సెరెనా జోరు... | Australian Open tournament in the quarter-finals | Sakshi
Sakshi News home page

సెరెనా జోరు...

Published Mon, Jan 23 2017 11:32 PM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

సెరెనా జోరు...

సెరెనా జోరు...

క్వార్టర్‌ ఫైనల్లో అమెరికన్‌ స్టార్‌
మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌పై గురి
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ  


డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌తోపాటు ఇతర సీడెడ్‌ క్రీడాకారిణులు నిష్క్రమించడంతో... ఈ అవకాశాన్ని అమెరికా స్టార్‌ సెరెనా విలియమ్స్‌ పూర్తిస్థాయిలోసద్వినియోగం చేసుకుంటోంది. తన ప్రత్యర్థులను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా ఆడుతూ, ఒక్కో అడ్డంకినిఅధిగమిస్తూ, తన లక్ష్యం దిశగా ముందుకు సాగుతోంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో బార్బరా స్ట్రికోవాపై నెగ్గి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరిన సెరెనా... ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిస్తే మళ్లీ నంబర్‌వన్‌ ర్యాంక్‌ అందుకోవడంతోపాటు ఓపెన్‌ శకంలో అత్యధికంగా 23 గ్రాండ్‌స్లామ్స్‌  సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.

మెల్‌బోర్న్‌: ఒకవైపు సీడెడ్‌ క్రీడాకారిణులు ఒక్కొక్కరు ఇంటిదారి పడుతుంటే... మరోవైపు సెరెనా విలియమ్స్‌ మాత్రం పూర్తి విశ్వా సంతో ఆడుతూ తన జోరు కొనసాగిస్తోంది. సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఈ అమెరికన్‌ స్టార్‌ క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ సెరెనా 7–5, 6–4తో 16వ సీడ్‌ బార్బరా స్ట్రికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచింది. ఈ గెలుపుతో సెరెనా వరుసగా పదో గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరడం విశేషం. గంటా 45 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనాకు గట్టిపోటీనే లభించింది. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయిన ఈ మాజీ చాంపియన్‌ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేయగలిగింది. 46 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా కీలక దశల్లో పైచేయి సాధించింది. నెట్‌ వద్దకు 24 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు నెగ్గిన ఈ మాజీ టాప్‌ ర్యాంకర్‌ 28 విన్నర్స్‌ సంధించింది. క్వార్టర్‌ ఫైనల్లో తొమ్మిదో సీడ్‌ జొహనా కొంటా (బ్రిటన్‌)తో సెరెనా ఆడుతుంది. ‘ఈ టోర్నీతో నేను కొత్తగా సాధించేది ఏమీ లేదు. ఇక్కడ వచ్చే ఫలితం నాకు బోనస్‌ లాంటిదే. విజయం సాధించేందుకు ఇక్కడకు వచ్చాను. మున్ముందు మ్యాచ్‌ల్లో మరింత మెరుగ్గా ఆడతాననే నమ్మకం ఉంది’ అని సెరెనా వ్యాఖ్యానించింది. ఇతర ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఐదో సీడ్‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 6–3తో 22వ సీడ్‌ దరియా గావ్రిలోవా (ఆస్ట్రేలియా)పై, జొహనా కొంటా 6–1, 6–4తో 30వ సీడ్‌ మకరోవా (రష్యా)పై గెలిచి క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు.

20 ఏళ్లకు:  మరో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో క్రొయేషియాకు చెందిన 34 ఏళ్ల మిర్యానా లూసిచ్‌ బరోని 6–4, 6–2తో జెన్నిఫర్‌ బ్రాడీ (అమెరికా)పై గెలిచింది. తద్వారా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో మొదటిసారి క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 1997లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడిన మిర్యానా 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరుకోవడం విశేషం. 1999లో వింబుల్డన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరిన మిర్యానా కెరీర్‌ వ్యక్తిగత, కుటుంబ సమస్యల కారణంగా తడబడింది. 2003 నుంచి 2009 వరకు ఆమె ఏ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలోనూ ఆడలేకపోయింది. 2010 నుంచి ఇప్పటివరకు 25 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు ఆడిన మిర్యానా ఎట్టకేలకు మళ్లీ తన సత్తా చాటుకుంది.

నాదల్, రావ్‌నిచ్‌ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ రావ్‌నిచ్‌ (కెనడా), తొమ్మిదో సీడ్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌), 15వ సీడ్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా), 11వ సీడ్‌ డేవిడ్‌ గాఫిన్‌ (బెల్జియం) క్వార్టర్‌ ఫైనల్లోకి అడుగుపెట్టారు. ప్రిక్వార్టర్స్‌లో రావ్‌నిచ్‌ 7–6 (8/6), 3–6, 6–4, 6–1తో 13వ సీడ్‌ అగుట్‌ (స్పెయిన్‌)పై గెలుపొందగా... గాఫిన్‌ 5–7, 7–6 (7/4), 6–2, 6–2తో ఎనిమిదో సీడ్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఇంటిముఖం పట్టించాడు. మాజీ చాంపియన్‌ నాదల్‌ 2 గంటల 55 నిమిషాల పోరులో 6–3, 6–3, 4–6, 6–4తో ఆరో సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌)పై నెగ్గగా... దిమిత్రోవ్‌ 2–6, 7–6 (7/2), 6–2, 6–1తో ఇస్టోమిన్‌ (ఉజ్బెకిస్తాన్‌)ను ఓడించాడు.

క్వార్టర్స్‌లో పేస్‌–హింగిస్‌ జంట
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో లియాండర్‌ పేస్‌ (భారత్‌)–మార్టినా హింగిస్‌ (స్విట్జర్లాండ్‌) జంట క్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. రెండో రౌండ్‌లో పేస్‌–హింగిస్‌ ద్వయం 6–2, 6–3తో మాట్‌ రీడ్‌–కేసీ డెలాక్వా (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. జూనియర్‌ బాలికల సింగిల్స్‌ విభాగంలో జీల్‌ దేశాయ్‌ (భారత్‌) ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్‌లో జీల్‌ 6–4, 6–2తో జూల్‌ నిమియెర్‌ (జర్మనీ)పై గెలిచింది.

నేటి ముఖ్య మ్యాచ్‌లు (క్వార్టర్‌ ఫైనల్స్‌)
వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) పావ్లీచెంకోవా (రష్యా)
ముగురుజా (స్పెయిన్‌) కోకో వాండెవె (అమెరికా)
వావ్రింకా (స్విట్జర్లాండ్‌) సోంగా (ఫ్రాన్స్‌)
ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) మిషా జ్వెరెవ్‌ (జర్మనీ)
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement