సుదీర్ఘకాలంగా గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న ఇటలీకి ఈ ఏడాది రెండు టైటిల్స్ దక్కాయి. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో విజేతగా నిలిచాడు.
వందేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఇటలీ ఆటగాడు లొరెంజో ముసెట్టి కాంస్య పతకం సాధించాడు. మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పావోలిని జోరు సాగిస్తుంటే... డబుల్స్‌లోనూ లెక్కకు మిక్కిలి జోడీలు టైటిల్స్‌తో సత్తా చాటుతున్నాయి. టెన్నిస్ కోర్టులో అడుగు పెడితే విజేతగా నిలవడమే లక్ష్యంగా ఇటలీ ప్లేయర్లు ముందుకు సాగుతున్నారు. –సాక్షి క్రీడా విభాగం
లొరెంజో
ఈ ఏడాది అంతర్జాతీయ టెన్నిస్ టోర్నీల్లో ఇటలీ ఆటగాళ్ల జోరు సాగుతోంది. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్ యానిక్ సినెర్ రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సొంతం చేసుకోవడంతోపాటు మరో నాలుగు ఏటీపీ టోర్నీల్లో విజేతగా నిలిచాడు.
ఇక మహిళల సింగిల్స్‌లో జాస్మిన్ పావోలిని వింబుల్డన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ–ఆండ్రియా వవసోరి... మహిళల డబుల్స్‌లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని రన్నరప్‌గా నిలిచారు.
అదే విధంగా.. ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో సిమోన్ బొలెలీ–ఆండె వవసోరి రన్నరప్‌గా నిలిచారు. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సారా ఎరాని–వవసోరకి జోడీ చాంపియన్‌గా అవతరించింది. ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్ మహిళల డబుల్స్‌లో సారా ఎరాని–జాస్మిన్ పావోలిని జంట స్వర్ణ పతకం గెలుచుకోగా... పురుషుల సింగిల్స్‌లో లొరెంజో ముసెట్టి కాంస్య పతకంతో మెరిశాడు. విశ్వక్రీడల పురుషుల సింగిల్స్‌లో వందేళ్ల తర్వాత ఇటలీకి ఇదే తొలి పతకం కావడం విశేషం.
భవిష్యత్తు అతడిదేనా!
సీజన్ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ గెలవడంతో దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత గ్రాండ్‌స్లామ్ గెలిచిన ఇటలీ ప్లేయర్‌గా సినెర్ రికార్డుల్లోకి ఎక్కాడు. చివరిసారిగా 1976 ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇటలీ నుంచి ఆండ్రియానో పనట్టా టైటిల్ గెలిచాడు. ఇక సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో చాంపియన్‌గా నిలవడం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి ఇటలీ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
గత కొంతకాలంగా నిలకడ సాగిస్తున్న 23 ఏళ్ల సినెర్ భవిష్యత్తు తనదే అని చెప్పకనే చెబుతున్నాడు. ఈ ఏడాది అతడు ఆడిన 60 మ్యాచ్‌ల్లో 55 విజయాలు సాధించాడంటే సినెర్ జోరు ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియన్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్స్‌తో పాటు... రోటర్‌డామ్ ఓపెన్, మయామి మాస్టర్స్, హాలె ఓపెన్, సిన్సినాటి మాస్టర్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచిన సినెర్ ఈ ఏడాది ఓవరాల్‌గా ఆరు టైటిల్స్ ఖాతాలో వేసుకున్నాడు.
ఇక స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆటకు వీడ్కోలు పలకగా... స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ గాయాలతో సతమతమవుతున్నాడు. సెర్బియా వీరుడు నొవాక్ జొకోవిచ్ కూడా కెరీర్ చరమాంకానికి చేరుకోవడంతో సినెర్ ఇదే నిలకడ కొనసాగిస్తే... భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక మహిళల విభాగంలో జాస్మిన్ అనూహ్య ఆటతీరుతో దూసుకొస్తోంది.
మంచి రోజులు ముందున్నాయి...
దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరిగుతున్న తరుణంలో భవిష్యత్తు తమ ప్లేయర్లదే అని ఇటలీ టెన్నిస్ సమాఖ్య అధ్యక్షుడు ఏంజెలో బినాఘి అంటున్నారు. ‘కొత్త తరంలోకి అడుగు పెడుతున్నాం. అందుకు ఇటలీ సిద్ధంగా ఉంది. దిగ్గజ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో అవకాశాలను వినియోగించుకుంటూ సత్తాచాటుతున్నాం. మహిళల విభాగంలోనూ మా పురోభివృద్ధి బాగుంది’ అని బినాఘి అన్నారు.
ప్రస్తుతం పురుషుల సింగిల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్ టాప్–50లో ఏడుగురు ఇటలీ ప్లేయర్లు ఉన్నారు. కేవలం సింగిల్స్‌లోనే కాకుండా... డబుల్స్‌లోనూ ఇటలీ ప్లేయర్లు నిలకడ సాగిస్తున్నారు. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ ఫలితాలే ఇందుకు నిదర్శనం. ‘దాదాపు యాభై ఏళ్లుగా గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తుంటే... ఈ సంవత్సరం సినెర్ రెండు టైటిల్స్‌తో అదరగొట్టాడు.
ఇతర టోర్నీల్లోనూ ఇటలీ ప్లేయర్ల ప్రదర్శన బాగుంది. డేవిస్‌కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ టైటిల్ నిలబెట్టుకోవడంపై దృష్టి పెట్టాం. ఇదే జోరు సాగిస్తూ సొంతగడ్డపై పెద్ద టోరీ్నలో విజయం సాధించడమే తదుపరి లక్ష్యంగా పెట్టుకున్నాం. విజయవంతంగా సాగుతున్న ఈ ప్రయాణాన్ని ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉండండి’ అని బినాఘి పేర్కొన్నారు.
ఏటీపీ ఫైనల్స్‌పై దృష్టి
విదేశాల్లో వరస విజయాలు సాధిస్తున్న ఇటలీ ప్లేయర్లు... స్వదేశంలో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నారు. ఈ ఏడాది ఫుల్ జోష్ లో ఉన్న సినెర్ గాయం కారణంగా ఇటాలియన్ ఓపెన్ బరిలోకి దిగలేదు. 1976 ఇటాలియన్ ఓపెన్‌లో చివరిసారిగా స్థానిక ఆటగాడు పనట్టా పురుషుల సింగిల్స్ విజేతగా నిలవగా.. 1985లో మహిళల సింగిల్స్‌లో రఫ్పెల్లా రెగ్గీ టైటిల్ సాధించింది.
అప్పటి నుంచి స్థానిక ఆటగాళ్లెవరూ ఇటాలియన్ ఓపెన్ గెలుచుకోలేదు. ఇకపై స్వదేశంలోనూ సత్తా చాటడంపై దృష్టి పెట్టనున్నట్లు బినాఘి తెలిపారు. ఈ ఏడాది నవంబర్‌లో వరసగా నాలుగోసారి ఇటలీలో ఏటీపీ ఫైనల్స్ టోర్నీ జరగనుంది. గత ఏడాది జొకోవిచ్ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచిన సినెర్ ఈసారి టైటిల్ సాధించాలని కసితో ఉన్నాడు.
యూఎస్ ఓపెన్ ప్రారంభానికి ముందు డోపింగ్ వివాదంతో వార్తల్లోకి ఎక్కిన సినెర్ తన ఆటతీరుపై ఆ ప్రభావం పడలేదని నిరూపించుకున్నాడు. ఇటీవల యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ఇటలీలో ప్రతి పది మందిలో ఒకరు వీక్షించారని బినాఘి తెలిపారు.
మౌలిక వసతుల కల్పన వల్లే నైపుణ్యం గల ఆటగాళ్లను వెలికి తీయగలిగామని ఆయన పేర్కొన్నారు. సీనియర్ స్థాయిలోనే కాకుండా... జూనియర్ ఈవెంట్స్‌లోనూ ఇటలీ ప్లేయర్లు హవా సాగిస్తున్నారు. ఈ ఏడాది జూనియర్ సర్క్యూట్‌లో ఇటలీ ప్లేయర్లు 10 టైటిట్స్ సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment