చిక్కుల్లో ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్
ఇటలీ స్టార్‌పై నిషేధం విధించాలన్న ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ
సీఏఎస్‌లో అప్పీలు చేసిన ‘వాడా’
హతవిధి... సినెర్‌ను అంతర్జాతీయ టెన్నిస్ ఇంటిగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) కరుణించినా... డోపింగ్ మరక మాత్రం నీడలా వెంటాడుతోంది. మార్చిలో దొరికినా... ఆగస్టు దాకా గోప్యంగా ఉంచేందుకు జాగ్రత్త పడినా... ఒక్క విన్నపంతో ఆశ్చర్యకరంగా నిషేధం బారిన పడకపోయినా... ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) డేగకన్ను నుంచి తప్పించుకోలేకపోయాడు. దీంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.
రోమ్: ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ ప్లేయర్ యానిక్ సినెర్‌ను పాత వివాదం కొత్తగా చుట్టుకుంటోంది. డోపింగ్‌లో దొరికిపోయినా కనీసం ప్రొవిజనల్ సస్పెన్షన్ (తాత్కాలిక నిషేధం), తదుపరి సస్పెన్షన్ నుంచి తప్పించుకున్న ఈ ఇటలీ స్టార్ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) కన్నుగప్పలేకపోయాడు. నిషిద్ధ ఉ్రత్పేరకాలు తీసుకున్నట్లు రెండుసార్లు పరీక్షల్లో తేలినా నిషేధం విధించకపోవడం ఏంటని ‘వాడా’ రంగంలోకి దిగింది.
తాజా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చాంపియన్‌ను ఒకటి లేదా రెండేళ్ల పాటు నిషేధించాల్సిందేనని ‘వాడా’ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) తలుపు తట్టింది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని సీఏఎస్‌లో ‘వాడా’ అప్పీలు చేసింది. నిజానికి 23 ఏళ్ల సినెర్ దోషిగా తేలాడు. తాజా అప్పీలుపై జరిగే విచారణలో సీఏఎస్ సస్పెన్షన్‌కు గురైతే మాత్రం యూఎస్ ఓపెన్ టైటిల్‌ను కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం బీజింగ్‌లో చైనా ఓపెన్ ఆడుతున్న సినెర్... ‘వాడా’ అప్పీలుకు వెళ్లడంపై విచారం వ్యక్తం చేశాడు. ‘ఇది నన్ను చాలా నిరాశపరుస్తోంది.
అంతేకాదు ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తోంది. నిజాయితీగా చెబుతున్నా... నేను ఇదివరకే మూడు విచారణలకు హాజరయ్యా. అన్నింటిలోనూ నాకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ‘వాడా’ అప్పీలును నేను ఊహించలేదు. దీని గురించి నాకు రెండు రోజుల క్రితమే తెలిసింది’ అని సినెర్ అన్నాడు. మరోవైపు ‘వాడా’ అధికారి ఒకరు మాట్లాడుతూ ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని, నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించలేదని తెలుసుకోవడం ‘వాడా’ లక్ష్యమని అన్నాడు.
అప్పుడేం జరిగింది?
ఈ ఏడాది మార్చిలో ఇండియన్ వెల్స్ టోర్నీ జరిగింది. ఆ సమయంలో, టోర్నీ ముగిశాక... ఈ రెండు సందర్భాల్లోనూ సినెర్ ఇచ్చిన శాంపిల్స్‌లో నిషిద్ధ ఉ్రత్పేరకం ‘క్లోస్టెబల్’ ఉన్నట్లు తేలింది. అంటే ఏకంగా ఒకే నెలలో రెండుసార్లు డోపింగ్‌లో పట్టుబడ్డాడు. దీంతో ఆ టోర్నీలో సెమీస్ చేరడంతో వచ్చిన ప్రైజ్‌మనీని వెనక్కి తీసుకోవడంతో పాటు, 400 ర్యాంకింగ్ పాయింట్లను కోతగా విధించారు.
దీనిపై అప్పీలుకు వెళ్లిన సినెర్ ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదదని, తన ఫిజియో మసాజ్ చేసే సమయంలో కొట్టిన స్ప్రేతో శరీరంలోకి ప్రవేశించిందని, ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా డోపింగ్ నిబంధనల్ని నిక్కచ్చిగా పాటిస్తానని విన్నవించాడు. ఐటీఐఏ ఏర్పాటు చేసిన ఇండిపెండెంట్ ప్యానెల్ అతని విన్నపాన్ని మన్నించి... క్లీన్‌చిట్ ఇవ్వడం అప్పట్లోనే వివాదాస్పదమైంది.
అలనాటి అమెరికా టెన్నిస్ దిగ్గజం క్రిస్ ఎవర్ట్ సహా షపవలోవ్ (కెనడా), కిరియోస్ (ఆస్ట్రేలియా) సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక్కొక్కరికి ఒక్కోలా నిబంధనలుంటాయా అని ప్యానెల్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.
సూపర్ ఫామ్‌లో...
ఈ ఏడాది సినెర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. రెండు గ్రాండ్‌స్లామ్ టోర్నీలలో (ఆ్రస్టేలియన్, యూఎస్ ఓపెన్) విజేతగా నిలువడంతోపాటు మరో నాలుగు టోర్నీల్లో టైటిల్స్ సాధించాడు. ప్రస్తుతం బీజింగ్‌లో జరుగుతున్న చైనా ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకున్న సినెర్ ఈ ఏడాది 57 మ్యాచ్‌ల్లో గెలిచి, కేవలం ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment