పెళ్లి కార్డులు పంచాక....
విడిపోయిన టెన్నిస్ స్టార్ వొజ్నియాకి, గోల్ఫర్ మెకల్రాయ్
లండన్: నాలుగేళ్లుగా ప్రేమించుకున్నారు. కొద్ది రోజుల్లోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. ఈ మేరకు పెళ్లి పత్రికలు పంపించారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ ఆ ఇద్దరు విఖ్యాత క్రీడాకారులు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఇద్దరు ఎవరో కాదు.... ప్రపంచ టెన్నిస్ మాజీ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్), ప్రపంచ గోల్ఫ్ మాజీ నంబర్‌వన్ రోరీ మెకల్రాయ్. గతేడాది డిసెంబరు 31న సిడ్నీలో నూతన సంవత్సరం వేడుకల సాక్షిగా నిశ్చితార్థం చేసుకున్న వొజ్నియాకి, మెకల్రాయ్ ఈ ఏడాది ఆగస్టులో వివాహం చేసుకోవాలనుకున్నారు.
గత వారాంతంలో పెళ్లి ఆహ్వానాలు పంపించారు. అయితే తామిద్దరం వివాహం చేసుకోవడంలేదని... పరస్పర అవగాహనతో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకొని విడిపోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు బుధవారం మెకల్రాయ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ‘సమస్య నావైపు నుంచి ఉంది. గత వారాంతంలో పెళ్లి ఆహ్వానాలు పంపించాం. అయితే ఇప్పుడపుడే నేను పెళ్లికి సిద్ధంగాలేనని భావించాను. ఈ మేరకు వొజ్నియాకితో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నాను’ అని ఐర్లాండ్‌కు చెందిన 25 ఏళ్ల మెకల్రాయ్ వివరించాడు. 2009లో యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన వొజ్నియాకి ప్రస్తుతం ఈ ఆదివారం మొదలయ్యే ఫ్రెంచ్ ఓపెన్‌కు సిద్ధమవుతోంది.