‘ఐదు’కు గెలుపు దూరంలో...
ఫైనల్లో జొకోవిచ్
సెమీస్‌లో వావ్రింకాపై గెలుపు
ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీ
మెల్‌బోర్న్: మాజీ చాంపియన్స్ రోజర్ ఫెడరర్, రాఫెల్ నాదల్ నిష్ర్కమించిన చోట... నిలకడగా ఆడుతూ, అంచనాలను నిజం చేస్తూ ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఐదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గతంలో ఫైనల్‌కు చేరిన నాలుగుసార్లూ (2008, 2011, 2012, 2013లో) విజేతగా నిలిచిన జొకోవిచ్ ఐదో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌కు మరో విజయం దూరంలో నిలిచాడు. ఆదివారం జరిగే ఫైనల్లో మూడుసార్లు రన్నరప్, ఆరో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్)తో జొకోవిచ్ అమీతుమీ తేల్చుకుంటాడు. డిఫెండింగ్ చాంపియన్, నాలుగో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్)తో శుక్రవారం జరిగిన హోరాహోరీ సెమీఫైనల్లో జొకోవిచ్ 7-6 (7/1), 3-6, 6-4, 4-6, 6-0తో అద్భుత విజయం సాధించాడు. గత ఏడాది ఇదే టోర్నీలో క్వార్టర్ ఫైనల్లో వావ్రింకా చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాడు.
3 గంటల 30 నిమిషాలపాటు జరిగిన సెమీస్‌లో ఈ సెర్బియా స్టార్‌కు గట్టిపోటీనే లభించింది. అయితే కీలకదశలో సాధించిన పాయింట్ల ఆధారంగా జొకోవిచ్‌ను విజయం వరించింది. ఐదు ఏస్‌లు సంధించిన జొకోవిచ్ ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు వావ్రింకా నాలుగు డబుల్ ఫాల్ట్‌లు, 69 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి నాలుగు సెట్‌లు నువ్వా నేనా అన్నట్లు సాగినా... నిర్ణాయక ఐదో సెట్‌లో మాత్రం జొకోవిచ్ వావ్రింకా సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి అతనికి ఒక్క గేమ్ కూడా నెగ్గే అవకాశం ఇవ్వకపోవడం విశేషం.
బెథానీ-సఫరోవా జంటకు డబుల్స్ టైటిల్
మహిళల డబుల్స్ విభాగంలో తొలిసారి జతకట్టిన బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)-లూసీ సఫరోవా (చెక్ రిపబ్లిక్) జంట విజేతగా నిలిచింది. ఫైనల్లో బెథానీ-సఫరోవా ద్వయం 6-4, 7-6 (7/5)తో చాన్ యుంగ్ జాన్ (చైనీస్ తైపీ)-జెంగ్ జీ (చైనా) జోడీపై గెలిచింది. 2007లో నథాలీ డెచీ (ఫ్రాన్స్)-దినారా సఫీనా (రష్యా) జోడీ తర్వాత... తొలిసారి జతకట్టి బరిలోకి దిగిన తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలోనే టైటిల్ సాధించిన జంటగా బెథానీ-సఫరోవా గుర్తింపు పొందింది.
‘మిక్స్‌డ్’ ఫైనల్లో పేస్-హింగిస్ జోడీ
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో లియాండర్ పేస్ (భారత్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట ఫైనల్లోకి చేరింది. సెమీస్‌లో పేస్-హింగిస్ ద్వయం 7-5, 6-4తో సు వి సెయి (చైనీస్ తైపీ)-పాబ్లో క్యూవాస్ (ఉరుగ్వే) జంటను ఓడించింది. మరో సెమీఫైనల్లో టాప్ సీడ్ సానియా మీర్జా (భారత్)-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 6-3, 2-6, 8-10తో డానియల్ నెస్టర్ (కెనడా)-క్రిస్టినా మ్లడెనోవిచ్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓటమి పాలైంది.