Australian Open tournament
-
వారెవ్వా థీమ్
పెద్దగా అంచనాలు లేవు... గ్రాండ్ స్లామ్ హార్డ్ కోర్టులపై గత రికార్డు చూసుకున్నా క్వార్టర్స్ దాటని ఆటతీరు... ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్లో అన్‌సీడెడ్ ఆటగాడు అలెక్స్ బోల్ట్‌పై ఐదు సెట్ల పాటు పోరాడి అతికష్టం మీద గెలుపు ఇలా చెమటోడుస్తూ సాగిన డొమినిక్ థీమ్ ఏ దశలోనూ టైటిల్ ఫేవరెట్‌గా కనబడలేదు. అయితే క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్‌ను ఓడించి అందరి కళ్లను తన వైపు తిప్పుకున్న అతను... తాజాగా సెమీస్ పోరులో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై నాలుగు సెట్లలో విజయం సాధించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచి వారెవ్వా అనిపించాడు. ఆదివారం జరిగే పురుషుల ఫైనల్లో నొవాక్ జొకోవిచ్‌తో అమీతుమీకి థీమ్ సిద్ధమయ్యాడు. మెల్బోర్న్: రాడ్ లేవర్ ఎరీనాలో కిక్కిరిసిన జనం మధ్య మరోసారి మూడు గంటలకు పైగా సాగిన పోరులో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ మరో అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో థీమ్ 3–6, 6–4, 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)ను చిత్తు చేశాడు. దాంతో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆ స్ట్రియా ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా థీమ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఎంట్రీ కావడం విశేషం. 2018, 2019లలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరి నాదల్ చేతిలో ఓడాడు. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్‌తో ఫైట్‌కు థీమ్ సిద్ధమయ్యాడు. తొలి సెట్‌ను కోల్పోయినా... 3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరును థీమ్ తడబడుతూ ఆరంభించాడు. తొలి సెట్ మొదటి గేమ్‌లోనే తన సర్వీస్‌ను కోల్పోయాడు. అయితే ఆ మరుసటి గేమ్‌లో ప్రత్యర్థి జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... అనంతరం తన గేమ్‌ను కాపాడుకోవడంతో 6–3తో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. ఇక రెండో సెట్లో దూకుడు కనబర్చిన 26 ఏళ్ల థీమ్ గ్రౌండ్ స్ట్రోక్ షాట్లతో జ్వెరెవ్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. అంతేకాకుండా అతడి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన థీమ్ 6–4తో సెట్‌ను సొంతం చేసుకోవడంతో... రెండు సెట్లు ముగిసే సరికి ఇరు ఆటగాళ్లు 1–1తో సమంగా నిలిచారు. కీలకమైన మూడో సెట్ టై బ్రేక్‌కు దారితీయగా... అక్కడ క్రాస్ కోర్టు, బ్యాక్ హ్యాండ్ షాట్లతో హోరెత్తించిన థీమ్... టై బ్రేక్‌ను సొంతం చేసుకొని తొలిసారి మ్యాచ్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచాడు. నాలుగో సెట్లో ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను 12 గేమ్‌ల పాటు నిలుపుకోవడంతో... సెట్ మరోసారి టై బ్రేక్‌కు దారితీసింది. ఇక్కడ వరుసగా మూడు అనవసర తప్పిదాలు చేసిన జ్వెరెవ్ మూడు పాయింట్లను ప్రత్యర్థికి కోల్పోయాడు. ఈ ఆధిక్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న థీమ్ ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో టై బ్రేక్‌ను గెలుచుకోవడంతో పాటు తుది పోరుకు అర్హత సాధించాడు. థీమ్ ఈ మ్యాచ్‌లో 10 ఏస్‌లు సంధించి... నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా... జ్వెరెవ్ 16 ఏస్‌లు కొట్టి మూడు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. మ్యాచ్ ఆసాంతం జ్వెరెవ్ 200 కి.మీ పైబడిన వేగంతో సర్వీస్ చేసినా... కీలక సమయంలో చేసిన అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను దూరం చేసుకున్నాడు. మహిళల డబుల్స్ విజేత మ్లదెనోవిచ్–బబోస్ జోడీ మహిళల డబుల్స్ విభాగంలో చాంపియన్స్‌గా రెండో సీడ్ క్రిస్టినా మ్లదెనోవిచ్ (ఫ్రాన్స్)– టిమియా బబోస్ (హంగేరీ) జోడీ నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మ్లదెనోవిచ్–బబోస్ జంట 6–2, 6–1తో టాప్ సీడ్ సు వి హెయ్ (చైనీస్ తైపీ)–బార్బోరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించింది. మ్లదెనోవిచ్–బబోస్ ద్వయానికి ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. నేడు మహిళల సింగిల్స్ ఫైనల్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)*సోఫియా కెనిన్ (అమెరికా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నాదల్‌దే పైచేయి
మెల్బోర్న్: మైదానం బయట తరచూ తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసే ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిరియోస్తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రాఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. 3 గంటల 38 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–3, 3–6, 7–6 (8/6), 7–6 (7/4)తో 23వ సీడ్ కిరియోస్‌ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాదల్ డజన్ ఏస్‌లు సంధించి 64 విన్నర్స్ కొట్టాడు. తాజా విజయంతో కిరియోస్తో ముఖాముఖి రికార్డులో నాదల్ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో థీమ్ 6–2, 6–4, 6–4తో పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై, ఏడోసీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 6–4తో 17వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, 15వ సీడ్, మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–2, 2–6, 4–6, 7–6 (7/2), 6–2తో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించారు. కెర్బర్ ఓటమి... మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ హలెప్ 6–4, 6–4తో మెర్టెన్స్ (బెల్జియం)పై.. ముగురుజా 6–3, 6–3తో తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై... పావ్లీచెంకోవా 6–7 (5/7), 7–6 (7/4), 6–2తో 2016 చాంపియన్ కెర్బర్ (జర్మనీ)పై... కొంటావీట్ 6–7 (4/7), 7–5, 7–5తో ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలుపొందారు. -
అయ్యో షరపోవా!
పూర్వ వైభవం కోసం తపిస్తున్న రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా కెరీర్ మళ్లీ గాడిన పడే అవకాశం కనిపించడంలేదు. ఆమె ప్రస్తుత ర్యాంక్ ప్రకారమైతే నేరుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ మెయిన్ ‘డ్రా’లో ఆడే అవకాశం లేకపోయినా... గత రికార్డును పరిగణనలోకి తీసుకొని నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ రూపంలో నేరుగా ఆడే అవకాశం ఇచ్చారు. కానీ ఈ మాజీ చాంపియన్, మాజీ ప్రపంచ నంబర్‌వన్ దీనిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. గతేడాది వింబుల్డన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టిన 32 ఏళ్ల షరపోవా ఆ్రస్టేలియన్ ఓపెన్‌లోనూ మొదటి రౌండ్‌ను దాటలేకపోయింది. ఫలితంగా కెరీర్లో తొలిసారి వరుసగా మూడు గ్రాండ్‌స్లామ్ టోరీ్నలలో తొలి రౌండ్లోనే ఓడిపోయి భవిష్యత్‌పై తుది నిర్ణయం తీసుకునే రోజు సమీపంలోనే ఉందని సంకేతాలు పంపించింది. మెల్బోర్న్: పదహారేళ్ల క్రితం టీనేజర్‌గా వింబుల్డన్ చాంపియన్‌గా అవతరించి మహిళల టెన్నిస్‌లో మెరుపుతీగలా దూసుకొచ్చిన రష్యా స్టార్ మరియా షరపోవా కెరీర్ తిరోగమనంలో పయనిస్తోంది. ‘వైల్డ్ కార్డు’తో ఆ్రస్టేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అడుగుపెట్టిన షరపోవా తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ప్రపంచ 20వ ర్యాంకర్ డోనా వెకిచ్ (క్రొయే షియా)తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 145వ ర్యాంకర్ షరపోవా 3–6, 4–6తో ఓడిపోయింది. 81 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో షరపోవా ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 31 అనవసర తప్పిదాలు చేసింది. 2008 ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్, 2007, 2012, 2015 రన్నరప్ అయిన షరపోవా తన సర్వీస్ ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్ ను రెండుసార్లు బ్రేక్ చేసింది. గతేడాది ఈ టోరీ్నలో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిన షరపోవా ఈసారి తొలి రౌండ్లోనే వెనుదిరగడంతో ఫిబ్రవరి 3న విడుదల చేసే ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె 350వ స్థానానికి పడిపోయే అవకాశముంది. రెండో రౌండ్లో ప్లిస్కోవా... మహిళల సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), నాలుగో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), ఐదో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్), ఆరో సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్), తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్), పదో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), మాజీ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ) రెండో రౌండ్లోకి ప్రవేశించారు. 12వ సీడ్ జొహనా కొంటా (బ్రిటన్) మాత్రం తొలి రౌండ్లో ఓడింది. ప్లిస్కోవా 6–1, 7–5తో మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)పై, హలెప్ 7–6, (7/5), 6–1తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై, స్వితోలినా 6–4, 7–5తో కేటీ బుల్టర్ (బ్రిటన్)పై, బెన్సిచ్ 6–3, 7–5తో ష్మెద్లోవా (స్లొవేకియా)పై, కికి బెర్టెన్స్ 6–1, 6–4తో ఇరీనా బేగూ (రొమేనియా)పై, కీస్ 6–3, 6–1తో కసత్కినా (రష్యా)పై, కెర్బర్ 6–2, 6–2తో కొకియారెటో (ఇటలీ)పై గెలిచారు. కొంటా 4–6, 2–6తో ఆన్స్ జెబెయుర్ (ట్యూనిíÙయా) చేతిలో ఓటమి పాలైంది. మెద్వదేవ్, థీమ్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో ఎలాంటి సంచలనాలు నమోదు కాలేదు. తొలి రౌండ్లో టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) 6–2, 6–3, 6–0తో డెలియన్ (బొలీవియా)పై అలవోకగా నెగ్గి రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 6–3, 4–6, 6–4, 6–2తో టియాఫో (అమెరికా)పై, ఐదో సీడ్ థీమ్ (ఆస్ట్రియా) 6–3, 7–5, 6–2తో మనారినో (ఫ్రాన్స్)పై, ఏడో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 7–6 (7/4), 6–3తో సెచినాటో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. 15వ సీడ్, 2014 చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), పదో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్), 11వ సీడ్ గాఫిన్ (బెల్జియం), 12వ సీడ్ ఫాగ్నిని (ఇటలీ) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ప్రజ్నేశ్‌కు నిరాశ ‘లక్కీ లూజర్’గా మెయిన్ ‘డ్రా’లో అడుగు పెట్టిన భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వరుసగా ఐదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ తొలి రౌండ్లో ఓడిపోయాడు. ప్రపంచ 144వ ర్యాంకర్ తత్సుమ ఇటో (జపాన్)తో జరిగిన తొలి రౌండ్లో ప్రపంచ 122వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 4–6, 2–6, 5–7తో ఓటమి పాలయ్యాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 90 వేల ఆ్రస్టేలియన్ డాలర్లు (రూ. 43 లక్షల 92 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
టైటిల్ పోరుకు హలెప్, వొజ్నియాకి
మెల్బోర్న్: ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్, రెండో సీడ్ వోజ్నియాకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ ఆరంభ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్‌లో వీరిద్దరిలో ఎవరు గెలిచినా కొత్త చాంపియన్‌గా అవతరిస్తారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ హలెప్ (రొమేనియా) 6–3, 4–6, 9–7తో మాజీ చాంపియన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై చెమటోడ్చి నెగ్గింది. మరో సెమీస్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) 6–3, 7–6 (7/2)తో ఎలీస్ మెర్టెన్స్ (బెల్జియం)ను ఓడించింది. పోరాడి ఓడిన కెర్బర్: ప్రపంచ 21వ ర్యాంకర్, 2016 చాంపియన్ కెర్బర్ తొలిసెట్లో తేలిగ్గానే తలొగ్గినా... తర్వాతి సెట్లలో కడదాకా పోరాడింది. ఒక దశలో టాప్ సీడ్ హలెప్ 6–3, 3–1 స్కోరుతో ఆధిక్యంలో ఉండటంతో వరుస సెట్లలోనే కెర్బర్‌కు ఓటమి ఖాయమనిపించింది. అయితే జర్మనీకి చెందిన ఈ మాజీ చాంపియన్ తన శక్తినంత కూడదీసుకొని రెండో సెట్‌ను చేజిక్కించుకుంది. ఇక నిర్ణాయక మూడో సెట్లో ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. దీంతో మరో మారథాన్ మ్యాచ్‌లా తలపించినా చివరకు నంబర్‌వన్ హలెప్ పవర్షాట్లతో సెట్‌ను, మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో సెమీఫైనల్లో వోజ్నియాకికి రెండో సెట్లో అన్‌సీడెడ్ మెర్టన్స్ గట్టి పోటీనిచ్చింది. దీంతో ఈ సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. ఇందులో రెండో సీడ్ వోజ్నియాకి తన అనుభవంతో ప్రత్యర్థిని సులభంగానే చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్‌లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా) తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సంపాదించాడు. సెమీఫైనల్లో ఆరో సీడ్ సిలిచ్ 6–2, 7–6 (7/4), 6–2తో కైల్ ఎడ్మండ్ (బ్రిటన్)ను ఓడించాడు. -
ముగురుజాకు షాక్
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపరకొనసాగుతోంది. టోర్నీ నాలుగో రోజు గురువారం టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారులురెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ గార్బిన్ ముగురుజా, తొమ్మిదో సీడ్ జొహనా కొంటా... పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్... తొమ్మిదో సీడ్, మాజీ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా రెండో రౌండ్లోనే ఓటమి చవిచూశారు. మెల్బోర్న్: కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన స్పెయిన్ స్టార్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజాకు నిరాశ ఎదురైంది. గతేడాది వింబుల్డన్ టైటిల్‌ను, 2016లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన ముగురుజా సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 88వ ర్యాంకర్, డబుల్స్ స్పెషలిస్ట్ సెయి సు వె (చైనీస్ తైపీ) అద్భుత ఆటతీరును ప్రదర్శించి 7–6 (7/1), 6–4తో ముగురుజాను బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా ఎండ వేడిమికి తట్టుకోలేక తొలి సెట్లో మెడికల్ టైమ్ అవుట్ కూడా తీసుకుంది. తొలి సెట్లో ఒకదశలో 2–5తో వెనుకబడిన ముగురుజా ఆ తర్వాత తేరుకొని స్కోరును 6–6తో సమం చేసింది. అయితే టైబ్రేక్‌లో సెయి సు వె పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్లో సెయి సు వె తన ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో బెర్నార్డా పెరా (అమెరికా) 6–4, 7–5తో తొమ్మిదో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)పై... నవోమి ఒసాకా (జపాన్) 7–6 (7/4), 6–2తో 16వ సీడ్ వెస్నినా (రష్యా)పై, మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) 6–1, 7–6 (7/4)తో 14వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)పై గెలుపొందారు. మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో హలెప్ 6–2, 6–2తో యుజిని బుషార్డ్ (కెనడా)పై, 21వ సీడ్ కెర్బర్ 6–4, 6–1తో వెకిచ్ (క్రొయేషియా)పై, ప్లిస్కోవా 6–1, 6–1తో హదాద్ మైయ (బ్రెజిల్)పై, గార్సియా 6–7 (3/7), 6–2, 8–6తో వండ్రూసోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించారు. ఫెడరర్ జోరు పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఫెడరర్ 6–4, 6–4, 7–6 (7/4)తో స్ట్రఫ్ (జర్మనీ)పై, జొకోవిచ్ 4–6, 6–3, 6–1, 6–3తో మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై, జ్వెరెవ్ 6–1, 6–3, 4–6, 6–3తో గొజోజిక్ (జర్మనీ)పై, థీమ్ 6–7 (6/8), 3–6, 6–3, 6–2, 6–3తో కుద్లా (అమెరికా)పై గెలుపొందారు. మరోవైపు 2014 చాంపియన్, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 2–6, 1–6, 4–6తో టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా) చేతిలో... ఏడో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–1, 6–7 (5/7), 1–6, 6–7 (4/7) బెనెట్యూ (ఫ్రాన్స్) చేతిలో... 13వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 4–6, 6–7 (6/8), 6–4, 2–6తో మార్టన్ ఫక్సోవిక్స్ (హంగేరి) చేతిలో అనూహ్యంగా ఓడిపోయారు. భారత ఆటగాళ్ల శుభారంభం పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులు లియాండర్ పేస్, రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ శుభారంభం చేశారు. తొలి రౌండ్లో పేస్–పురవ్ రాజా (భారత్) జంట 6–2, 6–3తో బాసిలాష్విలి (జార్జియా)–హైదర్ (ఆస్ట్రియా) జోడీపై... బోపన్న–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం 6–2, 7–6 (7/5)తో పోస్పిసిల్ (కెనడా)–హ్యారీసన్ (అమెరికా) జంటపై... దివిజ్–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–4తో ట్రయెస్కీ (సెర్బియా)–కోపిల్ (రొమేనియా) ద్వయంపై విజయం సాధించాయి. -
వొజ్నియాకి అద్భుతం
మెల్బోర్న్: ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన అతి కొద్ది క్రీడాకారిణుల్లో ఒకరైన కరోలిన్ వొజ్నియాకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 3–6, 6–2, 7–5తో ప్రపంచ 119వ ర్యాంకర్ జానా ఫెట్ (క్రొయేషియా)పై గెలుపొందింది. 2 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొజ్ని యాకి మూడో సెట్లో ఒకదశలో 1–5తో వెనుకబడింది. అంతేకాకుండా రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకుంది. ఈ దశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ డెన్మార్క్ భామ అనూహ్యంగా కోలుకుంది. వరుసగా ఆరు గేమ్‌లు సాధించి 7–5తో మూడో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన వొజ్నియాకి ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు జానా ఫెట్ 18 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 6–3, 3–6, 6–4తో యింగ్ యింగ్ దువాన్ (చైనా)పై, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 4–6, 6–2, 6–1తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. నాదల్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో నాదల్ 6–3, 6–4, 7–6 (7/4)తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై, దిమిత్రోవ్ 4–6, 6–2, 6–4, 0–6, 8–6తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, సిలిచ్ 6–1, 7–5, 6–2తో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో 15వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 3–6, 6–1, 1–6, 7–6 (7/4), 7–5తో షపోవలోవ్ (కెనడా)పై, 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7–5, 6–4, 7–6 (7/2)తో ట్రయెస్కీ (సెర్బియా)పై విజయం సాధించారు. కార్లోవిచ్ ఏస్‌ల వర్షం క్రొయేషియా ఆజానుబాహుడు ఇవో కార్లోవిచ్ మారథాన్ మ్యాచ్‌లో గట్టెక్కాడు. 38 ఏళ్ల కార్లోవిచ్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 7–6 (7/3), 6–7 (3/7), 7–5, 4–6, 12–10తో యుచి సుగిటా (జపాన్)పై గెలిచాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 53 ఏస్‌లు సంధించాడు. వరుసగా 15వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతోన్న కార్లోవిచ్ ఏనాడూ ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేదు. కోస్ట్యుక్ సంచలనం క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ఉక్రెయిన్‌కు చెందిన 15 ఏళ్ల మార్టా కోస్ట్యుక్ తన విజయాల పరంపర కొనసాగిస్తోంది. రెండో రౌండ్లో కోస్ట్యుక్ 6–3, 7–5తో రోగోవ్స్కా (ఆస్ట్రేలియా)ను ఓడించింది. ఈ క్రమంలో ఆమె స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ (1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకున్న పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. -
ఫెడరర్ ఫటాఫట్
సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్విస్ స్టార్ క్వార్టర్స్‌లో మిషా జ్వెరెవ్‌పై 92 నిమిషాల్లో గెలుపు వావ్రింకాతో రేపు సెమీస్ పోరు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ 35 ఏళ్లు దాటినా... ఫిట్నెస్ సమస్యలతో సతమతమవుతున్నా... కొత్త ప్రతిభ తెరపైకి దూసుకొస్తున్నా... తనలో ఇంకా ఏమాత్రం సత్తా తగ్గలేదని స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మరోసారి నిరూపించాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న ఫెడరర్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో పునరాగమనం చేశాడు. క్వార్టర్ ఫైనల్లో మిషా జ్వెరెవ్‌పై వరుస సెట్లలో అలవోకగా నెగ్గిన ఈ స్విస్ స్టార్ సెమీస్ బెర్త్‌ను దక్కించుకున్నాడు. కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోయినా ఈ టోర్నీలో అతని ఆటతీరు మునుపటి ఫెడరర్‌ను గుర్తుకు తెస్తోంది. ఈ గెలుపుతో 35 ఏళ్ల ఫెడరర్ 1978లో ఆర్థర్ యాష్ (అమెరికా) తర్వాత ఈ టోర్నీలో సెమీస్‌కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. మెల్బోర్న్: ఎలాంటి సంచలనం జరగలేదు. ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు. ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)ను బోల్తా కొట్టించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 29 ఏళ్ల మిషా జ్వెరెవ్ (జర్మనీ) అడ్డంకిని రోజర్ ఫెడరర్ అలవోకగా అధిగమించాడు. మంగళవారం ఏకపక్షంగా జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ ఫెడరర్ గంటా 32 నిమిషాల్లో 6–1, 7–5, 6–2తో ప్రపంచ 50వ ర్యాంకర్ మిషా జ్వెరెవ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో ఫెడరర్ తలపడతాడు. వరుసగా 18వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న ఫెడరర్ ఈ టోర్నీలో 13వసారి సెమీస్‌కు... ఓవరాల్‌గా 41వ సారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ క్రమంలో ఫెడరర్ 1978లో ఆర్థర్ యాష్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో... జిమ్మీ కానర్స్ తర్వాత (1991 యూఎస్ ఓపెన్‌లో 39 ఏళ్ల వయస్సులో) ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు. ఆద్యంతం ఆధిపత్యం... ప్రిక్వార్టర్స్‌లో ఆండీ ముర్రేను ఓడించిన మిషా జ్వెరెవ్‌ను ఫెడరర్ ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. చివరిసారి 2013 హాలె టోర్నీలో మిషాతో ఆడిన మ్యాచ్‌లో ఫెడరర్ 6–0, 6–0తో గెలుపొందగా... అదే జోరును ఇక్కడా కనబరిచాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ఫెడరర్ తొలి సెట్‌ను కేవలం 19 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. ముర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 118 సార్లు నెట్ వద్దకు దూసుకొచ్చిన మిషా అదే వ్యూహాన్ని ఫెడరర్‌పై అమలు చేయాలని చూశాడు. కానీ అపార అనుభవజ్ఞుడైన ఫెడరర్ ముందు ఈ జర్మనీ ప్లేయర్ ఆటలు సాగలేదు. రెండో సెట్లో కాస్త పోటీనిచ్చిన మిషా సర్వీస్‌ను 11వ గేమ్‌లో బ్రేక్ చేసిన ఫెడరర్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని రెండో సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్లోనూ ఫెడరర్ ఆటలో ఏమాత్రం మార్పు రాలేదు. మిషా కూడా దూకుడుగా ఆడటంతో చాలా ర్యాలీలు తొమ్మిది షాట్లలోపే ముగిశాయి. ఈ సెట్లో రెండుసార్లు మిషా సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఫెడరర్ తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ఒక్క డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశాడు. 32 సార్లు నెట్ వద్దకు వచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. 65 విన్నర్స్ కొట్టిన ఫెడరర్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. వావ్రింకా మూడోసారి... మరో క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా 2 గంటల 14 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–3తో 12వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్)ను ఓడించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్‌కు చేరాడు. 2014లో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన వావ్రింకాకు ఈ మ్యాచ్‌లో తొలి సెట్ మినహా మిగత రెండు సెట్లలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి సెట్లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఈ స్విస్ స్టార్ పైచేయి సాధించాడు. ఆ తర్వాతి రెండు సెట్లలో సోంగా డీలా పడిపోయాడు. సూపర్ కోకో... ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీలో బరిలోకి దిగిన కోకో వాండెవె తన ఖాతాలో మరో సంచలన ఫలితాన్ని జమ చేసుకుంది. ఏడో సీడ్, ప్రస్తుత ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్)తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో కోకో 6–4, 6–0తో అనూహ్య విజయం సాధించింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేయడంతోపాటు ముగురుజాకు ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రిక్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)ను మట్టికరిపించిన కోకో తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గతంలో ఐదుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడిన కోకో ఏనాడూ మూడో రౌండ్ దాటి ముందుకెళ్లలేదు. సానియాతో బోపన్న అమీతుమీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సెమీఫైనల్ బెర్త్ కోసం రోహన్ బోపన్న (భారత్)–గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంటతో సానియా మీర్జా (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా) జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో రెండో సీడ్ సానియా–డోడిగ్ జంట 2–6, 6–3, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో సాయ్‌సాయ్ జెంగ్ (చైనా)–అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రియా) ద్వయంపై గెలుపొందగా... బోపన్న–దబ్రౌస్కీ జోడీ 6–4, 5–7, 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ఐదో సీడ్ యుంగ్ జాన్ చాన్ (చైనీస్ తైపీ)–లుకాజ్ కుబోట్ (పోలండ్) జంటపై సంచలన విజయం సాధించింది. వీనస్ ‘రికార్డు’... మహిళల సింగిల్స్ విభాగంలో అమెరికా వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ విజయపరంపర కొనసాగుతోంది. 2003 తర్వాత తొలిసారి ఆమె ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ వీనస్ 6–4, 7–6 (7/3)తో 24వ సీడ్ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వా రా ఓపెన్ శకం మొదలయ్యాక (1968 నుంచి) ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా వీనస్ (36 ఏళ్ల 221 రోజులు) రికార్డు సృష్టించింది. అంతేకాకుండా 1994లో మార్టినా నవత్రిలోవా (వింబుల్డన్‌లో–37 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా వీనస్ గుర్తింపు పొందింది. సెమీఫైనల్లో అమెరికాకే చెందిన అన్‌సీడెడ్ క్రీడాకారిణి కోకో వాండెవెతో వీనస్ తలపడుతుంది. నేటి ముఖ్య మ్యాచ్‌లు (క్వార్టర్ ఫైనల్స్) ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) మిర్యానా లూసిచ్ (క్రొయేషియా) సెరెనా విలియమ్స్ (అమెరికా) జొహనా కొంటా (బ్రిటన్) గాఫిన్ (బెల్జియం) దిమిత్రోవ్ (బల్గేరియా) రాఫెల్ నాదల్ (స్పెయిన్) మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) ఉదయం గం. 5.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
సెరెనా జోరు...
క్వార్టర్ ఫైనల్లో అమెరికన్ స్టార్ మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌పై గురి ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్తోపాటు ఇతర సీడెడ్ క్రీడాకారిణులు నిష్క్రమించడంతో... ఈ అవకాశాన్ని అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ పూర్తిస్థాయిలోసద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రత్యర్థులను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆడుతూ, ఒక్కో అడ్డంకినిఅధిగమిస్తూ, తన లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో బార్బరా స్ట్రికోవాపై నెగ్గి క్వార్టర్ ఫైనల్‌కు చేరిన సెరెనా... ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్ అందుకోవడంతోపాటు ఓపెన్ శకంలో అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్స్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. మెల్బోర్న్: ఒకవైపు సీడెడ్ క్రీడాకారిణులు ఒక్కొక్కరు ఇంటిదారి పడుతుంటే... మరోవైపు సెరెనా విలియమ్స్ మాత్రం పూర్తి విశ్వా సంతో ఆడుతూ తన జోరు కొనసాగిస్తోంది. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ అమెరికన్ స్టార్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సెరెనా 7–5, 6–4తో 16వ సీడ్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. ఈ గెలుపుతో సెరెనా వరుసగా పదో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశకు చేరడం విశేషం. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనాకు గట్టిపోటీనే లభించింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన ఈ మాజీ చాంపియన్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేయగలిగింది. 46 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా కీలక దశల్లో పైచేయి సాధించింది. నెట్ వద్దకు 24 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ టాప్ ర్యాంకర్ 28 విన్నర్స్ సంధించింది. క్వార్టర్ ఫైనల్లో తొమ్మిదో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)తో సెరెనా ఆడుతుంది. ‘ఈ టోర్నీతో నేను కొత్తగా సాధించేది ఏమీ లేదు. ఇక్కడ వచ్చే ఫలితం నాకు బోనస్ లాంటిదే. విజయం సాధించేందుకు ఇక్కడకు వచ్చాను. మున్ముందు మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా ఆడతాననే నమ్మకం ఉంది’ అని సెరెనా వ్యాఖ్యానించింది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఐదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–3, 6–3తో 22వ సీడ్ దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)పై, జొహనా కొంటా 6–1, 6–4తో 30వ సీడ్ మకరోవా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 20 ఏళ్లకు: మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన 34 ఏళ్ల మిర్యానా లూసిచ్ బరోని 6–4, 6–2తో జెన్నిఫర్ బ్రాడీ (అమెరికా)పై గెలిచింది. తద్వారా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మొదటిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 1997లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆడిన మిర్యానా 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకోవడం విశేషం. 1999లో వింబుల్డన్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన మిర్యానా కెరీర్ వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా తడబడింది. 2003 నుంచి 2009 వరకు ఆమె ఏ గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనూ ఆడలేకపోయింది. 2010 నుంచి ఇప్పటివరకు 25 గ్రాండ్‌స్లామ్ టోర్నీలు ఆడిన మిర్యానా ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటుకుంది. నాదల్, రావ్‌నిచ్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ రావ్‌నిచ్ (కెనడా), తొమ్మిదో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), 15వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), 11వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం) క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో రావ్‌నిచ్ 7–6 (8/6), 3–6, 6–4, 6–1తో 13వ సీడ్ అగుట్ (స్పెయిన్)పై గెలుపొందగా... గాఫిన్ 5–7, 7–6 (7/4), 6–2, 6–2తో ఎనిమిదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఇంటిముఖం పట్టించాడు. మాజీ చాంపియన్ నాదల్ 2 గంటల 55 నిమిషాల పోరులో 6–3, 6–3, 4–6, 6–4తో ఆరో సీడ్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై నెగ్గగా... దిమిత్రోవ్ 2–6, 7–6 (7/2), 6–2, 6–1తో ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్)ను ఓడించాడు. క్వార్టర్స్‌లో పేస్–హింగిస్ జంట మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)–మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్లో పేస్–హింగిస్ ద్వయం 6–2, 6–3తో మాట్ రీడ్–కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. జూనియర్ బాలికల సింగిల్స్ విభాగంలో జీల్ దేశాయ్ (భారత్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్లో జీల్ 6–4, 6–2తో జూల్ నిమియెర్ (జర్మనీ)పై గెలిచింది. నేటి ముఖ్య మ్యాచ్‌లు (క్వార్టర్ ఫైనల్స్) వీనస్ విలియమ్స్ (అమెరికా) పావ్లీచెంకోవా (రష్యా) ముగురుజా (స్పెయిన్) కోకో వాండెవె (అమెరికా) వావ్రింకా (స్విట్జర్లాండ్) సోంగా (ఫ్రాన్స్) ఫెడరర్ (స్విట్జర్లాండ్) మిషా జ్వెరెవ్ (జర్మనీ) -
కెర్బర్... మళ్లీ కష్టంగా!
శ్రమించి నెగ్గిన టాప్ సీడ్ మూడో రౌండ్లో ఫెడరర్, ముర్రే ఏడో సీడ్ సిలిచ్‌కు చుక్కెదురు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: నంబర్‌వన్ ర్యాంక్‌తోపాటు టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగిన టాప్ సీడ్ ఎంజెలిక్ కెర్బర్‌కు మళ్లీ గట్టిపోటీ లభించింది. మహిళల సింగిల్స్ విభాగంలో ఈ జర్మనీ స్టార్ రెండో రౌండ్లోనూ మూడు సెట్ల పోరులో గట్టెక్కింది. బుధవారం తన 29వ జన్మదినాన్ని జరుపుకున్న కెర్బర్ రెండో రౌండ్లో 6–2, 6–7 (3/7), 6–2తో కరీనా వితోయెఫ్ట్ (జర్మనీ)పై గెలుపొందింది. రెండు గంటల ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కెర్బర్ ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 34 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ ప్లేయర్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేయగలిగింది. గతంలో కెర్బర్తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 0–6, 0–6తో ఓడిపోయి ఒక్క గేమ్ కూడా నెగ్గలేకపోయిన వితోయెఫ్ట్ ఈసారి మాత్రం 11 గేమ్‌లు సాధించడం విశేషం. ‘తొలిసారి టాప్ సీడ్ హోదాలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్నాను. ఈ ఒత్తిడిని గౌరవంగా భావిస్తున్నాను. ఈ క్షణాలను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని కెర్బర్ వ్యాఖ్యానించింది. పదో సీడ్ నవారో ఓటమి మూడో రోజు మహిళల సింగిల్స్ విభాగంలో మూడు అనూహ్య ఫలితాలు వచ్చాయి. పదో సీడ్ కార్లా సురెజ్ నవారో (స్పెయిన్), రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత, 29వ సీడ్ మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో), 20వ సీడ్ షుయె జాంగ్ (చైనా) రెండో రౌండ్లోనే నిష్క్రమించారు. క్రిస్టియా (రొమేనియా) 7–6 (7/1), 6–3తో నవారోపై, అలీసన్ రిస్కీ (అమెరికా) 7–6 (9/7), 4–6, 6–1తో షుయె జాంగ్‌పై, మోనా బార్తెల్ (జర్మనీ) 6–4, 6–4తో మోనికా పుయిగ్పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో 13వ సీడ్ వీనస్ (అమెరికా) 6–3, 6–2తో వొగెలె (స్విట్జర్లాండ్)పై, ఏడో సీగ్ ముగురుజా (స్పెయిన్) 7–5, 6–4తో క్రాఫోర్డ్ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్ కుజ్నెత్సోవా (రష్యా) 6–2, 6–1 తో ఫుర్లీస్ (ఆస్ట్రేలియా)పై, 11వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో బొసెరప్ (అమెరికా)పై నెగ్గారు. వావ్రింకా అలవోకగా... పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్), నాలుగో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఐదో సీడ్ నిషికోరి (జపాన్), మాజీ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) వరుస సెట్లలో తమ ప్రత్యర్థులను ఓడించి మూడో రౌండ్లోకి చేరుకున్నారు. ముర్రే 6–3, 6–0, 6–2తో రుబ్లెవ్ (రష్యా)పై, ఫెడరర్ 7–5, 6–3, 7–6 (7/3)తో నోవా రూబిన్ (అమెరికా)పై, వావ్రింకా 6–3, 6–4, 6–4తో జాన్సన్ (అమెరికా)పై, నిషికోరి 6–3, 6–4, 6–3తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్)పై గెలిచారు. పదో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ సోంగా (ఫ్రాన్స్) కూడా మూడో రౌండ్లోకి చేరారు. ఇస్నెర్కు షాక్ మరోవైపు ఏడో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా), 19వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. 4 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 108 కేజీల బరువున్న జాన్ ఇస్నెర్ 7–6 (7/4), 7–6 (7/4), 4–6, 6–7 (7/9), 7–9తో మిషా జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. అన్‌సీడెడ్ డానియల్ ఇవాన్స్ (బ్రిటన్) 3–6, 7–5, 6–3, 6–3తో సిలిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు. -
షరపోవా 18వ‘సారీ’...
అదే ప్రత్యర్థి. అదే ఫలితం. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు... ఏకంగా 18వసారి రష్యా స్టార్ మరియా షరపోవాకు సెరెనా విలియమ్స్ చేతిలో ఓటమి ఎదురైంది. అప్పుడెప్పుడో 2004లో డబ్ల్యూటీఏ టూర్ చాంపియన్‌షిప్‌లో చివరిసారి సెరెనాను ఓడించిన షరపోవా మళ్లీ ఈ అమెరికా నల్లకలువపై విజయం రుచి చూడలేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్లోనే సెరెనా చేతిలో షరపోవా ఓడిపోవడం ఇది నాలుగోసారి. గతంలో ఈ టోర్నీలో రెండుసార్లు ఫైనల్లో, ఒకసారి సెమీస్‌లో సెరెనా చేతిలో ఓడిన షరపోవా ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్లోనే చేతులెత్తేసింది. సెరెనా చేతిలో మళ్లీ ఓడిన రష్యా స్టార్ * ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: కొత్త ఏడాదిలోనూ అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ తన జోరు కొనసాగిస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ డిఫెండింగ్ చాంపియన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సెరెనా 6-4, 6-1తో ఐదో సీడ్ మరియా షరపోవా (రష్యా)ను చిత్తుగా ఓడించింది. గంటా 32 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 13 ఏస్‌లతో అదరగొట్టింది. తొలి సెట్లో ఒకసారి సెరెనా సర్వీస్‌ను బ్రేక్ చేసిన షరపోవా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయింది. ఇక రెండో సెట్లో సెరెనా రెండుసార్లు షరపోవా సర్వీస్‌ను బ్రేక్ చేసి విజయాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా షరపోవాతో 21 సార్లు తలపడిన సెరెనా 19 సార్లు గెలుపొందగా, అందులో 18 వరుస విజయాలున్నాయి. షరపోవా 2004 వింబుల్డన్ ఫైనల్లో, 2005 డబ్ల్యూటీఏ టూర్ చాంషియన్షిప్ ఫైనల్లో మాత్రమే సెరెనాపై గెలవగలిగింది. సెమీఫైనల్లో నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్)తో సెరెనా తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సెరెనా 8-0తో రద్వాన్స్కాపై ఆధిక్యంలో ఉండటం విశేషం. మరో క్వార్టర్ ఫైనల్లో రద్వాన్‌స్కా 6-1, 6-3తో పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్)పై అలవోకగా గెలిచింది. సెమీస్‌లో ఫెడరర్‌తో జొకోవిచ్ ‘ఢీ’ పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), మాజీ చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) సెమీఫైనల్లో అమీతుమీకి సిద్ధమయ్యారు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ 6-3, 6-2, 6-4తో ఏడో సీడ్ కీ నిషికోరి (జపాన్)పై గెలుపొందగా... మూడో సీడ్ ఫెడరర్ 7-6 (7/4), 6-2, 6-4తో ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించాడు. ముఖాముఖి రికార్డులో ఫెడరర్, జొకోవిచ్ 22-22తో సమఉజ్జీగా ఉన్నారు. సానియాతో పేస్ అమీతుమీ మిక్స్డ్ డబుల్స్‌లో ఇద్దరు భారత స్టార్స్ లియాండర్ పేస్, సానియా మీర్జాలు ప్రత్యర్థులుగా తలపడనున్నారు. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)తో జతకట్టిన సానియా... మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ఆడుతున్న లియాండర్ పేస్ మిక్స్డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. మంగళవారం జరిగిన మూడో రౌండ్లో పేస్-హింగిస్ ద్వయం 6-1, 6-2తో రోజర్ (నెదర్లాండ్స్)-స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా) జంటపై గెలుపొందగా... టాప్ సీడ్ సానియా-డోడిగ్ జోడీ 7-5, 6-2తో ష్వెదోవా (కజకిస్తాన్)-ఐజామ్ ఉల్ ఖురేషీ (పాకిస్తాన్) జంటను ఓడించింది. మహిళల డబుల్స్‌లో టాప్ సీడ్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ జంట సెమీఫైనల్‌కు చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో సానియా-హింగిస్ 6-2, 4-6, 6-1తో అనాలెనా గ్రోనెఫెల్డ్ (జర్మనీ)-కోకో వాండెవాగె (అమెరికా)లపై విజయం సాధించింది. డబుల్స్ క్వార్టర్స్‌లో ప్రాంజల జంట జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల భారత్‌కే చెందిన కర్మాన్‌కౌర్ థండితో కలిసి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో ఐదో సీడ్ ప్రాంజల-కర్మాన్ ద్వయం 6-4, 4-6, 10-2తో ‘సూపర్ టైబ్రేక్’లో సికి కావో-జియా రెన్ (చైనా) జంటపై గెలిచింది. -
క్విటోవాకు చుక్కెదురు
► రెండో రౌండ్లో ఓడిన ఆరో సీడ్ ► గావ్రిలోవా సంచలనం ► ‘ఏస్’ల్లో క్రిస్టినా రికార్డు ► ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఆరో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) రెండో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రష్యా సంతతికి చెందిన ఆస్ట్రేలియా యువతార దరియా గావ్రిలోవా అద్భుత ఆటతీరుతో ‘రెండుసార్లు వింబుల్డన్ చాంపియన్’గా నిలిచిన క్విటోవాను బోల్తా కొట్టించింది. 89 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో గావ్రిలోవా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయినా... క్విటోవా సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి అనుకున్న ఫలితం సాధించింది. మరోవైపు క్విటోవా ఏడు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 35 అవనసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. క్విటోవా ఓటమితో ప్రస్తుతం టాప్-32 సీడింగ్ క్రీడాకారిణుల్లో 18 మంది మాత్రమే మిగిలారు. సెరెనా, షరపోవా ముందంజ మరోవైపు టాప్ సీడ్ సెరెనా విలియమ్స్ (అమెరికా), ఐదో సీడ్ షరపోవా, నాలుగో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) అలవోక విజయాలతో మూడో రౌండ్లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సెరెనా 6-1, 6-2తో సు వీ సెయి (చైనీస్ తైపీ)పై, షరపోవా 6-2, 6-1తో సస్నోవిచ్ (బెలారస్)పై, రద్వాన్‌స్కా 6-4, 6-2తో యుజిని బుచార్డ్ (కెనడా)పై గెలిచారు ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) 6-7 (5/7), 6-2, 6-2తో మరియా సకరి (గ్రీస్)పై, 12వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6-3, 6-3తో తిమియా బాబోస్ (హంగేరి)పై, 13వ సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) 6-2, 6-3తో ఫాల్కోని (అమెరికా)పై నెగ్గి మూడో రౌండ్లోకి ప్రవేశించారు. ఫెడరర్, జొకోవిచ్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా), మూడో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), ఏడో సీడ్ నిషికోరి (జపాన్), తొమ్మిదో సీడ్ సోంగా (ఫ్రాన్స్) మూడో రౌండ్లోకి అడుగుపెట్టారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో జొకోవిచ్ 6-1, 6-2, 7-6 (7/3)తో హేల్స్ (ఫ్రాన్స్)పై, ఫెడరర్ 6-3, 7-5, 6-1తో అలెగ్జాండర్ డల్గొపలోవ్ (ఉక్రెయిన్)పై, బెర్డిచ్ 6-4, 6-0, 6-3తో మీర్జా బేసిక్ (బోస్నియా అండ్ హెర్జెగోవినా)పై, నిషికోరి 6-3, 7-6 (7/5), 6-3తో ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా)పై గెలిచారు. పేస్ జంటకు షాక్ పురుషుల డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-జెరెమి చార్డీ (ఫ్రాన్స్) జంటకు తొలి రౌండ్లోనే ఓటమి ఎదురైంది. పేస్-చార్డీ జోడీ 3-6, 4-6తో 12వ సీడ్ రాబర్ట్ ఫరా-కబాల్ (కొలంబియా) జంట చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో మహేశ్ భూపతి (భారత్)-గైల్స్ ముల్లర్ (లక్సెంబర్గ్) ద్వయం 7-6 (7/4), 3-6, 6-4తో అలెక్స్ బోల్ట్-విటింగ్టన్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించింది. రికార్డు చేసినా తప్పని ఓటమి మోనికా పుయిగ్ (ప్యూర్టోరికో), క్రిస్టినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ‘ఏస్’ల్లో కొత్త రికార్డు నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ఒకే మ్యాచ్‌లో అత్యధిక ‘ఏస్’లు సంధించిన రికార్డును క్రిస్టినా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో క్రిస్టినా 31 ఏస్‌లు కొట్టింది. గతంలో ఈ రికార్డు లిసికి (జర్మనీ-27 ఏస్‌లు) పేరిట ఉండేది. అయితే క్రిస్టినా మాత్రం విజయాన్ని దక్కించుకోలేకపోయింది. -
జొకోవిచ్ పాంచ్ పటాకా
-
జొకోవిచ్ పాంచ్ పటాకా
మెల్ బోర్న్:ఆస్ట్రేలియా ఓపెన్ లో నిలకడగా ఆడుతూ, అంచనాలను నిజం చేస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) మరోసారి టైటిల్ ను కైవశం చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-5), 6-7(4-7),6-3, 6-0 తేడాతో బ్రిటన్ స్టార్ ఆటగాడు ఆండీ ముర్రేను మట్టికరిపించి ఐదో సారి టైటిల్ ను ఎగురేసుకుపోయాడు. ఈ టోర్నీలో ఆద్యంతం ఆకట్టుకున్న జొకోవిచ్.. ఫైనల్లో ముర్రే నుంచి తీవ్ర ప్రతి ఘటనను ఎదుర్కొన్నాడు. తొలి సెట్ ట్రై బ్రేక్ దారి తీసినా.. జొకోవిచ్ తన అనుభవాన్ని ఉపయోగించి ఆ సెట్ ను కైవశం చేసుకుని ముందంజ వేశాడు. అయితే రెండో సెట్ ను ముర్రే గెలుచుకుని జొకోవిచ్ కు సవాల్ విసిరాడు. ఇక మూడు, నాల్గో సెట్లను అవలీలగా గెలుచుకున్న జొకోవిచ్ ఐదో సారి టైటిల్ ను చేజిక్కించుకున్నాడు. ఇంతకుముందు 2008, 2011,2012, 2013 సంవత్సరాల్లో జొకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ ను దక్కించుకున్న సంగతి తెలిసిందే. -
‘ఐదు’కు గెలుపు దూరంలో...
ఫైనల్లో జొకోవిచ్ సెమీస్‌లో వావ్రింకాపై గెలుపు ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: మాజీ చాంపియన్స్ రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ నిష్ర్కమించిన చోట... నిలకడగా ఆడుతూ, అంచనాలను నిజం చేస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫైనల్‌కు చేరిన నాలుగుసార్లూ (2008, 2011, 2012, 2013లో) విజేతగా నిలిచిన జొకోవిచ్ ఐదో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడుసార్లు రన్నరప్, ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకుంటాడు. డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో శుక్రవారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో జొకోవిచ్ 7-6 (7/1), 3-6, 6-4, 4-6, 6-0తో అద్భుత విజయం సాధించాడు. గత ఏడాది ఇదే టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు. 3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో ఈ సెర్బియా స్టార్‌కు గట్టిపోటీనే లభించింది. అయితే కీలకదశలో సాధించిన పాయింట్ల ఆధారంగా జొకోవిచ్‌ను విజయం వరించింది. ఐదు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు వావ్రింకా నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 69 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి నాలుగు సెట్లు నువ్వా నేనా అన్నట్లు సాగినా... నిర్ణాయక ఐదో సెట్లో మాత్రం జొకోవిచ్ వావ్రింకా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి అతనికి ఒక్క గేమ్ కూడా నెగ్గే అవకాశం ఇవ్వకపోవడం విశేషం. బెథానీ-సఫరోవా జంటకు డబుల్స్ టైటిల్ మహిళల డబుల్స్ విభాగంలో తొలిసారి జతకట్టిన బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో బెథానీ-సఫరోవా ద్వయం 6-4, 7-6 (7/5)తో చాన్ యుంగ్ జాన్ (చైనీస్ తైపీ)-జెంగ్ జీ (చైనా) జోడీపై గెలిచింది. 2007లో నథాలీ డెచీ (ఫ్రాన్స్)-దినారా సఫీనా (రష్యా) జోడీ తర్వాత... తొలిసారి జతకట్టి బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే టైటిల్ సాధించిన జంటగా బెథానీ-సఫరోవా గుర్తింపు పొందింది. ‘మిక్స్డ్’ ఫైనల్లో పేస్-హింగిస్ జోడీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫైనల్లోకి చేరింది. సెమీస్‌లో పేస్-హింగిస్ ద్వయం 7-5, 6-4తో సు వి సెయి (చైనీస్ తైపీ)-పాబ్లో క్యూవాస్ (ఉరుగ్వే) జంటను ఓడించింది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 6-3, 2-6, 8-10తో డానియల్ నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓటమి పాలైంది. -
యూకీ X ముర్రే
ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ మెల్బోర్న్: కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ సింగిల్స్ విభాగంలో అర్హత సాధించిన భారత టెన్నిస్ యువతార యూకీ బాంబ్రీకి అత్యంత కఠినమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. సోమవారం మొదలయ్యే సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఈ ఢిల్లీ ప్లేయర్ తొలి రౌండ్లో ప్రపంచ ఆరో ర్యాంకర్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో తలపడనున్నాడు. క్వాలిఫయింగ్ పోటీల ద్వారా 22 ఏళ్ల యూకీ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. శనివారం జరి గిన క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో యూకీ 6-3, 6-4తో చేజ్ బుకానన్ (అమెరికా)పై గెలిచాడు. గతేడాది డబుల్స్ విభాగంలో పోటీపడిన యూకీ మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. సింగిల్స్ విభాగంలో ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడటం యూకీకిదే ప్రథమం. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 314వ స్థానంలో ఉన్న యూకీ మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందినందుకు 16 వేల ఆస్ట్రేలియన్ డాలర్ల (రూ. 8 లక్షల 10 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 25 ర్యాంకింగ్ పాయింట్లు లభిం చాయి. యూకీ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లోనే ఓడిపోతే 34,500 డాలర్ల (రూ. 17 లక్షల 48 వేలు) ప్రైజ్‌మనీ, 10 ర్యాంకింగ్ పాయింట్లు లభిస్తాయి.