మెల్‌బోర్న్: ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన అతి కొద్ది క్రీడాకారిణుల్లో ఒకరైన కరోలిన్ వొజ్నియాకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్‌లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 3–6, 6–2, 7–5తో ప్రపంచ 119వ ర్యాంకర్ జానా ఫెట్ (క్రొయేషియా)పై గెలుపొందింది.
2 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొజ్ని యాకి మూడో సెట్‌లో ఒకదశలో 1–5తో వెనుకబడింది. అంతేకాకుండా రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకుంది. ఈ దశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ డెన్మార్క్ భామ అనూహ్యంగా కోలుకుంది. వరుసగా ఆరు గేమ్‌లు సాధించి 7–5తో మూడో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన వొజ్నియాకి ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది.
మరోవైపు జానా ఫెట్ 18 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 6–3, 3–6, 6–4తో యింగ్ యింగ్ దువాన్ (చైనా)పై, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 4–6, 6–2, 6–1తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి మూడో రౌండ్‌లోకి అడుగు పెట్టారు.
నాదల్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) మూడో రౌండ్‌లోకి చేరుకున్నారు. రెండో రౌండ్‌లో నాదల్ 6–3, 6–4, 7–6 (7/4)తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై, దిమిత్రోవ్ 4–6, 6–2, 6–4, 0–6, 8–6తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, సిలిచ్ 6–1, 7–5, 6–2తో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో 15వ సీడ్ జో విల్‌ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 3–6, 6–1, 1–6, 7–6 (7/4), 7–5తో షపోవలోవ్ (కెనడా)పై, 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7–5, 6–4, 7–6 (7/2)తో ట్రయెస్కీ (సెర్బియా)పై విజయం సాధించారు.
కార్లోవిచ్ ఏస్‌ల వర్షం
క్రొయేషియా ఆజానుబాహుడు ఇవో కార్లోవిచ్ మారథాన్ మ్యాచ్‌లో గట్టెక్కాడు. 38 ఏళ్ల కార్లోవిచ్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 7–6 (7/3), 6–7 (3/7), 7–5, 4–6, 12–10తో యుచి సుగిటా (జపాన్)పై గెలిచాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 53 ఏస్‌లు సంధించాడు. వరుసగా 15వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతోన్న కార్లోవిచ్ ఏనాడూ ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేదు.
కోస్ట్‌యుక్ సంచలనం
క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ఉక్రెయిన్‌కు చెందిన 15 ఏళ్ల మార్టా కోస్ట్‌యుక్ తన విజయాల పరంపర కొనసాగిస్తోంది. రెండో రౌండ్‌లో కోస్ట్‌యుక్ 6–3, 7–5తో రోగోవ్‌స్కా (ఆస్ట్రేలియా)ను ఓడించింది. ఈ క్రమంలో ఆమె స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ (1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకున్న పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment