
మళ్లీ అదే కథ.. అదే వ్యథ. ఐసీసీ టోర్నమెంట్లలో దక్షిణాఫ్రికా తలరాత ఏ మాత్రం మారలేదు. 'చోకర్స్ అనే పేరును సఫారీలు మరోసారి సార్థకత చేసుకున్నారు. సెమీస్ గండాన్ని మరోసారి సౌతాఫ్రికా గట్టెక్కలేకపోయింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025) సెమీఫైనల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది.
363 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించడంలో బవుమా సేన విఫలమైంది. దీంతో బరువెక్కిన హృదయాలతో సఫారీలు ఇంటిముఖం పట్టారు. సెమీస్‌లో ఓడిపోవడం దక్షిణాఫ్రికాకు ఇదేమి తొలిసారి కాదు.
పాపం ప్రోటీస్..
ఇప్పటివరకు ఓవరాల్‌గా ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు పదిసార్లు సెమీఫైనల్స్ ఆడిన ప్రోటీస్ జట్టు ఏకంగా తొమ్మిదిసార్లు పరాజయం పాలైంది. దీంతో ఐసీసీ వన్డే టోర్నీ సెమీస్‌లో అత్యధిక సార్లు ఓటమిపాలైన జట్టుగా సౌతాఫ్రికా చెత్తరికార్డు నెలకొల్పింది. కాగా ప్రతీ ఐసీసీ ఈవెంట్‌లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగే దక్షిణాఫ్రికా.. కీలక నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అయ్యి ఇంటిదారి పడుతుంటుంది.
ఐసీసీ ఛాంపియన్స్ తొట్టతొలి ఎడిషన్(1998) విజేతగా నిలిచిన సౌతాఫ్రికా.. ఆ తర్వాత ఈ మెగా టోర్నీలో కనీసం ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేకపోయింది. 2000, 2002 ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్లలో వరుసగా సెమీ ఫైనల్స్‌కు చేరినప్పటికి.. రెండు సార్లు కూడా భారత్ చేతిలోనే ఓటమి పాలైంది. ఆ తర్వాత 2006, 2013 సీజన్‌లలో సెమీస్‌లో అడుగుపెట్టిన సౌతాఫ్రికా.. అక్కడ కూడా అదే తీరును కనబరిచింది. మళ్లీ ఇప్పుడు తాజా ఎడిషన్‌లో కూడా సౌతాఫ్రికాకు నిరాశే ఎదురైంది.
వన్డే వరల్డ్‌కప్‌లో కూడా..
కాగా వన్డే వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికాది ఇదే తీరు. అయితే ఈ ప్రపంచకప్‌లో సఫారీలను ఒత్తడితో పాటు దురదృష్టం కూడా వెంటాడింది. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా అతిథ్యమిచ్చాయి. సౌతాఫ్రికాకు ఇదే తొలి వన్డే ప్రపంచకప్. దక్షిణాఫ్రికా తమ తొలి వరల్డ్‌కప్‌లోనే సెమీస్‌కు చేరి అందరిని ఆశ్చర్యపరిచింది.
అయితే ఈమ్యాచ్‌లో ప్రోటీస్ జట్టుకు అదృష్టం కలిసిరాలేదు. వర్షం కారణంగా ఇంగ్లండ్ చేతిలో సౌతాఫ్రికా అనుహ్యంగా ఓటమి పాలైంది. ఆ తర్వాత 1999 వరల్డ్ కప్‌లో కూడా దక్షిణాఫ్రికా సెమీఫైనల్‌ల్లో అడుగుపెట్టింది. ఫైనల్ బెర్త్ కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోడు. ఈ మ్యాచ్‌లో ఈజీగా గెలవాల్సిన సౌతాఫ్రికా.. ఆఖరికి టైగా ముగించింది.
రన్‌రేట్ ఆధారంగా ఆస్ట్రేలియా ఫైనల్‌కు క్వాలిఫై అయింది. అప్పటిలో సూపర్ ఓవర్ లేదు. దీంతో ప్రోటీస్ ఇంటిముఖం పట్టింది. ఆ తర్వాత 2007లో ఆస్ట్రేలియాపై, 2015లో న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. 2015 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను సౌతాఫ్రికా తమ సొంత తప్పిదాల్ల వల్ల చేజార్చుకుంది.
ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ 43 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 281 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ తర్వాత డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం న్యూజిలాండ్ టార్గెట్‌ను 298 పరుగులగా నిర్ధేశించారు. న్యూజిలాండ్ ఆరంభంలో అద్బుతంగా ఆడినప్పటికి.. మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.
అయితే మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన గ్రాంట్ ఇలియట్‌ను రనౌట్ చేసే ఈజీ ఛాన్స్‌ను డివిలియర్స్ మిస్ చేసుకున్నాడు. దీంతో ఇలియట్ ఆఖరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను సఫారీల నుంచి లాగేసుకున్నాడు. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్, మోర్నీ మోర్కల్ వంటి దిగ్గజ క్రికెటర్లు కంటతడి పెట్టుకున్నారు. అదేవిధంగా టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో కూడా సౌతాఫ్రికా ఓటమి చవిచూసింది.
చదవండి: మీరిద్దరు మాట్లాడుకుంటూనే ఉండండి.. నా పని నేను చేస్తా: జడ్డూ అసహనం
Comments
Please login to add a commentAdd a comment