విజేత షరపోవాను బోల్తా కొట్టించి... 13వ సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/3), 6–3తో ముగురుజాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్, ఈ ఏడాది వింబుల్డన్ టైటిల్స్ నెగ్గిన ముగురుజా తాజా ఓటమితో ఆమెకు నంబర్‌వన్ ర్యాంక్ అయ్యే అవకాశాలు నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), టాప్ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) ఆటతీరుపై ఆధారపడ్డాయి.
స్వితోలినా సెమీస్‌కు, ప్లిస్కోవా ఫైనల్‌కు చేరుకోకుంటేనే ముగురుజాకు నంబర్‌వన్ ర్యాంక్ లభిస్తుంది. సెవస్తోవాతో 2 గంటల 16 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో షరపోవా ఏకంగా 51 అనవసర తప్పిదాలు చేయగా... లాత్వియా క్రీడాకారిణి కేవలం 14 మాత్రమే చేసింది. క్విటోవాతో గంటా 46 నిమిషాలపాటు జరిగిన పోరులో ముగురుజా 25 అనవసర తప్పిదాలు చేసి, కేవలం ఏడు విన్నర్స్ కొట్టింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో వీనస్ 6–3, 3–6, 6–1తో కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై, స్లోన్ స్టీఫెన్స్ 6–3, 3–6, 6–1తో జూలియా జార్జెస్ (జర్మనీ)పై, ప్లిస్కోవా 6–1, 6–0తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై గెలిచారు.
క్వార్టర్స్‌లో నాదల్
పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ నాదల్ 6–2, 6–4, 6–1తో డల్గొపలోవ్ (ఉక్రెయిన్)పై గెలుపొందాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో కెనడా రైజింగ్ స్టార్ షపోవలోవ్ 6–7 (2/7), 6–7 (4/7), 6–7 (3/7)తో పాబ్లో బుస్టా (స్పెయిన్) చేతిలో ఓడిపోగా... సామ్ క్వెరీ (అమెరికా) 6–2, 6–2, 6–1తో మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. అండర్సన్ (దక్షిణాఫ్రికా), ష్వార్ట్‌జ్‌మన్ (అర్జెంటీనా) కూడా క్వార్టర్స్‌కు చేరారు.
క్వార్టర్స్‌లో సానియా జంట
మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సానియా మీర్జా (భారత్)–షుయె పెంగ్ (చైనా) జంట 6–2, 3–6, 7–6 (7/2)తో సొరానా (రొమేనియా)–సొరిబెస్ (స్పెయిన్) జోడీపై గెలిచి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో బోపన్న (భారత్)–దబ్రౌస్కీ (కెనడా) ద్వయం 6–3, 6–4తో మార్టినెజ్ (స్పెయిన్)–మోన్‌రో (అమెరికా) జంటను ఓడించింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో పేస్–పురవ్ రాజా (భారత్) జోడీ 4–6, 6–7 (7/9)తో ఖచనోవ్–రుబ్లోవ్ (రష్యా) జంట చేతిలో ఓడింది.