పెద్దగా అంచనాలు లేవు... గ్రాండ్ స్లామ్ హార్డ్ కోర్టులపై గత రికార్డు చూసుకున్నా క్వార్టర్స్ దాటని ఆటతీరు... ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్‌లో అన్‌సీడెడ్ ఆటగాడు అలెక్స్ బోల్ట్‌పై ఐదు సెట్ల పాటు పోరాడి అతికష్టం మీద గెలుపు ఇలా చెమటోడుస్తూ సాగిన డొమినిక్ థీమ్ ఏ దశలోనూ టైటిల్ ఫేవరెట్‌గా కనబడలేదు. అయితే క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ రాఫెల్ నాదల్‌ను ఓడించి అందరి కళ్లను తన వైపు తిప్పుకున్న అతను... తాజాగా సెమీస్ పోరులో జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై నాలుగు సెట్లలో విజయం సాధించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచి వారెవ్వా అనిపించాడు. ఆదివారం జరిగే పురుషుల ఫైనల్‌లో నొవాక్ జొకోవిచ్‌తో అమీతుమీకి థీమ్ సిద్ధమయ్యాడు.
మెల్‌బోర్న్: రాడ్ లేవర్ ఎరీనాలో కిక్కిరిసిన జనం మధ్య మరోసారి మూడు గంటలకు పైగా సాగిన పోరులో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ మరో అద్భుత విజయం సాధించాడు. శుక్రవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో థీమ్ 3–6, 6–4, 7–6 (7/3), 7–6 (7/4)తో అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ)ను చిత్తు చేశాడు. దాంతో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆ స్ట్రియా ఆటగాడిగా నిలిచాడు. ఓవరాల్‌గా థీమ్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్ ఎంట్రీ కావడం విశేషం. 2018, 2019లలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌కు చేరి నాదల్ చేతిలో ఓడాడు. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో 17వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై కన్నేసిన జొకోవిచ్‌తో ఫైట్‌కు థీమ్ సిద్ధమయ్యాడు.
తొలి సెట్‌ను కోల్పోయినా...
3 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఈ పోరును థీమ్ తడబడుతూ ఆరంభించాడు. తొలి సెట్ మొదటి గేమ్‌లోనే తన సర్వీస్‌ను కోల్పోయాడు. అయితే ఆ మరుసటి గేమ్‌లో ప్రత్యర్థి జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి స్కోరును 1–1తో సమం చేశాడు. అయితే ఎనిమిదో గేమ్‌లో థీమ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జ్వెరెవ్... అనంతరం తన గేమ్‌ను కాపాడుకోవడంతో 6–3తో తొలి సెట్‌ను గెల్చుకున్నాడు. ఇక రెండో సెట్‌లో దూకుడు కనబర్చిన 26 ఏళ్ల థీమ్ గ్రౌండ్ స్ట్రోక్ షాట్లతో జ్వెరెవ్‌ను ముప్పతిప్పలు పెట్టాడు. అంతేకాకుండా అతడి సర్వీస్‌ను రెండు సార్లు బ్రేక్ చేసిన థీమ్ 6–4తో సెట్‌ను సొంతం చేసుకోవడంతో... రెండు సెట్‌లు ముగిసే సరికి ఇరు ఆటగాళ్లు 1–1తో సమంగా నిలిచారు.
కీలకమైన మూడో సెట్ టై బ్రేక్‌కు దారితీయగా... అక్కడ క్రాస్ కోర్టు, బ్యాక్ హ్యాండ్ షాట్లతో హోరెత్తించిన థీమ్... టై బ్రేక్‌ను సొంతం చేసుకొని తొలిసారి మ్యాచ్‌లో 2–1తో ఆధిక్యంలో నిలిచాడు. నాలుగో సెట్‌లో ఇద్దరు కూడా తమ సర్వీస్‌లను 12 గేమ్‌ల పాటు నిలుపుకోవడంతో... సెట్ మరోసారి టై బ్రేక్‌కు దారితీసింది. ఇక్కడ వరుసగా మూడు అనవసర తప్పిదాలు చేసిన జ్వెరెవ్ మూడు పాయింట్లను ప్రత్యర్థికి కోల్పోయాడు. ఈ ఆధిక్యాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న థీమ్ ఫోర్ హ్యాండ్ విన్నర్‌తో టై బ్రేక్‌ను గెలుచుకోవడంతో పాటు తుది పోరుకు అర్హత సాధించాడు. థీమ్ ఈ మ్యాచ్‌లో 10 ఏస్‌లు సంధించి... నాలుగు డబుల్ ఫాల్ట్స్ చేయగా... జ్వెరెవ్ 16 ఏస్‌లు కొట్టి మూడు డబుల్ ఫాల్ట్స్ చేశాడు. మ్యాచ్ ఆసాంతం జ్వెరెవ్ 200 కి.మీ పైబడిన వేగంతో సర్వీస్ చేసినా... కీలక సమయంలో చేసిన అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను దూరం చేసుకున్నాడు.
మహిళల డబుల్స్ విజేత మ్లదెనోవిచ్–బబోస్ జోడీ
మహిళల డబుల్స్ విభాగంలో చాంపియన్స్‌గా రెండో సీడ్ క్రిస్టినా మ్లదెనోవిచ్ (ఫ్రాన్స్)– టిమియా బబోస్ (హంగేరీ) జోడీ నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మ్లదెనోవిచ్–బబోస్ జంట 6–2, 6–1తో టాప్ సీడ్ సు వి హెయ్ (చైనీస్ తైపీ)–బార్బోరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్) ద్వయంపై వరుస సెట్లలో విజయం సాధించింది. మ్లదెనోవిచ్–బబోస్ ద్వయానికి ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం.
నేడు మహిళల సింగిల్స్ ఫైనల్
గార్బిన్ ముగురుజా (స్పెయిన్)*సోఫియా కెనిన్ (అమెరికా) మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment