సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనాల పరంపరకొనసాగుతోంది. టోర్నీ నాలుగో రోజు గురువారం టాప్–10లోని నలుగురు సీడెడ్ క్రీడాకారులురెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ గార్బిన్ ముగురుజా, తొమ్మిదో సీడ్ జొహనా కొంటా... పురుషుల సింగిల్స్‌లో ఏడో సీడ్ డేవిడ్ గాఫిన్... తొమ్మిదో సీడ్, మాజీ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా రెండో రౌండ్‌లోనే ఓటమి చవిచూశారు.
మెల్‌బోర్న్: కెరీర్‌లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అడుగుపెట్టిన స్పెయిన్ స్టార్, మూడో సీడ్ గార్బిన్ ముగురుజాకు నిరాశ ఎదురైంది. గతేడాది వింబుల్డన్ టైటిల్‌ను, 2016లో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన ముగురుజా సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో రెండో రౌండ్‌ను దాటలేకపోయింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రపంచ 88వ ర్యాంకర్, డబుల్స్ స్పెషలిస్ట్ సెయి సు వె (చైనీస్ తైపీ) అద్భుత ఆటతీరును ప్రదర్శించి 7–6 (7/1), 6–4తో ముగురుజాను బోల్తా కొట్టించి సంచలనం సృష్టించింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముగురుజా ఎండ వేడిమికి తట్టుకోలేక తొలి సెట్‌లో మెడికల్ టైమ్ అవుట్ కూడా తీసుకుంది. తొలి సెట్‌లో ఒకదశలో 2–5తో వెనుకబడిన ముగురుజా ఆ తర్వాత తేరుకొని స్కోరును 6–6తో సమం చేసింది. అయితే టైబ్రేక్‌లో సెయి సు వె పైచేయి సాధించి తొలి సెట్‌ను దక్కించుకుంది. రెండో సెట్‌లో సెయి సు వె తన ప్రత్యర్థి సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది. ఇతర మ్యాచ్‌ల్లో బెర్నార్డా పెరా (అమెరికా) 6–4, 7–5తో తొమ్మిదో సీడ్ జొహనా కొంటా (బ్రిటన్)పై... నవోమి ఒసాకా (జపాన్) 7–6 (7/4), 6–2తో 16వ సీడ్ వెస్నినా (రష్యా)పై, మాజీ చాంపియన్ షరపోవా (రష్యా) 6–1, 7–6 (7/4)తో 14వ సీడ్ సెవస్తోవా (లాత్వియా)పై గెలుపొందారు.
మరోవైపు ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా), మాజీ చాంపియన్ కెర్బర్ (జర్మనీ), ఆరో సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), ఎనిమిదో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో హలెప్ 6–2, 6–2తో యుజిని బుషార్డ్ (కెనడా)పై, 21వ సీడ్ కెర్బర్ 6–4, 6–1తో వెకిచ్ (క్రొయేషియా)పై, ప్లిస్కోవా 6–1, 6–1తో హదాద్ మైయ (బ్రెజిల్)పై, గార్సియా 6–7 (3/7), 6–2, 8–6తో వండ్రూసోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించారు.
ఫెడరర్ జోరు
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్, రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ చాంపియన్ జొకోవిచ్ (సెర్బియా), నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ), ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. ఫెడరర్ 6–4, 6–4, 7–6 (7/4)తో స్ట్రఫ్ (జర్మనీ)పై, జొకోవిచ్ 4–6, 6–3, 6–1, 6–3తో మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)పై, జ్వెరెవ్ 6–1, 6–3, 4–6, 6–3తో గొజోజిక్ (జర్మనీ)పై, థీమ్ 6–7 (6/8), 3–6, 6–3, 6–2, 6–3తో కుద్లా (అమెరికా)పై గెలుపొందారు. మరోవైపు 2014 చాంపియన్, తొమ్మిదో సీడ్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 2–6, 1–6, 4–6తో టెనిస్ సాండ్‌గ్రెన్ (అమెరికా) చేతిలో... ఏడో సీడ్ గాఫిన్ (బెల్జియం) 6–1, 6–7 (5/7), 1–6, 6–7 (4/7) బెనెట్యూ (ఫ్రాన్స్) చేతిలో... 13వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 4–6, 6–7 (6/8), 6–4, 2–6తో మార్టన్ ఫక్సోవిక్స్ (హంగేరి) చేతిలో అనూహ్యంగా ఓడిపోయారు.
భారత ఆటగాళ్ల శుభారంభం
పురుషుల డబుల్స్‌లో భారత క్రీడాకారులు లియాండర్ పేస్, రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో పేస్–పురవ్ రాజా (భారత్) జంట 6–2, 6–3తో బాసిలాష్‌విలి (జార్జియా)–హైదర్ (ఆస్ట్రియా) జోడీపై... బోపన్న–వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయం 6–2, 7–6 (7/5)తో పోస్పిసిల్ (కెనడా)–హ్యారీసన్ (అమెరికా) జంటపై... దివిజ్–రాజీవ్ రామ్ (అమెరికా) జోడీ 7–6 (7/5), 6–4తో ట్రయెస్కీ (సెర్బియా)–కోపిల్ (రొమేనియా) ద్వయంపై విజయం సాధించాయి.
Comments
Please login to add a commentAdd a comment