Caroline Wozniacki
-
ఆ్రస్టేలియన్ ఓపెన్ బరిలో వొజ్నియాకి
ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ టెన్నిస్ స్టార్ వొజ్నియాకికి వచ్చే ఏడాది జరిగే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో బరిలోకి దిగనుంది. ప్రస్తుతం 242వ ర్యాంక్‌లో ఉన్న 33 ఏళ్ల వొజ్నియాకికికి నిర్వాహకులు ‘వైల్డ్ కార్డు’ కేటాయించారు. 2018లో ఆ్రస్టేలియన్ ఓపెన్ చాంపియన్‌గా నిలిచిన వొజ్నియాకికి 2020లో టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పింది. గత ఏడాది ఆగస్టులో పునరాగమనం చేసి యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడింది. -
వొజ్నియాకి వీడ్కోలు
పారిస్: ప్రపంచ మాజీ నంబర్‌వన్, డెన్మార్క్ భామ కరోలైన్ వొజ్నియాకి టెన్నిస్‌కు వీడ్కోలు పలకనుంది. వచ్చే ఏడాది జనవరిలో జరిగే తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత ఆటకు గుడ్‌బై చెబుతానని వొజి్నయాకి ప్రకటించింది. 29 ఏళ్ల వొజి్నయాకి తన కెరీర్లో ఏకైక గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను గతేడాది గెల్చుకుంది. 2009, 2014 యూఎస్ ఓపెన్ టోరీ్నలలో రన్నరప్‌గా నిలిచింది. ‘టెన్నిస్‌లో నేను కోరుకున్నవన్నీ సాధించాను. నా జీవితంలో ఆట కంటే ఇతర విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే సమయం వస్తే టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని అనుకున్నాను’ అని కెరీర్లో 30 సింగిల్స్ టైటిల్స్ గెలిచిన వొజ్నియాకి తెలిపింది. 2005లో 15 ఏళ్ల ప్రాయంలో ప్రొఫెషనల్‌గా మారిన వొజ్నియాకి 2010లో అక్టోబరులో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. ఈ స్థానంలో ఆమె 71 వారాలు కొనసాగింది. వరుసగా 11 ఏళ్లపాటు టాప్–20లో నిలిచిన వొజ్నియాకి గాయాల కారణంగా ఈ ఏడాది కేవలం ఒక టోర్నీలో ఫైనల్‌కు చేరింది. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్స్‌లో వొజ్నియాకి 37వ ర్యాంక్‌లో ఉంది. -
వొజ్నియాకి నిష్క్రమణ
న్యూయార్క్: ఈ ఏడాది తన నిరాశాజనక ప్రదర్శన కొనసాగిస్తూ... మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్, 19వ సీడ్ క్రీడాకారిణి కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్) యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో 2009, 2014 రన్నరప్ వొజ్నియాకి 4–6, 4–6తో 16వ సీడ్ బియాంక ఆండ్రెస్కూ (కెనడా) చేతిలో ఓటమి చవిచూసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్లలో మూడో రౌండ్లో వెనుదిరిగిన వొజ్నియాకి ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. మరోవైపు ఏడో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) కూడా మూడో రౌండ్లోనే ఓడింది. జూలియా (జర్మనీ) 6–2, 6–3తో కికి బెర్టెన్స్ను ఓడించింది. ఇతర మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో ఎనిమిదో సీడ్ సెరెనా (అమెరికా) 6–3, 6–2తో ముచోవా (చెక్ రిపబ్లిక్)పై, రెండో సీడ్ బార్టీ (ఆస్ట్రేలియా) 7–5, 6–3తో సకారి (గ్రీస్)పై, పదో సీడ్ కీస్ (అమెరికా) 6–3, 7–5తో సోఫియా(అమెరికా)పై గెలిచారు. నిషికోరికి షాక్ పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో ఏడో సీడ్ నిషికోరి (జపాన్) 2–6, 4–6, 6–2, 3–6తో డి మినార్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడి పోయాడు. టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–3, 6–4, 6–2తో డెనిస్ కుడ్లా (అమెరికా) పై, ఐదో సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 7–6 (7/1), 4–6, 7–6 (9/7), 6–4తో లోపెజ్ పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి చేరారు. -
వోజ్నియాకీ ఇంటిబాట
లండన్: వింబుల్డన్ టోర్నీలో మాజీ నెం.1, 14వ సీడ్ కరోలిన్ వోజ్నియాకీ(డెన్మార్క్) కథ ముగిసింది. శుక్రవారం మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో వోజ్నియాకీ 4–6, 2–6తో ప్రపంచ 50వ ర్యాంకర్ జంగ్(చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. మహిళల విభాగంలోని ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మూడో సీడ్ కరోలినా ప్లిస్కోవా(చెక్ రిపబ్లిక్) 3–6, 6–2, 4–6తో షీ వూ హీష్(తైవాన్)పై, ఎనిమిదో సీడ్ ఎలినా స్వితోలినా(ఉక్రెయిన్) 6–3, 6–7(1/7), 6–2తో సక్కరి(గ్రీస్)పై చెమటోడ్చి నెగ్గగా, వరల్డ్ నెం.20 కొంటావీట్(ఎస్తోనియా) 7–6(9/7), 6–3తో ముచుకోవా (చెక్‌రిపబ్లిక్) చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో గతేడాది రన్నరప్ కెవిన్ అండర్సన్(దక్షిణాఫ్రికా) 4–6, 3–6, 6–7(4/7)తో పెల్లా(అర్జెంటీనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇతర ప్రధాన మ్యాచ్‌ల్లో మిలాస్ రావోనిక్(కెనడా) 6–7(7/1), 2–6, 1–6తో ఒపెల్కా(అమెరికా)పై, బెన్నెట్ పైర్(ఫ్రాన్స్) 5–7, 7–6(7/5), 6–3, 7–6(7/2)తో వెస్లీ(చెక్‌రిపబ్లిక్)పై చెమటోడ్చి నెగ్గి తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. పదో సీడ్ కచనోవ్(రష్యా) 3–6, 6–7(3/7), 1–6తో ప్రపంచ 22వ ర్యాంకర్ బటిస్టా అగట్(స్పెయిన్) చేతిలో ఓటమి పాలయ్యాడు. ప్రిక్వార్టర్స్‌కు దివిజ్ జోడీ పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ జోడీ ప్రిక్వార్టర్స్‌కు చేరింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దివిజ్(భారత్)–డెమోలైనర్(బ్రెజిల్) ద్వయం 7–6(1) 5–7 7–6(6) 6–4 తో సాండర్ గిల్లీ– జొరాన్ వెలీజెన్(బెల్జియం) జంటపై చెమటోడ్చి నెగ్గింది. కాగా, డబుల్స్‌లో ఇప్పటికే రొహన్ బొపన్న, లియాండర్ పేస్, పురవ్ రాజా, నెడుంజెళియన్ జోడీలు టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. -
వొజ్నియాకి ఔట్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కరోలైన్ వొజ్నియాకి కథ ముగిసింది. మాజీ విజేత షరపోవా (రష్యా) కీలకదశలో పైచేయి సాధించి వొజ్నియాకిని బోల్తా కొట్టించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో మాజీ నంబర్‌వన్, 30వ సీడ్ షరపోవా 6–4, 4–6, 6–3తో మూడో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్)పై గెలిచింది. 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 2008 చాంపియన్ షరపోవా ఐదు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 46 అనవసర తప్పిదాలు చేసిన ఈ రష్యా స్టార్ వొజ్నియాకి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసి ఫలితాన్ని శాసించింది. రెండో సీడ్ కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా), ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో కెర్బర్ 6–1, 6–0తో కింబర్లీ బిరెల్ (ఆ స్ట్రేలియా)పై, స్లోన్ స్టీఫెన్స్ 7–6 (8/6), 7–6 (7/5)తో పెట్రా మార్టిక్ (క్రొయేషియా)పై, క్విటోవా 6–1, 6–4తో బెన్సిచ్ (స్విట్జర్లాండ్)పై నెగ్గారు. 11వ సీడ్ సబలెంకా (బెలారస్) 3–6, 2–6తో అనిస్మోవా (అమెరికా) చేతిలో... 19వ సీడ్ గార్సియా (ఫ్రాన్స్) 3–6, 2–6తో డానియెలా (అమెరికా) చేతిలో ఓడిపోయారు. ఫెడరర్, నాదల్ జోరు పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), మాజీ విజేత రాఫెల్ నాదల్ (స్పెయిన్) ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. మూడో రౌండ్లో ఫెడరర్ 6–2, 7–5, 6–2తో టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై, నాదల్ 6–1, 6–2, 6–4తో అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) 4–6, 3–6, 6–1, 7–6 (10/8), 6–3తో ఫెర్నాండో వెర్డాస్కో (స్పెయిన్)పై శ్రమించి నెగ్గగా... పదో సీడ్ కరెన్ ఖచనోవ్ (రష్యా) 4–6, 5–7, 4–6తో బటిస్టా అగుట్ (స్పెయిన్) చేతిలో ఓడిపోయాడు. -
వొజ్నియాకి నిష్క్రమణ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల పర్వం కొనసాగుతోంది. తొలి రౌండ్లోనే టాప్ సీడ్ హలెప్ ఇంటిముఖం పట్టగా... ఆమె సరసన రెండో సీడ్ కరోలైన్ వొజ్నియాకి (డెన్మార్క్), 11వ సీడ్ కసత్కినా (రష్యా) చేరారు. ఉక్రెయిన్ అమ్మాయి లెసియా సురెంకోతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో వొజ్నియాకి 4–6, 2–6తో... సస్నోవిచ్ (బెలారస్)తో జరిగిన మ్యాచ్‌లో కసత్కినా 2–6, 6–7 (3/7)తో ఓడిపోయారు. సురెంకతో గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వొజ్నియాకి మూడు డబుల్ ఫాల్ట్‌లతోపాటు 35 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. మరోవైపు మాజీ చాంపియన్ షరపోవా (రష్యా), నాలుగో సీడ్ కెర్బర్ (జర్మనీ), ఐదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్), ఆరో సీడ్ గార్సియా (ఫ్రాన్స్) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు.పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) 7–5, 6–4, 6–4తో పెయిర్ (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–1, 6–3, 6–7 (2/7), 6–2తో సాండ్‌గ్రెన్ (అమెరికా)పై, నాలుగో సీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 6–2తో మహుట్ (ఫ్రాన్స్)పై గెలుపొందారు. పేస్ జంట పరాజయం పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో పేస్ (భారత్)–సెరెటాని (అమెరికా) జంట 3–6, 4–6తో చార్డీ–మార్టిన్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో... జీవన్–ఇస్టోమిన్ (ఉజ్బెకిస్తాన్) ద్వయం 3–6, 2–6తో కబాల్–ఫరా (కొలంబియా) జంట చేతిలో ఓడిపోగా... దివిజ్ శరణ్–సితాక్ (న్యూజిలాండ్) జోడీ 6–4, 6–4తో రెడికి–జు (అమెరికా) జంటపై గెలిచింది. -
వొజ్నియాకి అలవోకగా...
పారిస్: ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించి కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన డెన్మార్క్ స్టార్ కరోలైన్ వొజ్నియాకి అదే జోరును ఫ్రెంచ్ ఓపెన్‌లో కొనసాగిస్తోంది. సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన ఫ్రెంచ్ ఓపెన్‌లో వొజ్నియాకి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. గార్సియా పెరెజ్ (స్పెయిన్)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ వొజ్నియాకి 6–1, 6–0తో అలవోకగా గెలిచింది. 51 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి తన ప్రత్యర్థికి కేవలం ఒక గేమ్ మాత్రమే కోల్పోయింది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–4తో కుజ్మోవా (స్లొవేకియా)పై, ఎనిమిదో సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–4తో అరూబెరెనా (స్పెయిన్)పై నెగ్గి మూడో రౌండ్లో అడుగు పెట్టారు. శ్రమించిన హలెప్... మరోవైపు టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సిమోనా హలెప్ (రొమేనియా)కు తొలి రౌండ్లోనే ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అలీసన్ రిస్కీ (అమెరికా)తో బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో హలెప్ 2–6, 6–1, 6–1తో విజయం సాధించి ఊరట చెందింది. 2014, 2017లలో రన్నరప్‌గా నిలిచిన హలెప్ తొలి సెట్లో 0–5తో వెనుకబడింది. ఆ తర్వాత రెండు గేమ్‌లు గెల్చుకున్నప్పటికీ తొలి సెట్‌ను దక్కించుకోలేకపోయింది. అయితే రెండో సెట్లో ఈ రొమేనియా స్టార్ పుంజుకుంది. నాలుగుసార్లు రిస్కీ సర్వీస్‌ను బ్రేక్ చేసి అదే జోరులో సెట్‌ను సొంతం చేసుకుంది. నిర్ణాయక మూడో సెట్లోనూ హలెప్ దూకుడు కొనసాగించి విజయాన్ని ఖాయం చేసుకుంది. మంగళవారమే హలెప్ తన తొలి రౌండ్ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా వర్షం కారణంగా ఆమె మ్యాచ్‌ను బుధవారానికి మార్చారు. గట్టెక్కిన జ్వెరెవ్ పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), నాలుగో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), 19వ సీడ్ నిషికోరి (జపాన్) ఐదు సెట్ల పోరాటంలో గట్టెక్కారు. రెండో రౌండ్లో జ్వెరెవ్ 2–6, 7–5, 4–6, 6–1, 6–2తో లాజోవిక్ (సెర్బియా)పై, దిమిత్రోవ్ 6–7 (2/7), 6–4, 4–6, 6–4, 10–8తో డొనాల్డ్సన్ (అమెరికా)పై, నిషికోరి 6–3, 2–6, 4–6, 6–2, 6–3తో బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై కష్టపడి గెలిచారు. మాజీ చాంపియన్ జొకోవిచ్ 7–6 (7/1), 6–4, 6–4తో మునార్ (స్పెయిన్)పై, ఎనిమిదో సీడ్ గాఫిన్ (బెల్జియం) 7–5, 6–0, 6–1తో మూటెట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. 12వ సీడ్ సామ్ క్వెరీ (అమెరికా) 6–1, 6–7 (3/7), 4–6, 1–6తో సిమోన్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. -
కొత్త చాంపియన్ వొజ్నియాకి..
-
వోజ్నియాకి ‘నంబర్‌వన్’ ట్రోఫీ
నిజంగానే కరోలిన్ వోజ్నియాకికి ఇది ‘నంబర్‌వన్’ ట్రోఫీ. 43 సార్లు గ్రాండ్‌స్లామ్ బరిలోకి దిగిన ఈ డెన్మార్క్ క్రీడాకారిణి ఆస్ట్రేలియన్ ఓపెన్ సింగిల్స్ టైటిల్‌తో తొలిసారి ఓ మేజర్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. దీంతో పాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. ఓవెన్‌ను తలపించిన వాతావరణంలో... ఒంట్లో సత్తువను పీల్చేస్తున్న వేడిలో... తుదికంటా పోరాడింది. నంబర్‌వన్ హలెప్‌పై టైటిల్ గెలిచేదాకా విశ్రమించలేదు. చివరకు టైటిల్‌తో 11 ఏళ్ల గ్రాండ్‌స్లామ్ పోరాటానికి విజయంతో తెరదించింది. మెల్బోర్న్: కరోలిన్ వోజ్నియాకి... ఒకటా, రెండా ఏకంగా 11 ఏళ్ల పాటు గ్రాండ్‌స్లామ్ టైటిల్ కోసం పరితపించింది. ఈ క్రమంలో రెండు సార్లు (2009, 2014 యూఎస్ ఓపెన్) టైటిల్ బరిలో నిలిచిన ఈ డానిష్ ప్రొఫెషనల్... గెలుపుదరిని మాత్రం చేరలేకపోయింది. కానీ ఈ సారి ఆరంభ గ్రాండ్‌స్లామ్‌లోనే విజృంభించింది. చాంపియన్‌షిప్ దక్కేదాకా పోరాడింది. చివరకు అనుకున్నది సాధించింది. విరామమెరుగని పోరాటంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల కిరీటాన్ని అందుకుంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో డెన్మార్క్ స్టార్ వోజ్నియాకి 7–6 (7/2), 3–6, 6–4తో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై చెమటోడ్చి నెగ్గింది. ప్రపంచ నంబర్‌వన్ హలెప్ తన స్థాయికి తగ్గ పోరాటంతో మెప్పించింది. తాజాగా నంబర్‌వన్ ర్యాంకును ఖాయం చేసుకున్న వోజ్నియాకి 2010 తర్వాత మళ్లీ అగ్రస్థానాన్ని చేరనుంది. గెలిచేదాకా... నువ్వా నేనా... హోరా హోరీగా సాగిన టైటిల్ పోరు సుమారు మూడు గంటల (2.49 ని.) పాటు జరిగింది. ఇద్దరు ప్రత్యర్థులు హోరాహోరీగా తలపడుతూనే కనిపించని మరో ప్రత్యర్థి (ఉష్ణోగ్రత)నీ ఎదుర్కొన్నారు. తొలి సెట్లో చక్కని శుభారంభంతో వోజ్నియాకి 3–0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అనంతరం హలెప్ కూడా దీటుగా పుంజుకోవడంతో రసవత్తర పోరు జరిగింది. బ్రేక్ పాయింట్లతో వోజ్నియాకి జోరుకు కళ్లెం వేసిన రోమేనియన్ స్టార్ ఈ సెట్‌ను టైబ్రేక్ దాకా తీసుకెళ్లింది. అక్కడ డెన్మార్క్ క్రీడాకారిణి సత్తాచాటడంతో 4–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం ఎదురులేని సర్వీస్‌లతో టైబ్రేక్‌ను 7–2తో ముగించింది. తొలి సెట్ పరాజయాన్ని పక్కనబెట్టి తాజాగా రెండో సెట్ ఆడిన హలెప్ అద్భుతమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. దీంతో ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్‌ను తేల్చేందుకు మూడో సెట్ తప్పలేదు. ఈ సెట్లో మళ్లీ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడటంతో 3–3 స్కోరు సమమైంది. వోజ్నియాకి బలహీనమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో తడబడటంతో 3–4తో వెనుకబడింది. ఈ దశలో ఫిజియోతో తన ఎడమ మోకాలికి మర్దన చేయించుకున్నాకే వోజ్నియాకి కోర్టులో చురుగ్గా కదంతొక్కింది. వేగవంతమైన సర్వీస్‌లతో వరుసగా రెండు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను, టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హలెప్ 6 ఏస్‌లు సంధించగా, వోజ్నియాకి 2 ఏస్‌లు సంధించింది. ఇద్దరు ఐదేసి బ్రేక్ పాయింట్లు సాధించగా... వోజ్నియాకి 6 సార్లు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. హలెప్ మాత్రం ఒకసారే డబుల్ ఫాల్ట్ చేసింది. నేడు పురుషుల సింగిల్స్ ఫైనల్స్ ఫెడరర్&సిలిచ్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం -
కొత్త చాంపియన్ వొజ్నియాకి..
మెల్బోర్న్: ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ ఓపెన్ టోర్నీలో రెండో సీడ్, డెన్మార్క్ క్రీడాకారిణి వొజ్నియాకి కొత్త చాంపియన్‌గా అవతరించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ పోరులో వొజ్నియాకి 7-6(7/2), 3-6, 6-4 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ క్రీడాకారిణి హలెప్(రొమేనియా)పై విజయం సాధించి తొలిసారి గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సాధించింది. మరొకవైపు ఆస్ట్రేలియా గ్రాండ్ స్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరిన మొదటిసారే టైటిల్‌ను సాధించిన క్రీడాకారిణిగా అరుదైన ఘనతను వొజ్నియాకి సొంతం చేసుకుంది. హోరాహోరీగా సాగిన తొలి సెట్‌ను టై బ్రేక్ ద్వారా దక్కించుకున్న వొజ్నియాకి.. రెండో సెట్‌ను కోల్పోయింది. ఇక నిర్ణయాత్మక మూడో సెట్లో వొజ్నియాకి విజృంభించి పదునైన సర్వీస్‌లను సంధించింది. దాంతో తడబాటకు లోనైన హలెప్.. వరుస పాయింట్లను కోల్పోయి సెట్‌తో పాటు టైటిల్‌ను కూడా చేజార్చుకుంది. ఇది హలెప్‌కు మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ కాగా, మూడుసార్లు రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. 2014, 2017ల్లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ కు చేరినా హలెప్ విజేతగా నిలవకలేకపోయింది.మరొకవైపు 2009, 2014 సంవత్సరాల్లో యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు చేరిన వొజ్నియాకి టైటిల్ సాధించడంలో విఫలమైంది. -
వొజ్నియాకి అద్భుతం
మెల్బోర్న్: ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ కూడా గెలవకుండా ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన అతి కొద్ది క్రీడాకారిణుల్లో ఒకరైన కరోలిన్ వొజ్నియాకి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మూడో రౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో రెండో సీడ్ వొజ్నియాకి (డెన్మార్క్) 3–6, 6–2, 7–5తో ప్రపంచ 119వ ర్యాంకర్ జానా ఫెట్ (క్రొయేషియా)పై గెలుపొందింది. 2 గంటల 31 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొజ్ని యాకి మూడో సెట్లో ఒకదశలో 1–5తో వెనుకబడింది. అంతేకాకుండా రెండు మ్యాచ్ పాయింట్లను కూడా కాపాడుకుంది. ఈ దశలో తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ డెన్మార్క్ భామ అనూహ్యంగా కోలుకుంది. వరుసగా ఆరు గేమ్‌లు సాధించి 7–5తో మూడో సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు ఏస్‌లు సంధించి, ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన వొజ్నియాకి ప్రత్యర్థి సర్వీస్‌ను ఏడుసార్లు బ్రేక్ చేసింది. మరోవైపు జానా ఫెట్ 18 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో ఆరింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌లో ఏడో సీడ్ జెలెనా ఒస్టాపెంకో (లాత్వియా) 6–3, 3–6, 6–4తో యింగ్ యింగ్ దువాన్ (చైనా)పై, నాలుగో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 4–6, 6–2, 6–1తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. నాదల్ ముందంజ పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), మూడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా), ఆరో సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) మూడో రౌండ్లోకి చేరుకున్నారు. రెండో రౌండ్లో నాదల్ 6–3, 6–4, 7–6 (7/4)తో లియోనార్డో మాయెర్ (అర్జెంటీనా)పై, దిమిత్రోవ్ 4–6, 6–2, 6–4, 0–6, 8–6తో మెక్‌డొనాల్డ్ (అమెరికా)పై, సిలిచ్ 6–1, 7–5, 6–2తో సుసా (పోర్చుగల్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో 15వ సీడ్ జో విల్ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) 3–6, 6–1, 1–6, 7–6 (7/4), 7–5తో షపోవలోవ్ (కెనడా)పై, 17వ సీడ్ నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా) 7–5, 6–4, 7–6 (7/2)తో ట్రయెస్కీ (సెర్బియా)పై విజయం సాధించారు. కార్లోవిచ్ ఏస్‌ల వర్షం క్రొయేషియా ఆజానుబాహుడు ఇవో కార్లోవిచ్ మారథాన్ మ్యాచ్‌లో గట్టెక్కాడు. 38 ఏళ్ల కార్లోవిచ్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో 7–6 (7/3), 6–7 (3/7), 7–5, 4–6, 12–10తో యుచి సుగిటా (జపాన్)పై గెలిచాడు. 6 అడుగుల 11 అంగుళాల ఎత్తు, 104 కేజీల బరువున్న కార్లోవిచ్ ఈ మ్యాచ్‌లో ఏకంగా 53 ఏస్‌లు సంధించాడు. వరుసగా 15వ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతోన్న కార్లోవిచ్ ఏనాడూ ఈ టోర్నీలో ప్రిక్వార్టర్ ఫైనల్ దాటి ముందుకెళ్లలేదు. కోస్ట్యుక్ సంచలనం క్వాలిఫయర్‌గా బరిలోకి దిగిన ఉక్రెయిన్‌కు చెందిన 15 ఏళ్ల మార్టా కోస్ట్యుక్ తన విజయాల పరంపర కొనసాగిస్తోంది. రెండో రౌండ్లో కోస్ట్యుక్ 6–3, 7–5తో రోగోవ్స్కా (ఆస్ట్రేలియా)ను ఓడించింది. ఈ క్రమంలో ఆమె స్విట్జర్లాండ్ దిగ్గజం మార్టినా హింగిస్ (1996లో ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో మూడో రౌండ్‌కు చేరుకున్న పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. -
కెర్బర్ ‘నంబర్ వన్’ విన్
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ మహిళల ఫైనల్లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణి కరోలినా ప్లిస్కోవా, జర్మనీ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ తలపడనున్నారు. శనివారం టైటిల్ పోరు జరగనుంది. సెమీస్ లో ప్లిస్కోవా, కెర్బర్ తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టారు. తొలి సెమీస్ లో సెరెనా విలియమ్స్ ను ప్లిస్కోవా ఓడించింది. రెండో సెమీస్ లో వోజ్నియాకిపై కెర్బర్ గెలిచింది. 6-4, 6-3తో ఓడించి టైటిల్ పోరుకు సిద్ధమైంది.1996లో స్టెఫీగ్రాఫ్ తర్వాత యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జర్మనీ క్రీడాకారిణిగా కెర్బర్ ఘనత సాధించింది. 28 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండర్ జనవరిలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ దక్కించుకుంది. యూఎస్ ఓపెన్ లో ఫైనల్లో అడుగుపెట్టడంతో పాటు కెర్బర్ నంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. తన క్రీడా జీవితంలో ఇదో అద్భుతమైన రోజు అని కెర్బర్ పేర్కొంది. -
ఫైనల్ బెర్త్ కోసం హోరాహోరీ!
యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో ఫైనల్ బెర్త్ కోసం సెమిఫైనల్లో మాజీ నంబర్ వన్, డెన్మార్క్ ప్లేయర్ కరోలిన్ వోజ్నియాకి జర్మనీ స్టార్ ఏంజెలిక్ కెర్బర్ తో తలపడనుంది. క్వార్టర్స్ లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్ లో 6-0, 6-2 తేడాతో హోబ్లింగ్ అనస్తాసిజా సెవత్సోవాపై నెగ్గి సెమిస్ చేరింది. సెవత్సోవకు ఇదే తొలి గ్రాండ్ స్లామ్ క్వార్టర్స్. వోజ్నియాకి 2009, 2014లో యూఎస్ ఓపెన్ రన్నరప్ గా నిలిచిన విషయం తెలిసిందే. 2010, 2011లో సెమిఫెనల్లోనే ఆమె పోరాటం ముగిసింది. తాజాగా మరోసారి సెమిస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. మరోవైపు రెండో సీడ్ కెర్బర్ కూడా యూఎస్ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తోంది. ఇటలీకి చెందిన రోబెర్టా విన్సీపై 7-5, 6-0తో నెగ్గి సెమిఫైనల్లోకి ప్రవేశించింది. రెండు వరుస సెట్లలో ప్రత్యర్థని మట్టికరిపించింది. ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్ కెర్బర్ కు ఇది రెండో యూఎస్ సెమిఫైనల్. తొలిసారి 2011లో సెమిఫైనల్ చేరిన కెర్బర్ ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రదర్శన చేయలేదు. అయితే వోజ్నియాకిపై గెలుపోటముల రికార్డు 7-5తో ఇప్పటివరకూ కెర్బర్ దే పైచేయిగా కనిపిస్తోంది. -
ముగ్గురే మిగిలారు
♦ మహిళల టాప్-10లో ఏడుగురు అవుట్ ♦ నాలుగో సీడ్ వొజ్నియాకి ఇంటిముఖం ♦ యూఎస్ ఓపెన్ టోర్నీ న్యూయార్క్ : యువతారల తళుకులతో ఈసారి యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ విభాగంలో సంచలనాల మోత మోగుతోంది. మూడో రౌండ్ పూర్తికాకముందే టాప్-10 సీడింగ్స్‌లో నుంచి ఏడుగురు క్రీడాకారిణులు ఇంటిముఖం పట్టారు. తాజాగా ఈ జాబితాలో నిరుటి రన్నరప్, నాలుగో సీడ్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్)... ఈ ఏడాది వింబుల్డన్ రన్నరప్, తొమ్మిదో సీడ్ గార్బినె ముగురుజా (స్పెయిన్) చేరారు. గాయం కారణంగా మూడో సీడ్ షరపోవా (రష్యా) చివరి నిమిషంలో వైదొలగగా... ఆరో సీడ్ సఫరోవా (చెక్ రిపబ్లిక్), ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా), ఎనిమిదో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్), పదో సీడ్ కార్లా నవారో (స్పెయిన్) తొలి రౌండ్లోనే ఓడిపోయారు. ఫలితంగా ప్రస్తుతం టాప్-10 నుంచి ముగ్గురు (టాప్ సీడ్ సెరెనా, రెండో సీడ్ సిమోనా హలెప్, ఐదో సీడ్ క్విటోవా) మాత్రమే బరిలో మిగిలారు. నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకొని... కెరీర్లో ఒక్క గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గకుండానే గతంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన వొజ్నియాకికి ఈసారీ నిరాశే మిగిలింది. అన్‌సీడెడ్ పెట్రా సెట్‌కోవ్‌స్కా (చెక్ రిపబ్లిక్)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో వొజ్నియాకి 4-6, 7-5, 6-7 (1/7)తో ఓడిపోయింది. 3 గంటల 2 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో వొజ్నియాకి నాలుగు మ్యాచ్ పాయింట్లను వదులుకొని ఓటమి పాలవ్వడం గమనార్హం. నిర్ణాయక మూడో సెట్లో స్కోరు 5-4 వద్ద సెట్‌కోవ్‌స్కా సర్వీస్‌లో ఒకసారి... స్కోరు 6-5 వద్ద సెట్‌కోవ్‌స్కా సర్వీస్‌లోనే మూడుసార్లు వొజ్నియాకి మ్యాచ్ పాయింట్లను చేజార్చుకుంది. గట్టెక్కిన ఆండీ ముర్రే పురుషుల సింగిల్స్ విభాగంలో మూడో సీడ్ ఆండీ ముర్రే (బ్రిటన్) ఐదు సెట్ల పోరాటంలో గట్టెక్కగా... రెండో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) కేవలం 80 నిమిషాల్లోనే తన ప్రత్యర్థిని చిత్తు చేశాడు. అడ్రియన్ మనారినో (ఫ్రాన్స్)తో జరిగిన రెండో రౌండ్లో ముర్రే 5-7, 4-6, 6-1, 6-3, 6-1తో విజయం సాధించాడు. ఫెడరర్ 6-1, 6-2, 6-1తో స్టీవ్ డార్సిస్ (బెల్జియం)పై గెలిచాడు. యూఎస్ ఓపెన్‌లో 16వ సారి ఆడుతోన్న ఫెడరర్ మూడో రౌండ్ చేరుకునేలోపు తన ప్రత్యర్థులకు కేవలం తొమ్మిది గేమ్‌లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఐదో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), ఆరో సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్), 12వ సీడ్ రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్), 13వ సీడ్ జాన్ ఇస్నెర్ (అమెరికా), 15వ సీడ్ అండర్సన్ (దక్షిణాఫ్రికా) కూడా మూడో రౌండ్లోకి ప్రవేశించారు. మరోవైపు చివరి సారిగా యూఎస్ ఓపెన్‌లో ఆడిన 2001 చాంపియన్ లీటన్ హెవిట్ (ఆస్ట్రేలియా) 3-6, 2-6, 6-3, 7-5, 5-7తో బెర్నాడ్ టామిక్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయాడు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత హెవిట్ వీడ్కోలు తీసుకోనున్నాడు. -
యూఎస్ ఓపెన్ లో సెరెనా 'హ్యాట్రిక్'
న్యూయార్క్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ ‘హ్యాట్రిక్’ సాధించింది. వరుసగా మూడోసారి టైటిల్ చేజిక్కించుకుంది. సొంతగడ్డపై జరిగిన తుదిపోరులో స్నేహితురాలిని ఓడించి కెరీర్ లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకుంది ఈ నల్లకలువ. ఆదివారం అర్థరాత్రి దాటిన జరిగిన తర్వాత ఫైనల్లో డెన్మార్క్ భామ కరోలైన్ వొజ్నియాను వరుస సెట్లలో ఓడించింది. 6-3, 6-3తో వొజ్నియాను కంగుతినిపించింది. ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న తొలి ‘గ్రాండ్‌స్లామ్’ టైటిల్ అందుకోవాలనుకున్న వొజ్నియా ఆశలపై నీళ్లు చల్లింది. కాగా, ఇదే టోర్నీలో 2011లో రన్నరప్‌గా నిలిచిన సెరెనా 2012, 2013లలో విజేతగా నిలిచింది. -
ఫైనల్లో సెరెనా, వొజ్నియాకి
ఫైనల్ నేటి రాత్రి గం. 9.30 నుంచి టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం టాప్-10లో ఎనిమిది మంది సీడెడ్ క్రీడాకారిణులు ప్రిక్వార్టర్ ఫైనల్లోపే నిష్ర్కమించడంతో అందరి దృష్టి టాప్ సీడ్ సెరెనా విలియమ్స్, పదో సీడ్ కరోలైన్ వొజ్నియాకిలపైనేపడింది. అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ ఈ ఇద్దరు ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా అంతిమ సమరానికి అర్హత సాధించారు. యూఎస్ ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ సాధించడంతోపాటు కెరీర్లో 18వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గేందుకు సెరెనా... గతంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను అధిరోహించినా ఇన్నాళ్లూ అందని ద్రాక్షగా ఉన్న తొలి ‘గ్రాండ్‌స్లామ్’ విజయాన్ని రుచి చూసేందుకు వొజ్నియాకి నేడు అమీతుమీ తేల్చుకోనున్నారు. న్యూయార్క్: ఈ ఏడాది తొలి మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరలేకపోయిన ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ సొంతగడ్డపై మాత్రం తన జోరు కొనసాగిస్తోంది. సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో ఈ నల్లకలువ వరుసగా నాలుగో ఏడాది టైటిల్ పోరుకు చేరుకుంది. ఇదే టోర్నీలో 2011లో రన్నరప్‌గా నిలిచిన సెరెనా 2012, 2013లలో విజేతగా నిలిచింది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సెరెనా 6-1, 6-3తో 17వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా)పై అలవోకగా గెలిచింది. కేవలం 60 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో సెరెనా ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు వచ్చిన ఆరుసార్లూ ఆమే పాయింట్లు సాధించింది. యూఎస్ ఓపెన్‌లో ఎనిమిదోసారి ఫైనల్‌కు చేరిన సెరెనా ఈసారి తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. అంతేకాకుండా గత ఆరు మ్యాచ్‌ల్లో ఆమె ఒక సెట్లో గరిష్టంగా మూడు గేమ్‌లు మాత్రమే సమర్పించుకుంది. నాలుగేళ్ల తర్వాత...: డెన్మార్క్ భామ వొజ్నియాకి 2009 తర్వాత రెండోసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లోకి చేరుకుంది. అన్‌సీడెడ్ క్రీడాకారిణి షుయె పెంగ్ (చైనా)తో జరిగిన సెమీఫైనల్లో వొజ్నియాకి 7-6 (7/1), 4-3తో ఆధిక్యంలో ఉన్నదశలో గాయం కారణంగా పెంగ్ మ్యాచ్ నుంచి వైదొలిగింది. దాంతో వొజ్నియాకిని విజేతగా ప్రకటించారు. ఎండ తీవ్రతను తట్టుకోలేకపోయిన పెంగ్ రెండో సెట్ ఎనిమిదో గేమ్ జరుగుతున్న సమయంలో కాలి కండరాలు పట్టేయడంతో కోర్టులోనే కుప్పకూలిపోయింది. నిర్వాహకులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. 2009 యూఎస్ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన వొజ్నియాకి... కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఎనిమిది వేర్వేరు మంది... సెరెనా, వొజ్నియాకి ఫైనల్‌కు చేరడంతో... 37 ఏళ్ల తర్వాత ఒకే సీజన్‌లోని నాలుగు గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో ఎనిమిది మంది వేర్వేరు క్రీడాకారిణులు ఫైనల్‌కు చేరారు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నా లీ (చైనా), సిబుల్కోవా (స్లొవేకియా); ఫ్రెంచ్ ఓపెన్‌లో షరపోవా (రష్యా), సిమోనా హలెప్ (రుమేనియా); వింబుల్డన్‌లో క్విటోవా (చెక్ రిపబ్లిక్), బౌచర్డ్ ఫైనల్లోకి చేరారు. ఈసారి యుఎస్ ఓపెన్‌లో నా లీ బరిలోకి దిగకపోవడం... మిగతా ఏడుగురు ప్రిక్వార్టర్ ఫైనల్లోపే ఓడిపోయారు. -
వారెవ్వా... వొజ్నియాకి
సెమీస్‌లో డెన్మార్క్ స్టార్ ఎకతెరీనా మకరోవా కూడా ఎదురులేని ఫెడరర్ యూఎస్ ఓపెన్ ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ దాటిన ప్రతిసారీ కనీసం సెమీఫైనల్‌కు చేరింది. అదే ఆనవాయితీని నాలుగోసారి కొనసాగించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ షరపోవాను ఓడించిన ఈ డెన్మార్క్ భామ క్వార్టర్ ఫైనల్లో చెలరేగిపోయింది. తన ప్రత్యర్థి సారా ఎరానికి కేవలం ఒక గేమ్ కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది. న్యూయార్క్: ఒకవైపు టాప్-10 సీడింగ్స్‌లో ఎనిమిది మంది ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టగా... మరోవైపు పదో సీడ్ కరోలైన్ వొజ్నియాకి తన జోరును కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాను పాల్గొన్న గత పది గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కనీసం ఒక్కసారీ క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయిన వొజ్నియాకి ఈసారి నిలకడగా రాణిస్తూ నాలుగోసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వొజ్నియాకి 6-0, 6-1తో 13వ సీడ్ సారా ఎరాని (ఇటలీ)ని చిత్తుగా ఓడించింది. కేవలం 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ మాజీ నంబర్‌వన్ కేవలం ఒకే ఒక్క గేమ్ కోల్పోవడం విశేషం. 2012లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన ఎరానికి మ్యాచ్ తొలి గేమ్‌లోనే వొజ్నియాకి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. అయితే వొజ్నియాకి నాలుగుసార్లు బ్రేక్ పాయింట్లను కాపాడుకుంది. ఆ తర్వాత ఈ ఇటలీ క్రీడాకారిణి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తొలి సెట్‌ను 29 నిమిషాల్లో సొంతం చేసుకుంది. రెండో సెట్ తొలి గేమ్‌లోనే తన సర్వీస్‌ను చేజార్చుకున్న వొజ్నియాకి ఆ తర్వాత చెలరేగింది. ఎరాని సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని సెమీఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో అన్‌సీడెడ్ షుయె పెంగ్ (చైనా)తో వొజ్నియాకి తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-4, 6-2తో 16వ సీడ్ అజరెంకా (బెలారస్)ను ఓడించి కెరీర్లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది. ‘స్విస్ స్టార్’ పదోసారి... పురుషుల సింగిల్స్‌లో ఐదుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) గత 11 ఏళ్లలో పదోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ 6-4, 6-3, 6-2తో 17వ సీడ్ రొబెర్టొ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై గెలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. 20వ సీడ్ గేల్ మోన్ఫిస్ (ఫ్రాన్స్) 7-5, 7-6 (8/6), 7-5తో దిమిత్రోవ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 14వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 5-7, 7-6 (7/3), 6-4, 3-6, 6-3తో 26వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-1, 6-2, 6-4తో థియెమ్ (ఆస్ట్రియా)పై నెగ్గారు. సెమీస్‌లో సానియా జోడి మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 6-1, 1-0తో ఆధిక్యంలో ఉన్నదశలో వారి ప్రత్యర్థి జోడి జరీనా (కజకిస్థాన్) -యి ఫాన్ జు (చైనా) గాయంతో వైదొలిగింది. -
పెళ్లి కార్డులు పంచాక....
విడిపోయిన టెన్నిస్ స్టార్ వొజ్నియాకి, గోల్ఫర్ మెకల్రాయ్ లండన్: నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల్లోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఈ మేరకు పెళ్లి పత్రికలు పంపించారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆ ఇద్దరు విఖ్యాత క్రీడాకారులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు.... ప్రపంచ టెన్నిస్ మాజీ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), ప్రపంచ గోల్ఫ్ మాజీ నంబర్‌వన్ రోరీ మెకల్రాయ్. గతేడాది డిసెంబరు 31న సిడ్నీలో నూతన సంవత్సరం వేడుకల సాక్షిగా నిశ్చితార్థం చేసుకున్న వొజ్నియాకి, మెకల్రాయ్ ఈ ఏడాది ఆగస్టులో వివాహం చేసుకోవాలనుకున్నారు. గత వారాంతంలో పెళ్లి ఆహ్వానాలు పంపించారు. అయితే తామిద్దరం వివాహం చేసుకోవడంలేదని... పరస్పర అవగాహనతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు బుధవారం మెకల్రాయ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ‘సమస్య నావైపు నుంచి ఉంది. గత వారాంతంలో పెళ్లి ఆహ్వానాలు పంపించాం. అయితే ఇప్పుడపుడే నేను పెళ్లికి సిద్ధంగాలేనని భావించాను. ఈ మేరకు వొజ్నియాకితో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాను’ అని ఐర్లాండ్‌కు చెందిన 25 ఏళ్ల మెకల్రాయ్ వివరించాడు. 2009లో యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన వొజ్నియాకి ప్రస్తుతం ఈ ఆదివారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌కు సిద్ధమవుతోంది.