US Open 2022: ఎదురులేని నాదల్‌ | US Open 2022: Rafael Nadal defeats Richard Gasquet in straight sets | Sakshi
Sakshi News home page

US Open 2022: ఎదురులేని నాదల్‌

Published Mon, Sep 5 2022 4:37 AM | Last Updated on Mon, Sep 5 2022 4:37 AM

US Open 2022: Rafael Nadal defeats Richard Gasquet in straight sets - Sakshi

న్యూయార్క్‌: తొలి రెండు రౌండ్‌లలో విజయం సాధించేందుకు చెమటోడ్చిన స్పెయిన్‌ టెన్నిస్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ మూడో రౌండ్‌లో మాత్రం రఫ్ఫాడించాడు. తన చిరకాల ప్రత్యర్థి రిచర్డ్‌ గాస్కే (ఫ్రాన్స్‌)పై మరోసారి సంపూర్ణ ఆధిపత్యం చలాయించి అతనిపై వరుసగా 18వ విజయం సాధించాడు. తద్వారా టెన్నిస్‌ సీజన్‌ చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌లో నాదల్‌ 11వసారి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

ప్రపంచ 91వ ర్యాంకర్‌ రిచర్డ్‌ గాస్కేతో జరిగిన పురుషుల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ నాదల్‌ 6–0, 6–1, 7–5తో అలవోకగా గెలుపొందాడు. 2 గంటల 17 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో నాదల్‌ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేశాడు. 35 విన్నర్స్‌ కొట్టిన నాదల్‌ 24 సార్లు నెట్‌ వద్దకు దూసుకొచ్చి 19 సార్లు పాయింట్లు గెలిచాడు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో అమెరికా ప్లేయర్‌ ఫ్రాన్సిస్కో టియాఫోతో ఆడతాడు.

మూడో రౌండ్‌లో టియాఫో 7–6 (9/7), 6–4, 6–4తో 14వ సీడ్‌ డీగో ష్వార్ట్‌జ్‌మన్‌ (అర్జెంటీనా)పై విజయం సాధించాడు. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో మూడో సీడ్‌ అల్‌కరాజ్‌ (స్పెయిన్‌) 6–3, 6–3, 6–3తో జెన్సన్‌ బ్రూక్స్‌బై (అమెరికా)పై, తొమ్మిదో సీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా) 6–4, 2–6, 6–7 (3/7), 6–4, 7–6 (10/7)తో షపోవలోవ్‌ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

స్వియాటెక్‌ ముందంజ
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. మూడో రౌండ్‌లో స్వియాటెక్‌ 6–3, 6–4తో లౌరెన్‌ డేవిస్‌ (అమెరికా)పై నెగ్గింది. ఇతర మూడో రౌండ్‌ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్‌ జెస్సికా పెగూలా (అమెరికా) 6–2, 6–7 (6/8), 6–0తో యు యువాన్‌ (చైనా)పై, డానియెలా కొలిన్స్‌ (అమెరికా) 6–4, 7–6 (11/9)తో అలైజ్‌ కార్నెట్‌ (ఫ్రాన్స్‌)పై, పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 5–7, 6–3, 7–6 (12/10)తో తొమ్మిదో సీడ్‌ ముగురుజా (స్పెయిన్‌)పై, అజరెంకా (బెలారస్‌) 6–3, 6–0తో పెట్రా మార్టిక్‌ (క్రొయేషియా)పై, కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 5–7, 6–4, 6–3తో 13వ సీడ్‌ బెలిండా బెన్‌చిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై నెగ్గి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement