రఫెల్ను రఫ్ఫాడించాడు..
న్యూయార్క్ : యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మూడో రౌండ్లోనే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ పోరాటం ముగిసింది. మూడో రౌండ్లో ఇటలీకి చెందిన ఫాబియో ఫొగ్నిని చేతిలో 3-6, 4-6, 6-4, 6-3, 6-4 తేడాతో రఫెల్ నాదల్ను రఫ్ఫాడించి మట్టికరిపించాడు. తొలి, రెండో సెట్లు గెలిచిన నాదల్ ఆతర్వాత ఉదాసీనత ప్రదర్శించాడేమో.. వెంటనే తేరుకున్న 32వ సీడ్ ఆటగాడు ఫొగ్నిని వరుసగా మూడు సెట్లు గెలుచుకుని విజయం సాధించాడు.
నిర్ణయాత్మక ఐదో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడగా, ఫొగ్నిని దూకుడు ముందు బుల్ తలొగ్గాల్సి వచ్చిందంటే నమ్మశ్యం కాదు. రెండు సార్లు చాంపియన్ అయిన నాదల్.. గత పదేళ్ల కాలంలో ఇంత త్వరగా ఈ గ్రాండ్ స్లామ్ టోర్నీ నుంచి ఇంటిదారి పట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2005 తర్వాత యూఎస్ ఓపెన్లో ఓ ఇటలీ ఆటగాడు ప్రీ క్వార్టర్స్ చేరడం ఇదే తొలిసారి. సైమోన్ బొలెల్లీతో కలిసి ఈఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డుబుల్స్ విభాగంలో ఫాబియో ఫొగ్నిని టైటిల్ కైవసం చేసుకున్న విషయం విదితమే.