జొకో జోరు కొనసాగేనా..?
నేటి నుంచి యూఎస్ ఓపెన్
గాయంతో నాదల్ దూరం
18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై ఫెడరర్, సెరెనా దృష్టి
న్యూయార్క్: ఈ ఏడాది చివరి గ్రాండ్‌స్లామ్ యూఎస్ ఓపెన్‌కు నేడు (సోమవారం) తెరలేవనుంది. వచ్చే నెల 8 వరకు జరిగే ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ గాయం కారణంగా బరిలోకి దిగడం లేదు. దీంతో 2011లో ఈ టైటిల్ గెలిచిన ప్రపంచ నంబర్‌వన్ జొకోవిచ్, 2012 నుంచి ఒక్క గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా సాధించలేకపోతున్న మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెడరర్ ఈసారి ఆ లోటును తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది వింబుల్డన్ విజయంతో జోరు మీదున్న జొకోవిచ్ క్లిష్టమైన డ్రానే ఎదుర్కోనున్నాడు.
సన్నాహక మ్యాచ్‌ల్లో భాగంగా ఆడిన మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్స్, సిన్సినాటీ టోర్నీ మూడో రౌండ్‌లోనే వెనుదిరిగినా ఆ ప్రభావం ఇక్కడ ఉండదని నమ్మకంగా ఉన్నాడు. మరో రెండు నెలల్లో తండ్రి కాబోతున్న ఉత్సాహంతో ఉన్న ఈ సెర్బియా ఆటగాడు అనుకున్న ప్రకారం ముందుకెళితే క్వార్టర్ ఫైనల్లో బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే ఎదురయ్యే అవకాశం ఉంది. సోంగా, వావ్రింకాలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే ఈ టోర్నీకి ముందు ఫామ్ పరంగా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన జొకోవిచ్‌ను ప్రత్యర్థులు తక్కువగా తీసుకోవడానికి లేదు. మైదానంలో పాదరసంలా కదిలే ఈ సెర్బియన్‌కు అనూహ్యంగా పుంజుకునే సత్తా ఉంది.
ఇక రికార్డు స్థాయిలో 18వ గ్రాండ్‌స్లామ్ అందుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న రెండో సీడ్ ఫెడరర్‌కు ఆ కల తీర్చుకునే అవకాశాలూ మెరుగ్గానే ఉన్నాయి. ఈ ఏడాది సూపర్ ఫామ్‌తో దూసుకెళుతున్న తనకు డ్రా ప్రకారం సెమీస్ వరకు గట్టి ప్రత్యర్థి ఎదురయ్యే పరిస్థితి కనిపించడం లేదు. క్వార్టర్స్‌లో ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) ఎదురయ్యే అవకాశం ఉంది. వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడినా... ఆ తర్వాత జరిగిన టోర్నీల్లో టైటిల్స్ గెలిచి ఊపు మీదున్నాడు. అతడితో పాటు ముర్రే నుంచి ఫెడరర్‌కు ముప్పు పొంచి ఉంది. 33 ఏళ్ల ఫెడరర్ ఒకవేళ ఆరోసారి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకుంటే మాత్రం అత్యధిక వయస్సులో గ్రాండ్‌స్లామ్ నెగ్గిన రెండో ఆటగాడిగా నిలుస్తాడు.
సెరెనా గెలిస్తే దిగ్గజాల సరసన..
మహిళల విభాగానికొస్తే ప్రస్తుత చాంపియన్, నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ కూడా మరోసారి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. 17 గ్రాండ్‌స్లామ్స్ నెగ్గిన ఈ అమెరికా దిగ్గజం మరో టైటిల్‌తో ఓపెన్ శకంలో 18 టైటిల్స్ నెగ్గి క్రిస్ ఎవర్ట్, మార్టినా నవత్రిలోవాల సరసన నిలిచేందుకు ఎదురుచూస్తోంది. అంతేకాకుండా దాదాపు 40 ఏళ్ల అనంతరం వరుసగా మూడు యూఎస్ ఓపెన్ టైటిల్స్ గెలిచిన క్రీడాకారిణిగా నిలవాలని అనుకుంటోంది. భవిష్యత్ అమెరికా స్టార్‌గా పిలువబడుతున్న 18 ఏళ్ల టేలర్ టౌన్సెండ్‌తో తొలి రౌండ్‌లో సెరెనా తలపడనుంది. అలాగే షరపోవా, ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరిన బౌచర్డ్ (కెనడా) నుంచి పోటీ ఎదురుకానుంది. లీ నా, విక్టోరియా అజరెంకా గాయాల కారణంగా తప్పుకున్నారు.