ఫెడరర్‌ ఫటాఫట్‌ | Roger Federer is two wins away from an Australian Open title | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌ ఫటాఫట్‌

Published Tue, Jan 24 2017 11:40 PM | Last Updated on Thu, Apr 4 2019 5:41 PM

ఫెడరర్‌ ఫటాఫట్‌ - Sakshi

ఫెడరర్‌ ఫటాఫట్‌

సెమీస్‌లోకి దూసుకెళ్లిన స్విస్‌ స్టార్‌ 
క్వార్టర్స్‌లో మిషా జ్వెరెవ్‌పై 92 నిమిషాల్లో గెలుపు
వావ్రింకాతో రేపు సెమీస్‌ పోరు 
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ  


35 ఏళ్లు దాటినా... ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతమవుతున్నా... కొత్త ప్రతిభ తెరపైకి దూసుకొస్తున్నా... తనలో ఇంకా ఏమాత్రం   సత్తా తగ్గలేదని స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ మరోసారి నిరూపించాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకోవడంతో ఆరు నెలలపాటు ఆటకు దూరంగా ఉన్న ఫెడరర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో పునరాగమనం చేశాడు. క్వార్టర్‌ ఫైనల్లో మిషా జ్వెరెవ్‌పై వరుస సెట్‌లలో అలవోకగా నెగ్గిన ఈ స్విస్‌ స్టార్‌ సెమీస్‌ బెర్త్‌ను దక్కించుకున్నాడు. కావాల్సినంత మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోయినా ఈ టోర్నీలో                 అతని ఆటతీరు మునుపటి ఫెడరర్‌ను గుర్తుకు తెస్తోంది. ఈ గెలుపుతో 35 ఏళ్ల ఫెడరర్‌ 1978లో ఆర్థర్‌ యాష్‌ (అమెరికా) తర్వాత            ఈ టోర్నీలో సెమీస్‌కు చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు.  

మెల్‌బోర్న్‌: ఎలాంటి సంచలనం జరగలేదు. ఎలాంటి ప్రతిఘటనా ఎదురుకాలేదు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌)ను బోల్తా కొట్టించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన 29 ఏళ్ల మిషా జ్వెరెవ్‌ (జర్మనీ) అడ్డంకిని రోజర్‌ ఫెడరర్‌ అలవోకగా అధిగమించాడు. మంగళవారం ఏకపక్షంగా జరిగిన పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 17వ సీడ్‌ ఫెడరర్‌ గంటా 32 నిమిషాల్లో 6–1, 7–5, 6–2తో ప్రపంచ 50వ ర్యాంకర్‌ మిషా జ్వెరెవ్‌ను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్‌ స్టానిస్లాస్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌)తో ఫెడరర్‌ తలపడతాడు. వరుసగా 18వ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడుతున్న ఫెడరర్‌ ఈ టోర్నీలో 13వసారి సెమీస్‌కు... ఓవరాల్‌గా 41వ సారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు. ఈ క్రమంలో ఫెడరర్‌ 1978లో ఆర్థర్‌ యాష్‌ తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చరిత్రలో... జిమ్మీ కానర్స్‌ తర్వాత (1991 యూఎస్‌ ఓపెన్‌లో 39 ఏళ్ల వయస్సులో) ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌కు చేరిన చేరిన పెద్ద వయస్కుడిగా గుర్తింపు పొందాడు.

ఆద్యంతం ఆధిపత్యం...
ప్రిక్వార్టర్స్‌లో ఆండీ ముర్రేను ఓడించిన మిషా జ్వెరెవ్‌ను ఫెడరర్‌ ఏమాత్రం తక్కువ అంచనా వేయలేదు. చివరిసారి 2013 హాలె టోర్నీలో మిషాతో ఆడిన మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–0, 6–0తో గెలుపొందగా... అదే జోరును ఇక్కడా కనబరిచాడు. ఆద్యంతం దూకుడుగా ఆడిన ఫెడరర్‌ తొలి సెట్‌ను కేవలం 19 నిమిషాల్లో సొంతం చేసుకున్నాడు. ముర్రేతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 118 సార్లు నెట్‌ వద్దకు దూసుకొచ్చిన మిషా అదే వ్యూహాన్ని ఫెడరర్‌పై అమలు చేయాలని చూశాడు. కానీ అపార అనుభవజ్ఞుడైన ఫెడరర్‌ ముందు ఈ జర్మనీ ప్లేయర్‌ ఆటలు సాగలేదు. రెండో సెట్‌లో కాస్త పోటీనిచ్చిన మిషా సర్వీస్‌ను 11వ గేమ్‌లో బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని రెండో సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్‌లోనూ ఫెడరర్‌ ఆటలో ఏమాత్రం మార్పు రాలేదు. మిషా కూడా దూకుడుగా ఆడటంతో చాలా ర్యాలీలు తొమ్మిది షాట్‌లలోపే ముగిశాయి. ఈ సెట్‌లో రెండుసార్లు మిషా సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన ఫెడరర్‌ తన సర్వీస్‌లను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఫెడరర్‌ తొమ్మిది ఏస్‌లు సంధించడంతోపాటు ఒక్క డబుల్‌ ఫాల్ట్‌ మాత్రమే చేశాడు. 32 సార్లు నెట్‌ వద్దకు వచ్చి 23 సార్లు పాయింట్లు గెలిచాడు. 65 విన్నర్స్‌ కొట్టిన ఫెడరర్‌ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేశాడు.

వావ్రింకా మూడోసారి...
మరో క్వార్టర్‌ ఫైనల్లో వావ్రింకా 2 గంటల 14 నిమిషాల్లో 7–6 (7/2), 6–4, 6–3తో 12వ సీడ్‌ జో విల్‌ఫ్రైడ్‌ సోంగా (ఫ్రాన్స్‌)ను ఓడించి ఈ టోర్నీలో మూడోసారి సెమీఫైనల్‌కు చేరాడు. 2014లో ఈ టోర్నీ టైటిల్‌ నెగ్గిన వావ్రింకాకు ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ మినహా మిగత రెండు సెట్‌లలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు. తొలి సెట్‌లో ఇద్దరూ తమ సర్వీస్‌లను నిలబెట్టుకోవడంతో టైబ్రేక్‌ అనివార్యమైంది. టైబ్రేక్‌లో ఈ స్విస్‌ స్టార్‌ పైచేయి సాధించాడు. ఆ తర్వాతి రెండు సెట్‌లలో సోంగా డీలా పడిపోయాడు.

సూపర్‌ కోకో...
ఏమాత్రం అంచనాలు లేకుండా ఈ టోర్నీలో బరిలోకి దిగిన కోకో వాండెవె తన ఖాతాలో మరో సంచలన ఫలితాన్ని జమ చేసుకుంది. ఏడో సీడ్, ప్రస్తుత ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌ గార్బిన్‌ ముగురుజా (స్పెయిన్‌)తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో కోకో 6–4, 6–0తో అనూహ్య విజయం సాధించింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో కోకో ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేయడంతోపాటు ముగురుజాకు ఒక్క బ్రేక్‌ పాయింట్‌ అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్, టాప్‌ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ)ను మట్టికరిపించిన కోకో తన కెరీర్‌లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. గతంలో ఐదుసార్లు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ఆడిన కోకో ఏనాడూ మూడో రౌండ్‌ దాటి ముందుకెళ్లలేదు.

సానియాతో బోపన్న అమీతుమీ
మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో సెమీఫైనల్‌ బెర్త్‌ కోసం రోహన్‌ బోపన్న (భారత్‌)–గాబ్రియెలా దబ్రౌస్కీ (కెనడా) జంటతో సానియా మీర్జా (భారత్‌)–ఇవాన్‌ డోడిగ్‌ (క్రొయేషియా) జోడీ అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం జరిగిన రెండో రౌండ్‌లో రెండో సీడ్‌ సానియా–డోడిగ్‌ జంట 2–6, 6–3, 10–6తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సాయ్‌సాయ్‌ జెంగ్‌ (చైనా)–అలెగ్జాండర్‌ పెయా (ఆస్ట్రియా) ద్వయంపై గెలుపొందగా... బోపన్న–దబ్రౌస్కీ జోడీ 6–4, 5–7, 10–3తో ‘సూపర్‌ టైబ్రేక్‌’లో ఐదో సీడ్‌ యుంగ్‌ జాన్‌ చాన్‌ (చైనీస్‌ తైపీ)–లుకాజ్‌ కుబోట్‌ (పోలండ్‌) జంటపై సంచలన విజయం సాధించింది.

వీనస్‌ ‘రికార్డు’...
మహిళల సింగిల్స్‌ విభాగంలో అమెరికా వెటరన్‌ స్టార్‌ వీనస్‌ విలియమ్స్‌ విజయపరంపర కొనసాగుతోంది. 2003 తర్వాత తొలిసారి ఆమె ఈ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో 13వ సీడ్‌ వీనస్‌ 6–4, 7–6 (7/3)తో 24వ సీడ్‌ అనస్తాసియా పావ్లీచెంకోవా (రష్యా)పై గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తద్వా రా ఓపెన్‌ శకం మొదలయ్యాక (1968 నుంచి) ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ చరిత్రలో సెమీఫైనల్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా వీనస్‌ (36 ఏళ్ల 221 రోజులు) రికార్డు సృష్టించింది. అంతేకాకుండా 1994లో మార్టినా నవత్రిలోవా (వింబుల్డన్‌లో–37 ఏళ్లు) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో సెమీస్‌కు చేరిన పెద్ద వయస్కురాలిగా వీనస్‌ గుర్తింపు పొందింది. సెమీఫైనల్లో అమెరికాకే చెందిన అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి కోకో వాండెవెతో వీనస్‌ తలపడుతుంది.

నేటి ముఖ్య మ్యాచ్‌లు (క్వార్టర్‌ ఫైనల్స్‌)
ప్లిస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌) మిర్యానా లూసిచ్‌ (క్రొయేషియా)
సెరెనా విలియమ్స్‌ (అమెరికా) జొహనా కొంటా (బ్రిటన్‌)
గాఫిన్‌ (బెల్జియం)  దిమిత్రోవ్‌ (బల్గేరియా)
రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌) మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)
ఉదయం గం. 5.30 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement