కెర్బర్‌... మళ్లీ కష్టంగా! | Australian Open: Andy Murray, Roger Federer advance to third round | Sakshi
Sakshi News home page

కెర్బర్‌... మళ్లీ కష్టంగా!

Published Thu, Jan 19 2017 12:51 AM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM

కెర్బర్‌... మళ్లీ కష్టంగా!

కెర్బర్‌... మళ్లీ కష్టంగా!

శ్రమించి నెగ్గిన టాప్‌ సీడ్‌
మూడో రౌండ్‌లో ఫెడరర్, ముర్రే
ఏడో సీడ్‌ సిలిచ్‌కు చుక్కెదురు
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీ


మెల్‌బోర్న్‌: నంబర్‌వన్‌ ర్యాంక్‌తోపాటు టైటిల్‌ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో బరిలోకి దిగిన టాప్‌ సీడ్‌ ఎంజెలిక్‌ కెర్బర్‌కు మళ్లీ గట్టిపోటీ లభించింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో ఈ జర్మనీ స్టార్‌ రెండో రౌండ్‌లోనూ మూడు సెట్‌ల పోరులో గట్టెక్కింది. బుధవారం తన 29వ జన్మదినాన్ని జరుపుకున్న కెర్బర్‌ రెండో రౌండ్‌లో 6–2, 6–7 (3/7), 6–2తో కరీనా వితోయెఫ్ట్‌ (జర్మనీ)పై గెలుపొందింది. రెండు గంటల ఎనిమిది నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ కెర్బర్‌ ఆరు డబుల్‌ ఫాల్ట్‌లు చేసింది. 34 అనవసర తప్పిదాలు చేసిన ఈ జర్మనీ ప్లేయర్‌ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్‌ చేయగలిగింది. గతంలో కెర్బర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 0–6, 0–6తో ఓడిపోయి ఒక్క గేమ్‌ కూడా నెగ్గలేకపోయిన వితోయెఫ్ట్‌ ఈసారి మాత్రం 11 గేమ్‌లు సాధించడం విశేషం. ‘తొలిసారి టాప్‌ సీడ్‌ హోదాలో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆడుతున్నాను. ఈ ఒత్తిడిని గౌరవంగా భావిస్తున్నాను. ఈ క్షణాలను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను’ అని కెర్బర్‌ వ్యాఖ్యానించింది.

పదో సీడ్‌ నవారో ఓటమి
మూడో రోజు మహిళల సింగిల్స్‌ విభాగంలో మూడు అనూహ్య ఫలితాలు వచ్చాయి. పదో సీడ్‌ కార్లా సురెజ్‌ నవారో (స్పెయిన్‌), రియో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, 29వ సీడ్‌ మోనికా పుయిగ్‌ (ప్యూర్టోరికో),  20వ సీడ్‌ షుయె జాంగ్‌ (చైనా) రెండో రౌండ్‌లోనే నిష్క్రమించారు. క్రిస్టియా (రొమేనియా) 7–6 (7/1), 6–3తో నవారోపై, అలీసన్‌ రిస్కీ (అమెరికా) 7–6 (9/7), 4–6, 6–1తో షుయె జాంగ్‌పై, మోనా బార్తెల్‌ (జర్మనీ) 6–4, 6–4తో మోనికా పుయిగ్‌పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు.

ఇతర రెండో రౌండ్‌ మ్యాచ్‌ల్లో 13వ సీడ్‌ వీనస్‌ (అమెరికా) 6–3, 6–2తో వొగెలె (స్విట్జర్లాండ్‌)పై, ఏడో సీగ్‌ ముగురుజా (స్పెయిన్‌) 7–5, 6–4తో  క్రాఫోర్డ్‌ (అమెరికా)పై, ఎనిమిదో సీడ్‌  కుజ్‌నెత్సోవా (రష్యా) 6–2, 6–1 తో ఫుర్లీస్‌ (ఆస్ట్రేలియా)పై, 11వ సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 6–4, 6–1తో బొసెరప్‌ (అమెరికా)పై నెగ్గారు.

వావ్రింకా అలవోకగా...
పురుషుల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ ఆండీ ముర్రే (బ్రిటన్‌), నాలుగో సీడ్‌ వావ్రింకా (స్విట్జర్లాండ్‌), ఐదో సీడ్‌ నిషికోరి (జపాన్‌), మాజీ చాంపియన్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌) వరుస సెట్‌లలో తమ ప్రత్యర్థులను ఓడించి మూడో రౌండ్‌లోకి చేరుకున్నారు. ముర్రే 6–3, 6–0, 6–2తో రుబ్‌లెవ్‌ (రష్యా)పై, ఫెడరర్‌ 7–5, 6–3, 7–6 (7/3)తో నోవా రూబిన్‌ (అమెరికా)పై, వావ్రింకా 6–3, 6–4, 6–4తో జాన్సన్‌ (అమెరికా)పై, నిషికోరి 6–3, 6–4, 6–3తో జెరెమి చార్డీ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. పదో సీడ్‌ బెర్డిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), 12వ సీడ్‌ సోంగా (ఫ్రాన్స్‌) కూడా మూడో రౌండ్‌లోకి చేరారు.

ఇస్నెర్‌కు షాక్‌
మరోవైపు ఏడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా), 19వ సీడ్‌ జాన్‌ ఇస్నెర్‌ (అమెరికా) రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. 4 గంటల 10 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో 6 అడుగుల 10 అంగుళాల ఎత్తు, 108 కేజీల బరువున్న జాన్‌ ఇస్నెర్‌ 7–6 (7/4), 7–6 (7/4), 4–6, 6–7 (7/9), 7–9తో మిషా జ్వెరెవ్‌ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. అన్‌సీడెడ్‌ డానియల్‌ ఇవాన్స్‌ (బ్రిటన్‌) 3–6, 7–5, 6–3, 6–3తో సిలిచ్‌ను ఓడించి సంచలనం సృష్టించాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement