US Open 2022: నాదల్‌ ముందంజ | US Open 2022: Rafael Nadal beat Fabio Fognini in US Open second round | Sakshi
Sakshi News home page

US Open 2022: నాదల్‌ ముందంజ

Published Sat, Sep 3 2022 5:33 AM | Last Updated on Sat, Sep 3 2022 5:33 AM

US Open 2022: Rafael Nadal beat Fabio Fognini in US Open second round - Sakshi

న్యూయార్క్‌: కెరీర్‌లో 23వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలిచే లక్ష్యంతో బరిలోకి దిగిన స్పెయిన్‌ దిగ్గజం, రెండో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌కు వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కొంత ప్రతిఘటన ఎదురైంది. తొలి రౌండ్‌లాగే తొలి సెట్‌ను కోల్పోయిన అతను ఆ తర్వాత తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో ముందంజ వేశాడు. ‘నా కెరీర్‌లో అతి చెత్త ఆరంభాల్లో ఇది ఒకటి’... యూఎస్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లో ఫాబియో ఫాగ్‌నిని (ఇటలీ)పై విజయం తర్వాత స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ వ్యాఖ్య ఇది.

తొలి సెట్‌లో, ఆ తర్వాత రెండో సెట్‌లో సగం వరకు కూడా నాదల్‌ ఆట చూస్తే అలాగే అనిపించింది. అయితే అసలు సమయంలో తేరుకున్న అతను ఆ తర్వాత దూసుకుపోయాడు. 2 గంటల 43 నిమిషాల పాటు సాగిన పోరులో చివరకు విజేతగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాదల్‌ 2–6, 6–4, 6–2, 6–1తో ఫాగ్‌నినిపై గెలుపొందాడు. తొలి సెట్‌ను కోల్పోవడంతో పాటు రెండో సెట్‌లో కూడా ఒక దశలో నాదల్‌ 2–4తో వెనుకబడ్డాడు. అయితే ఏడో గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో పాటు ప్రత్యర్థి సర్వీస్‌ను వరుసగా రెండుసార్లు బ్రేక్‌ చేసి నాదల్‌ సెట్‌ను గెలుచుకున్నాడు. ఆ తర్వాత తిరుగులేని ఆటతో అతను ఫాగ్‌నినికి చెక్‌ పెట్టాడు. మూడో రౌండ్‌లో నాదల్‌ రిచర్డ్‌ గాస్కే (ఫ్రాన్స్‌)తో తలపడతాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ కార్లోస్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) 6–2, 6–1, 7–5తో ఫెడెరికో (అర్జెంటీనా)ను ఓడించి ముందంజ వేశాడు.  

తన రాకెట్‌తో ముక్కుకు...
ఫాగ్‌నినితో మ్యాచ్‌ సందర్భంగా నాదల్‌కు అనూహ్య రీతిలో స్వల్పంగా గాయమైంది. నాలుగో సెట్‌లో కుడి పక్కకు జరిగి వైడ్‌ బ్యాక్‌హ్యాండ్‌ ఆడే క్రమంలో రాకెట్‌పై నాదల్‌ పట్టు కోల్పోయాడు. వేగంగా కోర్టును తాకిన రాకెట్‌ అంతే వేగంగా వెనక్కి వచ్చి అతని ముక్కుకు బలంగా తాకింది. రక్తస్రావం కావడంతో ఆటను నిలిపేసి వెంటనే అతను వైద్య చికిత్స తీసుకున్నాడు. ముక్కుపై బ్యాండేజీతో ఆ తర్వాత ఆటను కొనసాగించి అతను విజేతగా నిలిచాడు. తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యానని, ముక్కు పగిలినట్లు భావించానన్న నాదల్‌... అంత చెత్తగా ఆడుతున్నందుకు తనకు లభించిన చిన్నపాటి శిక్ష అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.

విలియమ్స్‌ సిస్టర్స్‌కు నిరాశ...
సొంత ప్రేక్షకుల ముందు చివరిసారిగా ఆడేందుకు నాలుగున్నరేళ్ల తర్వాత డబుల్స్‌లో జోడీ కట్టిన ‘విలియమ్స్‌ సిస్టర్స్‌’ మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించారు. ‘వైల్డ్‌కార్డ్‌’తో ఈ టోర్నీలో అడుగు పెట్టిన సెరెనా–వీనస్‌ ద్వయం 6–7 (5/7), 4–6 స్కోరుతో లూసీ హర్డెకా–లిండా నొస్కొవా (చెక్‌ రిపబ్లిక్‌) జోడీ చేతిలో ఓటమి పాలైంది. అయితే ఆడినంత సేపు అభిమానులంతా ‘విలియమ్స్‌’ నినాదాలతో ఉత్సాహపరిచారు. తొలి సెట్‌ టైబ్రేకర్‌లో 19 స్ట్రోక్‌ల పాయింట్‌ను వీరిద్దరు గెలుచుకున్నప్పుడైతే దాదాపు 24 వేల సామర్థ్యం గల స్టేడియం మొత్తం హోరెత్తింది. సెరెనా–వీనస్‌ కలిసి మహిళల డబుల్స్‌లో 14 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ గెలిచారు.

కిరియోస్‌కు భారీ జరిమానా
ప్రతీ టోర్నీలో క్రమశిక్షణను ఉల్లంఘించి భారీగా జరిమానాలు చెల్లించడంలో ‘డాక్టరేట్‌ పొందిన’ నిక్‌ కిరియోస్‌ (ఆస్ట్రేలియా) మళ్లీ అదే తప్పు చేశాడు. గ్యాలరీలో కూర్చున్న అభిమానులను ఉద్దేశిస్తూ అసభ్యకర భాష వాడిన అతను క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించాడు. దాంతో నిర్వాహకులు కిరియోస్‌కు 7,500 డాలర్లు (సుమారు రూ. 6 లక్షలు) జరిమానా విధించారు.

బోపన్న ఇంటిదారి
భారత ఆటగాడు రోహన్‌ బోపన్నకు పురుషుల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో కూడా నిరాశే ఎదురైంది. డబుల్స్‌లో బోపన్న–మిడిల్‌కూప్‌ (నెదర్లాండ్స్‌) 6–7 (2/7), 2–6 స్కోరుతో సొనెగో–వవసొరి (ఇటలీ) చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ లో బోపన్న–జువాన్‌ యాంగ్‌ (చైనా) జోడీ 5–7, 5–7తో దబ్రొస్కీ (కెనడా)–పర్సెల్‌ (ఆస్ట్రేలియా) ద్వయం చేతిలో ఓడిపోయారు. పురుషుల డబుల్స్‌లో మరో భారత ఆటగాడు రామ్‌కుమార్‌ –కాసిక్‌ (సెర్బి యా) 4–6, 4–6తో బొలెలి–ఫాగ్‌నిని (ఇటలీ) చేతిలో పరాజయం పొందారు.

షేక్‌హ్యాండ్‌కు నిరాకరణ...
మహిళల సింగిల్స్‌లో అజరెంకా (బెలారస్‌) మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టింది. రెండో రౌండ్‌ లో ఆమె 6–2, 6–3తో మార్టా కొస్‌యుక్‌ (ఉక్రెయిన్‌)ను ఓడించింది. అయితే మ్యాచ్‌ ముగిసిన తర్వాత సహజంగా ఇద్దరు ప్లేయర్లు చేతులు కలిపే సంప్రదాయానికి భిన్నంగా కొస్‌యుక్‌ దూరం జరిగింది. తన దేశంపై రష్యా దాడికి నిరసనగా (రష్యాకు బెలారస్‌ సహకరిస్తోంది) ఆమె ఈ పని చేసింది. చివరకు ఒకరి రాకెట్‌ను మరొకరు
తాకించి ఇద్దరూ నిష్క్రమించారు.  

ప్రిక్వార్టర్స్‌లో జబర్‌
ఐదో సీడ్‌ ఆన్స్‌ జబర్‌ (ట్యూనిషియా) తొలిసారి యూఎస్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడో రౌండ్‌లో జబర్‌ 4–6, 6–4, 6–3తో షెల్బీ రోజర్స్‌ (అమెరికా)పై గెలిచింది. గతంలో ఆరుసార్లు యూఎస్‌ ఓపెన్‌లో ఆడిన జబర్‌ మూడో రౌండ్‌ దాటి ముందుకెళ్లలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement