
డిఫెండింగ్ చాంపియన్‌పై నెగ్గి ఫైనల్లోకి దూసుకెళ్లిన బ్రిటన్ ప్లేయర్ డ్రేపర్
కాలిఫోర్నియా: ‘హ్యాట్రిక్’ సాధించాలనే లక్ష్యంతో ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో బరిలోకి దిగిన ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్‌కరాజ్‌కు నిరాశ ఎదురైంది. గత రెండేళ్లు చాంపియన్‌గా నిలిచిన అల్‌కరాజ్ ఈసారి సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 14వ ర్యాంకర్, బ్రిటన్ ప్లేయర్ జేక్ డ్రేపర్ అద్భుత ఆటతీరుతో అల్‌కరాజ్ ఆట కట్టించి తన కెరీర్‌లో తొలిసారి మాస్టర్స్ సిరీస్ టోర్నీలో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో 13వ సీడ్ డ్రేపర్ 6–1, 0–6, 6–4తో రెండో సీడ్ అల్‌కరాజ్‌ను బోల్తా కొట్టించాడు. ఈ విజయంతో సోమవారం విడుదల చేసే అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) ర్యాంకింగ్స్‌లో డ్రేపర్ తొలిసారి టాప్–10లోకి దూసుకురానున్నాడు. 23 ఏళ్ల డ్రేపర్ గత ఏడాది వియన్నా ఓపెన్, స్టుట్‌గార్ట్ ఓపెన్‌లలో విజేతగా నిలిచాడు.
ఫైనల్లో 12వ సీడ్ హోల్గర్ రూనే (డెన్మార్క్)తో డ్రేపర్ తలపడతాడు. తొలి సెమీఫైనల్లో ప్రపంచ 13వ ర్యాంకర్ రూనే 7–5, 6–4తో ఐదో సీడ్ మెద్వెదెవ్ (రష్యా)పై గెలిచాడు. అల్‌కరాజ్‌తో ఐదోసారి తలపడ్డ డ్రేపర్ ఈసారి పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1 గంట 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో డ్రేపర్ నాలుగు ఏస్‌లు సంధించి, రెండు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు అల్‌కరాజ్ 30 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment