షరపోవా 18వ‘సారీ’...
అదే ప్రత్యర్థి. అదే ఫలితం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 18వసారి రష్యా స్టార్ మరియా షరపోవాకు సెరెనా విలియమ్స్ చేతిలో ఓటమి ఎదురైంది. అప్పుడెప్పుడో 2004లో డబ్ల్యూటీఏ టూర్ చాంపియన్‌షిప్‌లో చివరిసారి సెరెనాను ఓడించిన షరపోవా మళ్లీ ఈ అమెరికా నల్లకలువపై విజయం రుచి చూడలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనే సెరెనా చేతిలో షరపోవా ఓడిపోవడం ఇది నాలుగోసారి. గతంలో ఈ టోర్నీలో రెండుసార్లు ఫైనల్లో, ఒకసారి సెమీస్‌లో సెరెనా చేతిలో ఓడిన షరపోవా ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేసింది.
సెరెనా చేతిలో మళ్లీ ఓడిన రష్యా స్టార్
* ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ
మెల్‌బోర్న్: కొత్త ఏడాదిలోనూ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ డిఫెండింగ్ చాంపియన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-4, 6-1తో ఐదో సీడ్ మరియా షరపోవా (రష్యా)ను చిత్తుగా ఓడించింది. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 13 ఏస్‌లతో అదరగొట్టింది. తొలి సెట్‌లో ఒకసారి సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది.
ఇక రెండో సెట్‌లో సెరెనా రెండుసార్లు షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా షరపోవాతో 21 సార్లు తలపడిన సెరెనా 19 సార్లు గెలుపొందగా, అందులో 18 వరుస విజయాలున్నాయి. షరపోవా 2004 వింబుల్డన్ ఫైనల్లో, 2005 డబ్ల్యూటీఏ టూర్ చాంషియన్‌షిప్ ఫైనల్లో మాత్రమే సెరెనాపై గెలవగలిగింది. సెమీఫైనల్లో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో సెరెనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సెరెనా 8-0తో రద్వాన్‌స్కాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో రద్వాన్‌స్కా 6-1, 6-3తో పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్)పై అలవోకగా గెలిచింది.
సెమీస్‌లో ఫెడరర్‌తో జొకోవిచ్ ‘ఢీ’
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 6-4తో ఏడో సీడ్ కీ నిషికోరి (జపాన్)పై గెలుపొందగా... మూడో సీడ్ ఫెడరర్ 7-6 (7/4), 6-2, 6-4తో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్, జొకోవిచ్ 22-22తో సమఉజ్జీగా ఉన్నారు.
సానియాతో పేస్ అమీతుమీ
మిక్స్‌డ్ డబుల్స్‌లో ఇద్దరు భారత స్టార్స్ లియాండర్ పేస్, సానియా మీర్జాలు ప్రత్యర్థులుగా తలపడనున్నారు. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో జతకట్టిన సానియా... మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఆడుతున్న లియాండర్ పేస్ మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మూడో రౌండ్‌లో పేస్-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రోజర్ (నెదర్లాండ్స్)-స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) జంటపై గెలుపొందగా... టాప్ సీడ్ సానియా-డోడిగ్ జోడీ 7-5, 6-2తో ష్వెదోవా (కజకిస్తాన్)-ఐజామ్ ఉల్ ఖురేషీ (పాకిస్తాన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ 6-2, 4-6, 6-1తో అనాలెనా గ్రోనెఫెల్డ్ (జర్మనీ)-కోకో వాండెవాగె (అమెరికా)లపై విజయం సాధించింది.
డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల జంట
జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల భారత్‌కే చెందిన కర్మాన్‌కౌర్ థండితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో ఐదో సీడ్ ప్రాంజల-కర్మాన్ ద్వయం 6-4, 4-6, 10-2తో ‘సూపర్ టైబ్రేక్’లో సికి కావో-జియా రెన్ (చైనా) జంటపై గెలిచింది.