వారెవ్వా... వొజ్నియాకి
సెమీస్‌లో డెన్మార్క్ స్టార్
ఎకతెరీనా మకరోవా కూడా
ఎదురులేని ఫెడరర్
యూఎస్ ఓపెన్
ప్రపంచ మాజీ నంబర్‌వన్ కరోలైన్ వొజ్నియాకి యూఎస్ ఓపెన్‌లో నాలుగో రౌండ్ దాటిన ప్రతిసారీ కనీసం సెమీఫైనల్‌కు చేరింది. అదే ఆనవాయితీని నాలుగోసారి కొనసాగించింది. ప్రిక్వార్టర్ ఫైనల్లో మాజీ చాంపియన్ షరపోవాను ఓడించిన ఈ డెన్మార్క్ భామ క్వార్టర్ ఫైనల్లో చెలరేగిపోయింది. తన ప్రత్యర్థి సారా ఎరానికి కేవలం ఒక గేమ్ కోల్పోయి విజయాన్ని సొంతం చేసుకుంది.
న్యూయార్క్: ఒకవైపు టాప్-10 సీడింగ్స్‌లో ఎనిమిది మంది ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టగా... మరోవైపు పదో సీడ్ కరోలైన్ వొజ్నియాకి తన జోరును కొనసాగిస్తూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. తాను పాల్గొన్న గత పది గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లలో కనీసం ఒక్కసారీ క్వార్టర్ ఫైనల్ చేరుకోలేకపోయిన వొజ్నియాకి ఈసారి నిలకడగా రాణిస్తూ నాలుగోసారి యూఎస్ ఓపెన్‌లో సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది.
భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం జరిగిన క్వార్టర్ ఫైనల్లో వొజ్నియాకి 6-0, 6-1తో 13వ సీడ్ సారా ఎరాని (ఇటలీ)ని చిత్తుగా ఓడించింది. కేవలం 65 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఈ మాజీ నంబర్‌వన్ కేవలం ఒకే ఒక్క గేమ్ కోల్పోవడం విశేషం. 2012లో ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్‌గా నిలిచిన ఎరానికి మ్యాచ్ తొలి గేమ్‌లోనే వొజ్నియాకి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చింది. అయితే వొజ్నియాకి నాలుగుసార్లు బ్రేక్ పాయింట్‌లను కాపాడుకుంది. ఆ తర్వాత ఈ ఇటలీ క్రీడాకారిణి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తొలి సెట్‌ను 29 నిమిషాల్లో సొంతం చేసుకుంది.
రెండో సెట్ తొలి గేమ్‌లోనే తన సర్వీస్‌ను చేజార్చుకున్న వొజ్నియాకి ఆ తర్వాత చెలరేగింది. ఎరాని సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసి తన సర్వీస్‌లను కాపాడుకొని సెమీఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. సెమీఫైనల్లో అన్‌సీడెడ్ షుయె పెంగ్ (చైనా)తో వొజ్నియాకి తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో 17వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-4, 6-2తో 16వ సీడ్ అజరెంకా (బెలారస్)ను ఓడించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరింది.
‘స్విస్ స్టార్’ పదోసారి...
పురుషుల సింగిల్స్‌లో ఐదుసార్లు చాంపియన్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్) గత 11 ఏళ్లలో పదోసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఫెడరర్ 6-4, 6-3, 6-2తో 17వ సీడ్ రొబెర్టొ బాటిస్టా అగుట్ (స్పెయిన్)పై గెలిచాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేశాడు.
మరోవైపు ఏడో సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. 20వ సీడ్ గేల్ మోన్‌ఫిస్ (ఫ్రాన్స్) 7-5, 7-6 (8/6), 7-5తో దిమిత్రోవ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో ఫెడరర్‌తో పోరుకు సిద్ధమయ్యాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 14వ సీడ్ సిలిచ్ (క్రొయేషియా) 5-7, 7-6 (7/3), 6-4, 3-6, 6-3తో 26వ సీడ్ సిమోన్ (ఫ్రాన్స్)పై, ఆరో సీడ్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్) 6-1, 6-2, 6-4తో థియెమ్ (ఆస్ట్రియా)పై నెగ్గారు.
సెమీస్‌లో సానియా జోడి
మహిళల డబుల్స్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం సెమీస్‌కు చేరింది. క్వార్టర్ ఫైనల్లో సానియా జంట 6-1, 1-0తో ఆధిక్యంలో ఉన్నదశలో వారి ప్రత్యర్థి జోడి జరీనా (కజకిస్థాన్) -యి ఫాన్ జు (చైనా) గాయంతో వైదొలిగింది.